హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణతో శివారు ప్రాంతాల్లో భూములకు రెక్కలు రానున్నాయి. మెట్రో కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో భూమికి డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం తక్కువ ధరలకు లభిస్తున్న ప్లాట్లు, నివాస గృహాల విలువ రాబోయే కొన్నేళ్లలో కనీసం 20-30 శాతం పెరగవచ్చని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు… కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఇది ఒక సువర్ణావకాశం కానుంది. మెట్రో మార్గానికి దగ్గరగా ఉన్న గ్రామాలు, చిన్న పట్టణాలు కూడా వేగంగా అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడిదారులు దీర్ఘకాలిక లాభాల కోసం ఇప్పుడు పెట్టుబడి పెట్టవచ్చు.
ఐటీ కారిడార్ కు దగ్గరగా ఉండటంతో ఇప్పటికే కూకట్ పల్లి, మియాపూర్ వంటి ప్రాంతాల్లో ఇంటి స్థలాలు, ఇండిపెండెంట్ ఇళ్లు, అపార్ట్ మెంట్ ప్లాట్స్ కి మంచి డిమాండ్ ఉంది. మెట్రో సదుపాయం కూడా ఉండటం ఈ ప్రాంతాలకు మరింత ప్లస్ అయ్యింది. ఇక మెట్రో రెండో దశతో లింగంపల్లి, బీరంగూడ, రామచంద్రాపురం, పటాన్ చెరు ప్రాంతాల రూపురేఖలు కూడా సేమ్ ఇలాగే మారిపోనున్నాయి.
ప్రస్తుతం పటాన్ చెరుకు ఔటర్ రింగ్ రోడ్డు అందుబాటులో ఉంది... అయినా ఈ ప్రాంతం ఆశించిన స్థాయిలో డెవలప్ కాలేదు. ఈ పటాన్ చెరు, ఇస్నాపూర్ ప్రాంతాలు అడ్డా కూలీలు, నిర్మాణ కార్మికులు, చిన్నచిన్న పనివారికి నిలయాలుగా మారాయి... ఐటీ ఉద్యోగులు ఇక్కడ ఎక్కువగా స్థిరపడలేదు. ఐతే మెట్రో రాకతో రవాణా సదుపాయం మెరుగుపడుతుంది కాబట్టి ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతాలపై ఆసక్తి చూపించే అవకాశాలున్నాయి... దీంతో మరో మియాపూర్, నిజాంపేట్, కూకట్ పల్లిలా మారే అవకాశాలుంటాయి. రియల్ ఎస్టేట్ బూమ్ తో పాటు అపార్ట్ మెంట్ ప్లాట్స్ కొనుగోళ్లు, ఇంటి అద్దెలు పెరుగుతాయి. కాబట్టి ఇప్పుడు తక్కువ ధరల్లో లభిస్తున్న ప్లాట్స్, ఇళ్లు కొనుగోలుచేసినవారు భవిష్యత్ లో మంచి లాభాలు పొందవచ్చు.