TG SSC Exams 2027: తెలంగాణలో 2027 మార్చిలో నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి ఫీజుల చెల్లింపు ప్రక్రియ అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం పరీక్ష ఫీజుల షెడ్యూల్‌ను ప్రకటించింది.
తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం పరీక్షల విభాగం ఫీజుల చెల్లింపు తేదీలను ఖరారు చేసింది. సాధారణ పరీక్ష ఫీజు రూ.125గా నిర్ణయించారు. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ మొత్తాన్ని చెల్లించవచ్చు. నిర్ణీత సమయంలో ఫీజు చెల్లిస్తే అదనపు ఫైన్‌ను నివారించవచ్చు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా ముందుగానే ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది. విద్యార్థులు తమ పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి ఫీజు చెల్లింపు వివరాలు, అవసరమైన పత్రాల గురించి తెలుసుకోవాలి. పరీక్షలకు సంబంధించిన ఇతర నిబంధనలను కూడా పాటించాలి.
24
ఆలస్య రుసుముతో చెల్లించేందుకు అదనపు గడువులు
సాధారణ గడువులో ఫీజు చెల్లించలేని విద్యార్థులకు పరీక్షల విభాగం అదనపు అవకాశాలను కల్పించింది. అయితే గడువు దాటిన కొద్దీ ఆలస్య రుసుము పెరుగుతుంది. ఫీజు చెల్లింపునకు సంబంధించిన తేదీలు, అదనపు మొత్తాల వివరాల విషయానికొస్తే.. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 16 వరకు రూ.125 సాధారణ పరీక్ష ఫీజు. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 1 వరకు రూ.50 ఆలస్య రుసుముతో పాటు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 14 వరకు రూ.200 ఆలస్య రుసుముతో పాటు పరీక్ష ఫీజు, డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 28 వరకు రూ.500 ఆలస్య రుసుముతో పాటు పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
34
అర్హులైన విద్యార్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు
ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంది. ఇందుకోసం కుటుంబ వార్షిక ఆదాయం నిర్దేశించిన పరిమితుల్లో ఉండాలి. అర్హతను నిర్ధారించేందుకు సంబంధిత ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని పాఠశాల అధికారులకు సమర్పించాలి. వార్షిక ఆదాయ పరిమితుల విషయానికొస్తే.. పట్టణ ప్రాంత విద్యార్థులు: కుటుంబ వార్షిక ఆదాయం రూ.24,000 లోపు ఉండాలి, గ్రామీణ ప్రాంత విద్యార్థులు: కుటుంబ వార్షిక ఆదాయం రూ.20,000 లోపు ఉండాలి. ఈ అర్హతలు కలిగిన విద్యార్థులు అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించి రూ.125 సాధారణ పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు పొందవచ్చు. తమకు ఈ సదుపాయం వర్తిస్తుందో లేదో ముందుగానే పాఠశాల ప్రధానోపాధ్యాయులను సంప్రదించి నిర్ధారించుకోవాలి.
పదో తరగతి పరీక్ష ఫీజుల చెల్లింపు ప్రక్రియను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పర్యవేక్షించాలి. ఇందుకోసం బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) అధికారిక వెబ్‌సైట్‌లో తమ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలి. విద్యార్థుల ఫీజు వివరాలను పరిశీలించి, నిర్ణీత గడువులోగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులు కూడా తమ ఫీజు వివరాలు, మినహాయింపు అర్హతలు, సమర్పించాల్సిన పత్రాల గురించి పాఠశాల యాజమాన్యంతో మాట్లాడాలి. 2027 మార్చిలో జరగనున్న పదో తరగతి పరీక్షలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిద్ధమయ్యేందుకు ఫీజు చెల్లింపును నిర్లక్ష్యం చేయకూడదు. సాధారణ ఫీజు చెల్లింపునకు నవంబర్ 16 చివరి తేదీ కాగా, ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబర్ 28 వరకు అవకాశం ఉంది.