ఇవాళ (ఆగస్ట్ 22, శనివారం) ఉదయం నుండి మధ్యాహ్నం వరకు తెలంగాణలో ఎండ, ఉక్కపోత కొనసాగుతుందని వెదర్ మ్యాన్ తెలిపారు. సాయంత్రం ఆకాశంలో మేఘాలు కమ్ముకుని వర్షాలు మొదలవుతాయని... మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో సాయంత్రం లేదా రాత్రి వేళలో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు. ఇక సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో రాత్రి సమయంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు.
హైదరాబాద్ విషయానికి వస్తే రోజంతా పొడి వాతావరణం ఉంటుందని వెదర్ మ్యాన్ వెల్లడించారు. సాయంత్రం లేదా రాత్రి సమయంలో కొన్నిచోట్ల చిరుజల్లులు, ఒకటిరెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. రేపు (ఆగస్ట్ 23, ఆదివారం) తెలంగాణలో వర్షాలు జోరందుకుంటాయని... భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ ప్రకటించారు.