VC Sajjanar Launches Anti Drug Awareness Song : న్యూ ఇయర్ వేళ యువతను మాదక ద్రవ్యాల బారి నుంచి కాపాడేందుకు జర్నలిస్ట్ రమేష్ కుమార్ రాసిన ప్రత్యేక పాటను వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు. మాదకద్రవ్యాలపై పోరులో ఈ పాట కీలకపాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
యువతకు అలర్ట్: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల పై స్పెషల్ ఫోకస్
మరికొద్ది రోజుల్లో రానున్న నూతన సంవత్సర వేడుకలకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ప్రతి ఏటా డిసెంబర్ చివరి వారంలో యువత పార్టీలతో హుషారెక్కించడం, ఆనందోత్సాహాల మధ్య గడపడం సర్వసాధారణం. అయితే, గతంలో కేవలం మత్తుపానీయాలకే మాత్రమే పరిమితమైన ఈ పార్టీలు, ఇటీవలి కాలంలో ఆందోళనకరమైన మలుపు తిరిగాయి. కేవలం మత్తుపానీయాలు మాత్రమే కాకుండా, మాదక ద్రవ్యాల వినియోగం కూడా విపరీతంగా పెరగడం ఇప్పుడు సమాజాన్ని భయపెడుతోంది.
ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో పాశ్చాత్య సంస్కృతి ప్రభావం పెరిగింది. పబ్ కల్చర్, సర్వీస్ అపార్ట్‌మెంట్స్ పార్టీలు, ఫామ్ హౌజ్ పార్టీల పేరుతో యువత పెడదోవ పడుతున్నారు. ఈ క్రమంలో మాదక ద్రవ్యాల వినియోగంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా, ఈ మాదక ద్రవ్యాల సరఫరా చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కేవలం చట్టపరమైన చర్యలే కాకుండా, యువతలో చైతన్యం తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్ని స్వచ్ఛంద సంస్థలకు బాధ్యతలు అప్పగించగా, స్వాధ్యాయ అనే సంస్థ చురుగ్గా ముందుకు వచ్చింది.
24
'మత్తు.. గమ్మత్తు'.. యువతను ఆలోచింపజేస్తున్న జర్నలిస్ట్ రమేష్ కుమార్ పాట
మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టేందుకు స్వాధ్యాయ స్వచ్ఛంద సంస్థ పలు అవగాహన కార్యక్రమాలను రూపొందించింది. ఈ సంస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రముఖ జర్నలిస్ట్, కవి, రచయిత రమేష్ కుమార్ ఉప్పుల తనవంతు బాధ్యతగా ఒక ప్రత్యేక గీతానికి రూపకల్పన చేశారు. "మత్తు.. మత్తు.. మత్తు.. మత్తు.. గమ్మత్తు.." అంటూ సాగే ఈ పాటను ఆయనే స్వయంగా రచించి, స్వరపరచడం విశేషం.
మాదక ద్రవ్యాల నివారణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ పోలీసులకు తోడుగా ఈ గీతాన్ని అందించారు. మాదక ద్రవ్యాలకు బానిసలైతే జీవితాలు ఎలా చిన్నాభిన్నమవుతాయో కళ్లకు కట్టినట్లు చూపించేలా ఈ పాటను రూపొందించారు. ఈ ప్రత్యేక గీతాన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
34
సజ్జనార్ అభినందన.. యువతకు హెచ్చరిక
పాటను ఆవిష్కరించిన అనంతరం వి.సి. సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం యువత మాదక ద్రవ్యాల బానిసలుగా మారడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ వేళ మార్కెట్లోకి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాల వచ్చే అవకాశం ఉందని, ఇది సమాజానికి పెను సవాలుగా మారిందని ఆయన అన్నారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని కట్టడి చేయాలంటే కేవలం పోలీసుల నిఘా మాత్రమే సరిపోదని, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విషయంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న యువ బృందాన్ని సజ్జనార్ ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా, తన పాట ద్వారా యువతలో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నించిన రచయిత ఉప్పుల రమేష్ కుమార్‌ను ఆయన ప్రశంసించారు. మాదక ద్రవ్యాలు, గంజాయి వంటి మాదక ద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలను రమేష్ కుమార్ తన పాటలో యువతకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించారని కొనియాడారు. ఇలాంటి పాటల ద్వారా యువతలో మార్పు వస్తుందని, తద్వారా వారు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ పాటకు రచయిత అయిన రమేష్ కుమార్ ఉప్పుల, సమాజంలో జరుగుతున్న పరిణామాలను లోతుగా పరిశీలించే వ్యక్తిత్వం ఉన్నవారు. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో జన్మించిన ఆయన, డిగ్రీ వరకు సొంత జిల్లాలోనే విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చి, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పట్టా అందుకున్నారు.
ఆ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో ప్రవేశించి, అంచలంచలుగా ఎదిగారు. ఢిల్లీలోని పలు జాతీయ స్థాయి మీడియా సంస్థల్లోనూ పనిచేసిన అనుభవం ఆయన సొంతం. మీడియా రంగంలో తనకున్న సుదీర్ఘ అనుభవాన్ని రంగరించి, ప్రస్తుతం సమాజ సేవపై పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. తనదైన శైలిలో పాటలు, రచనలు చేస్తూ సామాజిక రుగ్మతలపై యువతను చైతన్యపరుస్తున్నారు. త్వరలోనే దివ్యాంగులు, వృద్ధుల సమస్యలను ప్రతిబింబించేలా తాను రాసిన మరో రెండు పాటలను విడుదల చేయనున్నట్లు రమేష్ కుమార్ ఈ సందర్భంగా తెలిపారు.