AQI: హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయికి వాయుకాలుష్యం.. ఎయిర్ క్వాలిటీని ఎలా కొలుస్తారో తెలుసా?

Published : Nov 09, 2026, 11:12 AM IST

Hyderabad AQI: పలు నగరాల్లో వాయుకాలుష్యం ఊపిరాడనివ్వడం లేదు. దీపావళి వేడుకల తర్వాత హైదరాబాద్, ఢిల్లీలలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ప్రమాదకర స్థాయికి చేరిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లెక్కలు, కాలుష్యం కొలిచే విధానం ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
ఢిల్లీనే కాదు భాగ్యనగరం కూడా బ్లాంక్.. ప్రమాదకర స్థాయికి చేరిన గాలి కాలుష్యం

దీపావళి వేడుకల అనంతరం దేశ రాజధాని ఢిల్లీతో పాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నగరం కూడా దట్టమైన పొగ కప్పేసింది. బంజారాహిల్స్, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్, సోమాజిగూడ వంటి ప్రధాన ప్రాంతాల్లో రాత్రి 12 తర్వాత కూడా పటాకులు కాల్చడంతో గాలి నాణ్యత ఘోరంగా పడిపోయింది. రాత్రి 9:30 గంటల ప్రాంతంలో పీఎం 2.5 సాంద్రత అత్యధికంగా 392 మైక్రోగ్రాములు పర్ క్యూబిక్ మీటర్‌కు చేరగా, నగర సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఏకంగా 509 ప్రమాదకర స్థాయిని తాకింది.

మసీద్ బండ సమీపంలోని రవి కాలనీలో ఏకంగా ఏక్యూఐ రికార్డు స్థాయిలో 995గా నమోదైంది. నగరంలో లోహపు, సల్ఫర్ గంధకం వాసన అలుముకోవడంతో జనాలు కంటి మంటలు, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి 11:30 గంటలకు నగర సగటు ఏక్యూఐ 442 ఉండగా, శేరిలింగంపల్లిలో 666గా నమోదైంది. సోమవారం ఉదయానికి కూడా వాయు నాణ్యత ప్రమాదకరంగానే ఉంది.

25
ఢిల్లీలో డబ్ల్యూహెచ్ వో పరిమితి కంటే 66 రెట్లు ఎక్కువ కాలుష్యం!

ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ రిపోర్టుల ప్రకారం, నవంబర్ 9 తెల్లవారుజామున పంజాబీ బాగ్ పరిధిలో పీఎం 2.5 సాంద్రత అత్యధికంగా 993 మైక్రోగ్రాములు పర్ క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన 24 గంటల సురక్షిత పరిమితి (15 మైక్రోగ్రాములు) కంటే దాదాపు 66.2 రెట్లు ఎక్కువ.

అదేవిధంగా వివేక్ విహార్‌లో డబ్ల్యూహెచ్‌వో పరిమితి కంటే 58.2 రెట్లు, ఆర్.కే. పురంలో 61.6 రెట్లు ఎక్కువ కాలుష్యం నమోదైంది. ఆనంద్ విహార్, బవానా వంటి పర్యవేక్షణ కేంద్రాల డేటా కొన్ని గంటల పాటు నిలిచిపోవడం వల్ల వాస్తవ కాలుష్య స్థాయిలు ఇంకా ఎక్కువగానే ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. బురారీ క్రాసింగ్‌లో ఏక్యూఐ 441, రోహిణిలో 430గా రికార్డైంది.

35
పీఎం 2.5 అంటే ఏమిటి? శరీరంలోకి ఎలా చేరుతుంది?

కాలుష్య వివరాల్లో మనం తరచుగా వినే పదం 'పీఎం 2.5'. పీఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్. గాలిలో తేలియాడే అతి సూక్ష్మమైన ధూళి, రసాయన కణాలు ఇవి. వీటి పరిమాణం 2.5 మైక్రాన్లు లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది. ఇది మన తలవెంట్రుక మందం కంటే 30 రెట్లు చిన్నది.

