Published : Jul 10, 2026, 04:26 PM ISTUpdated : Jul 10, 2026, 04:34 PM IST
నడి వర్షాకాలంలోనూ వేసవి తాపం తప్పడం లేదు. జూలై 11 నుండి 15 వరకు "మాన్సూన్ బ్రేక్'' పరిస్థితులు ఉంటాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రంలో వర్షాలు తగ్గి, ఎండలు మళ్లీ తీవ్రమయ్యే అవకాశం ఉందట.
తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఎండాకాలంలో అకాల వర్షాలు కురవడం చూశాం... ఇప్పుడు నడి వర్షాకాలంలో ఎండలు మండిపోవడం చూడబోతున్నాం. ఇప్పటికే వర్షాకాలం మొదలై నెల రోజులు గడిచినా ఎల్ నినో ప్రభావంతో పెద్దగా వానలు కురిసింది లేదు... ఇది చాలదన్నట్లు ఇకపై ఎండలు తీవ్రదూరం దాలుస్తాయట. ముఖ్యంగా తెలంగాణలో వాతావరణం మారిపోతుందని... కొద్దిరోజులు వర్షాలన్నవే కనిపించకుండా వేసవి స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు.
తెలంగాణలో జూలై 11, 2026 నుండి తీవ్రమైన ''బ్రేక్ మాన్సూన్'' పరిస్థితులు ఉండనున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. జూలై 15 వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం దాదాపుగా లేదని తెలిపారు. రుతుపవనాల విరామం అన్నది వర్షాకాలంలో అసాధారణ పరిణామం… ఇదే ఇప్పుడు కొనసాగుతోంది. ఎండలతో యావత్ రాష్ట్రం మళ్ళీ అల్లాడిపోతుందని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ఒకటి లేదా రెండు చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పరిణామం రాష్ట్ర వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపనుంది.
25
వేడెక్కుతున్న తెలంగాణ
నడి వర్షాకాలంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరగడం మొదలయ్యాయి… ఒకటి రెండు చోట్ల కాదు తెలంగాణవ్యాప్తంగా వాతావరణం వేడెక్కుతోంది. రాబోయే రోజుల్లో తూర్పు తెలంగాణలోని మళ్లీ ఎండలు మండిపోతాయట... పలు ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 36 నుండి 38 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు. ఇక ఉత్తర తెలంగాణలో 34 నుండి 36 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదవుతాయంటున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో 33 నుండి 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు.
35
రాబోయే నాల్రోజులు జాగ్రత్త..
తెలంగాణలో వేడి గాలులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది... ముఖ్యంగా జులై 12 నుండి 15వ తేదీ వరకు పరిస్థితి అత్యంత దారుణంగా ఉంటుందని వెదర్ మ్యాన్ అంచనా వేస్తేన్నారు. ఈ నాలుగు రోజులు తెలంగాణలోని అనేక ప్రాంతాలు తీవ్రమైన ఉష్ణోగ్రతలను చవిచూడనున్నాయని అంటున్నారు.
ముఖ్యంగా తూర్పు తెలంగాణలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు వెదర్ మ్యాన్. ఇప్పటికే ఎండలు తగ్గి వర్షాలు పెరగడం వల్ల వాతావరణం మారి ప్రజారోగ్యం ప్రభావం చూపిస్తోంది... ఇప్పుడు వానలు తగ్గి ఎండలు పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి.
రుతుపవనాల విరామానికి ప్రధాన కారణం ఎల్ నినో ప్రభావం. పసిఫిక్ మహాసముద్రంలో జరిగే వాతావరణ మార్పునే ఎల్ నినో అంటారు... ఇది ప్రపంచవ్యాప్తంగా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పొడి వాతావరణానికి, వర్షాల కొరతకు ఇదే ప్రధాన కారణం. ఈ సమయంలో అక్కడక్కడా ఉష్ణోగ్రతల పెరుగుదల వల్ల 'హీట్ ఇండ్యూస్డ్ రెయిన్స్' అంటే వేడి కారణంగా ఏర్పడే స్థానిక వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు సముద్రంలో నీటి చుక్కల వంటివి. అంటే అవి వర్షాభావ పరిస్థితులను పెద్దగా ప్రభావితం చేయలేవు. అందుకే భారీ వర్షాలు ఆశించవద్దు.
55
మినీ వేసవి మళ్ళీ సిద్ధంకండి
తెలంగాణ ప్రజలు ఈ "బ్రేక్ మాన్సూన్" పరిస్థితులకు, ఎల్ నినో ప్రభావానికి సిద్ధంగా ఉండాలి. నడి వర్షాకాలంలో మళ్లీ వేసవి లాంటి వాతావరణం నెలకొంటుంది. జూలై 10 నుండి జులై 15 వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దాంతో పాటు, గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో మధ్యస్థాయి గాలులు కొనసాగే అవకాశం ఉంది. ఈ గాలులు వేడిని మరింత పెంచుతాయి.
ఎండల తీవ్రత పెరుగుతున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు బయట తిరగకుండా ఉండటం మంచిది. శరీరాన్ని డీహైడ్రేషన్ నుండి కాపాడుకోవడానికి తగినంత నీరు తాగాలి. వృద్ధులు, పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈ వాతావరణం ప్రజలకు సవాల్ విసురుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ పేర్కొన్నారు.