కేటీఆర్ కు తలనొప్పి: మంత్రి మల్లారెడ్డిపై తిరుగుబాటు, రాజీనామాకు జడ్పీ చైర్మన్ రెడీ

First Published Sep 21, 2021, 10:36 AM IST

తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి మల్లారెడ్డి వ్యవహారం తలనొప్పి తెచ్చిపెడుతోంది. ఇప్పటికే మంత్రిపై భారీగా అవినీతి ఆరోపణలు రావడంతో పాటు ఇప్పుడు పార్టీలోనే ఆయనపై తిరుగుబాటు మొదలయ్యింది. 

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సంస్థాగత ఎన్నికల్లో పార్టీ నేతల మధ్య పలు జిల్లాల్లో అంతర్గత విభేదాలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాలు ఘర్షణకు దిగిన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ ఘటనలు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు తలనొప్పిగా మారాయి. కొత్త కమిటీల ఎన్నికల్లో గొడవలకు దిగుతున్నవారిని సస్పెండ్ చేయాలని టీఆర్ఎస్ నాయకత్వం మంత్రులకు, పార్టీ ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలుస్తోంది. ఆరేళ్ల పాటు వారిని సస్పెండ్ చేయాలని వారికి ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.

పార్టీ నాయకత్వం సంస్థగాత పునర్వ్యస్థీకరణకు పూనుకుంది. స్థానిక పార్టీ కమిటీల ఏర్పాటు ఈ నెల 2వ తేదీన ప్రారంభమైంది. ఈ నెల 30వ తేదీతో ముగుస్తుంది. జిల్లా, మండలస్తాయి కమిటీల ఏర్పాటు జిల్లా, మండల స్థాయిల్లో సమస్యలను ఎదుర్కుంటున్నాయి. గ్రామ, వార్డు స్థాయిల్లో మాత్రం సమస్యలు తలెత్తలేదు. యాదాద్రి భునగరి, మేడ్చెల్ - మల్కాజిగిరి, ఖమ్మం జిల్లాల్లో విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. 

మొదటి నుంచి పార్టీలో ఉన్న నాయకులకు, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి వచ్చినవారికి మధ్య తీవ్రమైన విభేదాలు చోటు చేసుకుంటున్నట్లు అర్థమవుతోంది. కొత్తగా టీఆర్ఎస్ లోకి వచ్చినవారు తమ ప్రాబల్యాన్ని చాటుకోవడానికి, తమ స్థానాలను పదిలం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల కారణంగా ఈ విభేదాలు పొడసూపుతున్నట్లు అర్థమవుతోంది. 

మేడ్చెల్ - మల్కాజిగిరి జిల్లాలో మంత్రి మల్లారెడ్డికి, జిల్లా పరిషత్ చైర్మన్ శరత్ చంద్రారెడ్డికి మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగుమనే స్థాయికి చేరుకున్నాయి. కమిటీల ఏర్పాటులో, ముఖ్యంగా ఘట్కేసర్ మండల కమిటీ ఏర్పాటులో మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరించడంపై శరత్ చంద్రారెడ్డి మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై అలక వహించిన శరత్ చంద్రారెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని శరత్ చంద్రారెడ్డిని బుజ్జగించి, తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో శరత్ చంద్రారెడ్డి మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. 

మేడ్చెల్ మాజీ ఎమ్మెల్యే కుమారుడే శరత్ చంద్రారెడ్డి. సుధీర్ రెడ్డి 2014 నుంచి 2018 వరకు మేడ్చెల్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే, 2018 శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుధీర్ రెడ్డికి టికెట్ నిరాకరించారు. మల్లారెడ్డికి టీఆర్ఎస్ టికెట్ ఇచ్చారు. మల్లారెడ్డి విజయం సాధించి, ఆ తర్వాత మంత్రి కూాడ అయ్యారు. అది మొదలు ఈ రెండు వర్గాల మధ్య మేడ్చెల్ - రంగారెడ్డి జిల్లాలో విభేదాలు కొనసాగుతున్నాయి. 

ఇదిలావుంటే, యాదాద్రి - భువనగిరి జిల్లాలో ఆలేరు శాసనసభ్యురాలు, ప్రభుత్వ విప్ గొంగడి సునీతపై దాడి జరిగింది. తుర్కపల్లి మండల పార్టీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఘర్షణ చెలరేగి దాడికి దారి తీసింది. హింసకు దిగిన పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మండల అధ్యక్ష పదవికి మాజీ అధ్యక్షుడు పడాల శ్రీనివాస్ బరిలోకి దిగడానికి సిద్ధపడ్డారు. అయితే, గొంగడి సునీత తన అనుచరుడు నరేందర్ రెడ్డిని ఆ పదవికి ప్రతిపాదించారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగి హింసకు దారి తీసింది. పడాల శ్రీనివాస్ అనుచరులు ఎమ్మెల్యే కారుపై దాడి చేశారు. కార్యాలయంలోని ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు.  

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా టీఆర్ఎస్ విభేదాలు రచ్చకెక్కాయి. ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావు పేట, పినపాక శాసనసభా నియోజకవర్గాల్లో పార్టీ మండలాధ్యక్ష పదవులపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ప్రత్యర్థి గ్రూపుల మధ్య దాడులు జరగవచ్చుననే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలను మోహరించి ఎన్నికలు నిర్వహించారు.  

కాగా, పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల విషయంలో అంతర్గత విభేదాలు మరింత పెద్ద యెత్తున విభేదాలు రచ్చకెక్కవచ్చునని భావిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ తమ అనుచరులకే పార్టీ అధ్యక్ష పదవులు దక్కేందుకు చేసే ప్రయత్నాల్లో తీవ్రమైన విభేదాలు పొడసూపవచ్చునని భావిస్తున్నారు. వీటిని అదుపు చేయడం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అంత సులభం కాకపోవచ్చునని అంటున్నారు. 

click me!