ఇంత చిన్నగా ఉండటం వల్ల మనం శ్వాస తీసుకున్నప్పుడు ఈ కణాలు ముక్కులోని వెంట్రుకలు, ఊపిరితిత్తుల రక్షణ వ్యవస్థలను దాటుకుని నేరుగా ఊపిరితిత్తుల లోపలి భాగాలకు చేరుకుంటాయి. అంతేకాకుండా రక్తం ద్వారా శరీరంలోని వివిధ అవయవాలకు వ్యాపించి శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు, ఆస్తమా వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. పటాకులు కాల్చడం వల్ల భాగ్యనగరం, ఢిల్లీ వాతావరణంలో ఈ కణాలు భారీగా పెరిగాయి.

45
అసలు ఏక్యూఐ అంటే ఏమిటి? దానిని ఎలా కొలుస్తారు?

గాలి ఎంత స్వచ్ఛంగా ఉందో లేదా ఎంత కలుషితమైందో తెలిపే కొలమానమే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ). వాతావరణంలోని ప్రధాన కాలుష్య కారకాలను ప్రామాణికంగా తీసుకుని సాధారణ ప్రజలకు అర్థమయ్యేలా 0 నుండి 500 వరకు ఒక స్కేల్‌ రూపంలో ఏక్యూఐని లెక్కిస్తారు.

భారతదేశంలో సీపీసీబీ ముఖ్యంగా 8 రకాల కాలుష్య కారకాలను ఆధారంగా చేసుకుని ఏక్యూఐని లెక్కిస్తుంది..

• PM 2.5 (సూక్ష్మ ధూళి కణాలు)

• PM 10 (సాధారణ ధూళి కణాలు)

• నైట్రోజన్ డయాక్సైడ్ (NO2)

• సల్ఫర్ డయాక్సైడ్ (SO2)

• కార్బన్ మోనాక్సైడ్ (CO)

• ఓజోన్ (O3)

• అమ్మోనియా (NH3)

• సీసం (Lead - Pb)

పైన పేర్కొన్న కాలుష్య కారకాల 24 గంటల సగటు సాంద్రతను ఆటోమేటిక్ సెన్సార్లు నమోదు చేస్తాయి. ఆ విలువలను బట్టి సంక్లిష్టమైన గణిత సమీకరణాల ద్వారా సబ్-ఇండెక్స్‌లు లెక్కిస్తారు. వాటిలో ఏ కాలుష్య కారకం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందో, ఆ విలువనే ఆ ప్రాంతపు తుది ఏక్యూఐగా ప్రకటిస్తారు.

55
ఏక్యూఐ వర్గీకరణ.. గ్రాప్ నిబంధనలు ఇవే

సాధారణ ప్రజల ఆరోగ్య భద్రత కోసం సీపీసీబీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ను 6 విభాగాలుగా వర్గీకరించింది. అవి..

• 0 – 50 (మంచిది): గాలి అత్యంత స్వచ్ఛమైనది.

• 51 – 100 (సంతృప్తికరం): స్వల్ప మార్పులు.

• 101 – 200 (మోస్తరు): ఆస్తమా బాధితులకు ఇబ్బందికరం.

• 201 – 300 (పేలవమైనది): శ్వాస సంబంధిత ఇబ్బందులు మొదలవుతాయి.

• 301 – 400 (అత్యంత పేలవమైనది): ఆరోగ్య సమస్యలు తీవ్రమవుతాయి.

• 401 – 500 (తీవ్రమైనది): ఆరోగ్యంగా ఉన్నవారిపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.

వాయు కాలుష్యం పెరిగినప్పుడు అత్యవసర చర్యలు అమలు చేయడానికి 'కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్' (CAQM) రూపొందించిన ప్లాన్ గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP).

Read more Photos on
click me!

Recommended Stories