మీ యూత్ వినాయక నిమజ్జనానికి సిద్దమవుతోందా..? తప్పకుండా ఈ 10 జాగ్రత్తలు పాటించండి

Published : Sep 01, 2025, 06:04 PM IST

ఎంతో వైభవంగా జరుపుకునే వినాయక నిమజ్జన వేడుకల్లో ఒక్కోసారి ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వీటిని నియంత్రించవచ్చు. ఇలా వినాయక నిమజ్జనంలో పాటించాల్సిన 10 జాగ్రత్తలివే…

PREV
15
Vinayaka Nimajjanam

Vinayaka Immersion : దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జన వేడుకలు ప్రారంభమయ్యాయి. సాధారణంగా వినాయక చవితిరోజులు వాడవాడలా బొజ్జ గణపయ్య విగ్రహాలను ప్రతిష్టిస్తారు... ప్రతిరోజు స్వామిని భక్తిశ్రద్దలతో పూజిస్తారు. అయితే ఈ నిమజ్జన వేడుకలకు కొందరు 5, మరికొందరు 7, ఇంకొందరు 9,11 రోజులకు జరుపుకుంటారు. ఇప్పటికే నిమజ్జనాలు ప్రారంభమవగా పలుచోట్ల ప్రమాదాలు సంభవించి ప్రాణనష్టం జరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ లో వినాయకుడిని ఊరేగిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి ప్రజలపైకి దూసుకెళ్లడంతో నలుగు ప్రాణాలు కోల్పోయారు... మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ళు గ్రామంలో జరిగింది. ఇక అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా ఇలాగే వినాయక నిమజ్జన ఊరేగింపులో ప్రమాదం జరిగింది. పాడేరు మండలం చింతలవీధిలో ఊరేగింపులో పాల్గొన్నవారిపైకి మితిమీరిన వేగంతో ఓ వాహనం దూసుకువచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఇలా వేరువేరు ఘటనల్లో ఆరుగురు మరణించగా చాలామంది గాయాలపాలయ్యారు. ఇలాంటి మరికొన్ని చిన్నచిన్న ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

ఒక్క ఏపీలోని ఇన్ని ఘటనలు, ఇంతమంది చనిపోతే వినాయక నిమజ్జనం ముగిసేలోపు ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా ఎన్ని జరుగుతాయో ఊహించవచ్చు. ప్రతిసారి వినాయక చవితికి విగ్రహాలను తీసుకువచ్చే సమయంతో... నిమజ్జనం వేళ ఊరేగింపు సమయంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాలను పూర్తిగా నివారించలేకపోతున్నారు... కానీ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే నియంత్రివచ్చు. నిమజ్జన వేడుకలు కొనసాగుతున్నవేళ ఆ జాగ్రత్తలేమిటో తెలుసుకుందాం... ఇంకెవ్వరి ప్రాణాలు బలికాకుండా చూద్దాం.

DID YOU KNOW ?
వినాయక నిమజ్జనం
తెలుగు రాష్ట్రాల్లో వినాయక నిమజ్జన వేడుకలు ఖైరతాబాద్ మహా గణనాథుడితో సహా సెప్టెంబర్ 6న అంటే ఈ శనివారం జరుగుతాయి.
25
వినాయక నిమజ్జనంలో పాటించాల్సిన జాగ్రత్తలు

1. మద్యంమత్తులో ఊరేగింపు వద్దు :

ఎంతో భక్తిశ్రద్దలతో పూజించిన బొజ్జ గణపయ్యను పవిత్రంగా నిమజ్జనానికి తరలిస్తే ప్రమదాలను నివారించవచ్చు. ఊరేగింపు సమయంలో నిర్వహకులు, ఆయా కాలనీ యువకులు, ఇతరులు మద్యం సేవించి పాల్గొనడం ఊరేగింపును అపవిత్రం చేయడమే కాదు ప్రమాదానికి కారణంకూడా. నిమజ్జన ఊరేగింపులో రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు, స్వామిని తరలించే వాహనంవద్ద, జలాశయాల వద్ద మద్యంసేవించివారు అత్యుత్సాహం ప్రదర్శించడంవల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. 

2. ఇటీవల తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు సంభవించాయి. ఈ క్రమంలో నదులు, వాగులువంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.. చెరువులు, కుంటలు, జలాశయాలు నిండుకుండల్లా మారాయి. ఇలా ప్రమాదకరంగా మారిన నీటి ప్రవాహాల్లో వినాయక నిమజ్జనాలు జరుపుతాయి... ఈ సమయంలో భారీగా ప్రజలు తరలివెళతారు. కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది... అందుకే ప్రమాదకరమైన ప్రవాహాల్లో నిమజ్జనం జరపకపోవడమే మంచిది. జనావాసాలకు సమీపంలోనే చిన్న కుంటలు, కాలువలు ఉంటే వాటిలోనే నిమజ్జనం జరపాలి... చిన్నచిన్న మట్టి వినాయకులను బావులు, చిన్న కుంటల్లో నిమజ్జనం చేయాలి.

