తెలంగాణ వాతావరణ సమాచారం :
తెలంగాణలో ఇవాళ, రేపు (శుక్ర, శనివారం) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. శుక్రవారం కొమరంభీమ్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, సిద్దిపేట, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. కొన్నిచోట్ల వర్షం పడకుండా ఆకాశం మేఘాలతో కమ్ముకుని వాతావరణం చల్లగా ఉంటుంది.
శనివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మధ్యాహ్నం అంతా ఎండలు, సాయంత్రానికి వర్షాలు కురవనున్నాయి. చిరుజల్లుల కారణంగా వాతావరణ ఆహ్లాదకరంగా మారిపోనుంది... కానీ ఈ ఎండాకాలం వర్షాలు చాలా ప్రమాదకరమైనవి. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి రైతులు అప్రమత్తంగా ఉండాలని... పంటలను కాపాడుకునేందుకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈదురుగాలుల వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి... కాబట్టి చెట్లు, పెద్దపెద్ద హోర్డింగ్స్ కి దూరంగా ఉండాలి. వర్షం కురిసే సమయంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నారు.
ఇదిలాఉంటే ఈ రెండ్రోజులు పలు జిల్లాల్లో ఎండలు కూడా మండిపోనున్నాయట. ఆదిలాబాద్ జిల్లాల్లో కనిష్టంగా 42 డిగ్లీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. నల్గొండ, రామగుండం, మహబూబ్ నగర్, ఖమ్మం, హన్మకొండ, భద్రాచలంలో 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ లో మధ్యాహ్నం అధిక ఉష్ణోగ్రతలు, సాయంత్రం వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసారు.