Weather
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం విచిత్రంగా కనిపిస్తోంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోతున్నాయి... సాయంత్రం అయ్యిందంటే చాలు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నారు. హైదరాబాద్ తో సహా చాలాజిల్లాల్లో ప్రతిరోజు ఇదే తంతు. మండు వేసవిలో వర్షాలు కాస్త ఊరటనిస్తున్నా వడగాలులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో చెదురుమదురు జల్లులు కురుస్తూనే ఉన్నాయి. మరో రెండ్రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. చిరుజల్లులతో పాటు ఈదురుగాలులు వీయడం, పిడుగులు పడే ప్రమాదం ఉందని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వడగళ్ల వానలు పడే అవకాశాలు కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.
Telangana Rains
తెలంగాణలో వర్షాలు :
తెలంగాణలో ఈ రెండ్రోజులు తేలికపాటి నుండి అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 22,23 (మంగళ, బుధవారం) వర్షాలు కొనసాగుతాయి. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులు మొదలవుతాయని... ఉరుములతో కూడిన చిరుజల్లులు ప్రారంభం అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Telangana Weather
తెలంగాణలో ఎండలు :
తెలంగాణలో వర్షాలు కురుస్తున్నా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గదని వాతావరణ శాఖ ప్రకటించింది. రోజురోజుకు ఎండలు మరింత మండిపోతూ ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి... ఆదిలాబాద్ లో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇలా ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఇప్పుడున్న ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని... ఉక్కపోత కూడా తారాస్థాయికి చేరుతుందని ప్రకటించారు. రానున్న రోజుల్లో మరో 2 నుండి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అంటే ఈ వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నమాట. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Andhra Pradesh Weather
ఏపీలో ఎండావాన :
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఈ రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని... పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరించారు. ఈ వర్షాలతో పాటు ఎండల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని తెలిపారు.
ఇప్పటికే ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటాయి. తిరుపతిలో గరిష్టంగా 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక నంద్యాల, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, పల్నాడు, కడప జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఎండల తీవ్రత మరింత పెరిగి రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు పెరుగుతాయని... తీవ్ర వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
Summer Rains
వేసవిలో వర్షాలెందుకు కురుస్తున్నాయంటే...
తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో మండు వేసవిలో వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి విదర్భ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు మీదుగా కొనసాగుతోందని... ఇది సముద్ర మట్టానికి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉందని తెలిపారు. ఈ ద్రోణి ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.