35
నిమజ్జనంలో ఈ జాగ్రత్తలు పాటించండి

3. వినాయక విగ్రహాల ఎత్తు, ఖరీదుపై యువతలో పోటీ నెలకొంది. పక్క గల్లీ గణేషుడి విగ్రహం కంటే మనదే పెద్దగా ఉండాలని కొందరు... ఖరీదైన పెద్ద గణపతిని ప్రతిష్టించి అందరి దృష్టిని ఆకర్షించాలని మరికొందరు పెద్దపెద్ద వినాయక ప్రతిమలు ప్రతిష్టిస్తున్నారు. అయితే నిమజ్జనం సమయంలో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో క్రేన్లు అందుబాటులో ఉంటాయి... కానీ చిన్నచిన్న పట్టణాలు, గ్రామాల్లో ఇవేవీ ఉండవు కాబట్టి మనుషులే వాటిని ఎత్తాల్సి ఉంటుంది. ఈ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే పెద్ద వినాయకులను క్రేన్ సాయంతో ఎత్తేందుకు ప్రయత్నించాలి.. లేదంటే చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కువమంది విగ్రహాలను ఎత్తాలి. ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఉండాలంటే ముందుగానే చిన్నచిన్న విగ్రహాలను ప్రతిష్టించడమే మంచిది.

4. వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటే రోడ్లపైకి వచ్చాక ట్రాఫిక్ మధ్యలోనే డ్యాన్సులు చేయడం మంచిదికాదు. వీలైనంత ఎక్కువసేపు గల్లీల్లోనే సంబరాలు జరుపుకోవాలి... ప్రధాన రోడ్లపైకి వచ్చాక నేరుగా నిమజ్జనానికి తరలించాలి. రద్దీ రోడ్లు, హైవేలపై ఊరేగింపు వల్ల ఇతర వాహనాల వల్ల ప్రమాదాలు జరగవచ్చు. తాజాగా పాడేరులో ఇలాగే ప్రమాదం జరిగి ఇద్దరు బలయ్యారు.

5. చిన్నపిల్లలతో నిమజ్జన వేడుకలకు వెళ్లేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. రద్దీ ప్రాంతాల్లో పిల్లలు తప్పిపోయే ప్రమాదం ఉంటుంది... అంతేకాదు జలాశయాల వద్ద పిల్లలు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ చిన్నారులు వినాయక నిమజ్జనం చేస్తుంటే తప్పకుండా వారి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండాలి.

45
పోలీసులు సూచించే జాగ్రత్తలు పాటించండి

6. ప్రతిఒక్కరు పోలీసులు, ప్రభుత్వ అధికారులు సూచించే జాగ్రత్తలు పాటించాలి. వారికి సహకరించడంవల్ల ప్రమాదాలను నియంత్రించవచ్చు. ఏదయినా అత్యవసర సమయాల్లో పోలీసుల సహాయం తీసుకోవాలి.

7. హైదరాబాద్ వంటి నగరాల్లో ప్లైఓవర్లు, మెట్రో లైన్, అండర్ పాస్ ల వల్ల పెద్దపెద్ద వినాయకుల తరలింపు సమయంలో ప్రమాదాలు సంభవించవచ్చు. కాబట్టి పోలీసులు, అధికారుల సూచనలను పాటించి ఎత్తును బట్టి విగ్రహాలను ఎలా తరలించాలో ప్లాన్ చేసుకోవాలి.

8. పట్టణాలో కూడా రైల్వే అండర్ పాస్ లు, తక్కువ ఎత్తుతో కూడిన కమాన్లు, ఇతర నిర్మాణాల వల్ల ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి వినాయక విగ్రహాలను ఎలాంటి ఆటంకాలు లేని మార్గంలో తరలించాలి.

55
విద్యుత్ విషయంలో తస్మాత్ జాగ్రత్త...

9. వినాయక ఊరేగింపులో ప్రదానంగా విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎత్తైన విగ్రహాలు విద్యుత్ తీగలకు తగలడం..డీజేలు, సౌండ్ బాక్సులు, అలంకరణ కోసం విద్యుత్ ను ఉపయోగించే సమయంలో ప్రమాదాలు జరక్కుండా జాగ్రత్తలు పాటించాలి.

10. వినాయక నిమజ్జనం కోసం ఉపయోగించే వాహనం మంచి కండిషన్ లో ఉండేలా చూసుకోవాలి. బ్రేకులు సరిగ్గా పడకపోవడం, ఇతర సమస్యలేమైనా వుంటే వాహనం జనాల్లోకి దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. మంచి అనుభవం కలిగిన డ్రైవర్ నే ఆ వాహనం నడిపే అవకాశం కల్పించాలి.

Read more Photos on
click me!

Recommended Stories