Viral News: సోషల్ మీడియాలో మరో వింత ప్రచారం చర్చనీయాంశంగా మారింది. పంది ముఖాన్ని పోలిన మాస్క్‌తో ఉన్న వ్యక్తి ఫొటో సోషల్ మీడియాతో పాటు, గోడలపై పోస్టర్లు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘సైలెంట్ పార్టీ’ పేరుతో సాగుతున్న ఈ ప్రచారం వెనకాల ఉంది ఎవరు.?
విజయవాడ వీధుల్లో వింత పోస్టర్లు.. ఎవరీ మాస్క్ వ్యక్తి?
విజయవాడతో పాటు హైదరాబాద్‌లోని ప్రాంతాల్లో గత రెండు రోజులుగా ‘సైలెంట్ పార్టీ’ పేరుతో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వీటిలో పంది ముఖాన్ని పోలిన మాస్క్ ధరించిన వ్యక్తి చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణ రాజకీయ పోస్టర్లకు భిన్నంగా ఉండటంతో అటుగా వెళ్లేవారు వాటిని ఆసక్తిగా గమనిస్తున్నారు. పోస్టర్లలో పార్టీ పేరుతో పాటు క్యూఆర్ కోడ్‌ను కూడా ముద్రించారు. అయితే ఈ ప్రచారాన్ని ఎవరు ప్రారంభించారు? మాస్క్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు? అనే విషయాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు.
24
ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ప్రచారం.. ప్రకాశ్‌రాజ్‌ను మాత్రమే ఫాలో అవుతున్న ఖాతా
వీధుల్లో పోస్టర్లకే ఈ ప్రచారం పరిమితం కాలేదు. ఎక్స్ (X), ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల్లోనూ ‘సైలెంట్ పార్టీ’ పేరుతో ఖాతాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఖాతా ప్రొఫైల్ ఫొటోలో పంది ముఖం మాస్క్ ధరించిన వ్యక్తి ఉండటం చర్చకు దారితీసింది. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఎక్స్ ఖాతా నుంచి ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ను మాత్రమే ఫాలో అవుతున్నారు. దీంతో ఈ ప్రచారానికి రాజకీయ నేపథ్యం ఉందా? ఏదైనా ప్రత్యేక భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
34
ఏఐ ఆడియోలతో రాజకీయ వ్యంగ్యం.. కాక్రోచ్ పార్టీతో పోలిక
ఈ ప్రచారంలో భాగంగా వెలువడుతున్న ఆడియోలు కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కృత్రిమ మేధ (AI) సాయంతో రాజకీయ నాయకుల ప్రసంగ శైలిని పోలిన ఆడియోలను రూపొందించి, వాటి ద్వారా విమర్శనాత్మక సందేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గతంలో సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన ‘కాక్రోచ్ పార్టీ’తో కొందరు ఈ కొత్త ప్రచారాన్ని పోలుస్తున్నారు. సాధారణ రాజకీయ విమర్శలకు భిన్నంగా వినూత్నమైన ప్రతీకలు, వ్యంగ్యాన్ని ఉపయోగించడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నంగా దీనిని చూస్తున్నారు. అయితే ఈ రెండు ప్రచారాల మధ్య నిజంగా ఏదైనా సంబంధం ఉందనే ఆధారాలు లేవు.
విజయవాడలోని బహిరంగ ప్రదేశాల్లో అనుమతి లేకుండా పోస్టర్లు ఏర్పాటు చేయడంపై పోలీసులు కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. వాటిని ఎక్కడ ముద్రించారు? ఎవరు అంటించారు? సోషల్ మీడియా ఖాతాలను ఎవరు నిర్వహిస్తున్నారు? అనే అంశాలపై వివరాలు సేకరిస్తున్నారు. అలాగే క్యూఆర్ కోడ్ ద్వారా నిధులు సేకరిస్తున్నారా.? అన్న కోణంలో కూడా విచారణ జరగుతోంది. ఈ ప్రచారం వెనుక ఒక వ్యక్తి ఉన్నారా? లేక ప్రత్యేక బృందం పనిచేస్తోందా? అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి వింత మాస్క్, ఏఐ ఆడియోలతో మొదలైన ‘సైలెంట్ పార్టీ’ ప్రచారం ఇప్పుడు రాజకీయ, సోషల్ మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. దీని అసలు లక్ష్యం ఏమిటనేది నిర్వాహకుల ప్రకటనతోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది.