తెలంగాణలో వర్షాల తీవ్రత రోజురోజుకూ పెరగనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా వానలు దంచికొడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఐఎండీ 'ఎల్లో అలర్ట్' జారీ చేసింది. వర్షంతో పాటు ఉరుములు, మెరుపులు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నందున ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.