తెలంగాణలో ఐదు రోజులు పొడి వాతావరణం.. ఆ తర్వాత వానల ఎంట్రీ
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అక్టోబర్ 22 రాత్రి విడుదల చేసిన బులెటిన్ ప్రకారం, అక్టోబర్ 22 నుంచి 27 వరకు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ కాలానికి ప్రత్యేక హెచ్చరికలేవీ జారీ చేయలేదు. అయితే, అక్టోబర్ 27 నుంచి 28 వరకు, అలాగే అక్టోబర్ 28 నుంచి 29 వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు.
ఈ సమయంలో పిడుగులు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రమాద స్థాయిని మధ్యస్థంగా అంచనా వేశారు. రక్షణ లేని నిర్మాణాలు, వదులుగా ఉన్న వస్తువులకు స్వల్ప నష్టం కలగవచ్చు. ప్రతికూల వాతావరణంలో సురక్షిత ప్రాంతాలకు చేరుకునేలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు, తెలంగాణలో ఎండలు, ఉక్కపోత పెరగడానికి రుతువుల మార్పే ప్రధాన కారణమని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. వర్షాకాలం నుంచి శీతాకాలానికి మారుతున్న సమయంలో ఇలాంటి పరిస్థితులు సాధారణమని, అయితే ఎల్ నినో ప్రభావాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.