Published : Jun 12, 2025, 08:38 AM ISTUpdated : Jun 12, 2025, 08:51 AM IST
తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి… గురువారం తెల్లవారుజామున హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. కేవలం గంటసేపట్లో రికార్డ్ వర్షపాతం నమోదయ్యింది.
Telugu States Weather Updates : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కుండపోత వర్షం కురిసింది. ఇవాళ(గురువారం) తెల్లవారుజామునే నగరంలో అత్యంత భారీ వర్షం మొదలయ్యింది... కొద్దిసేపట్లోనే రికార్డు వర్షపాతం నమోదయ్యింది. ముఖ్యంగా కూకట్ పల్లి, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, జూబ్లిహిల్స్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. రోడ్లపైకి మోకాల్లోతు వరదనీరు చేరింది... దీంతో ఉదయం వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
26
ఈ ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీతో పాటు శేరిలింగంపల్లి, నల్లగండ్ల ప్రాంతాల్లో అయితే క్లౌడ్ బరస్ట్ జరిగింది. కేవలం ఒక్క గంటలో 160 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి వర్షం తగ్గినా నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని... రోజంతా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
36
ఈ తెలంగాణ జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్స్
ఇక తెలంగాణవ్యాప్తంగా కూడా ఈ నాలుగురోజులు అంటే జూన్ 15వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) హెచ్చరించింది. గురువారం 10 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, మెదక్, కరీంనగర్ తో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు... ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసారు.
వర్షాలు, ఆకాశం మేఘాలతో కప్పివుండటంతో గత కొంతకాలంగా ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతో సతమతం అవుతున్న తెలంగాణ ప్రజలకు ఊరట లభించింది. వాతావరణం చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. అయితే ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించే ప్రమాదం ఉంటుంది... కాబట్టి లోతట్టు ప్రాంతాలు, నదులు, వాగులు వంకల పరివాహకప్రాంతాల్లో నివాసముండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ సూచిస్తోంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులు కూడా వర్షం కురిసే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని... చెట్ల కింద ఉండకూడదని సూచించారు.
56
ఏపీలో నేడు వాతావరణం ఎలా ఉంటుందంటే..
మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రకాశం, నంద్యాల, కర్నూల్, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.
66
ఓవైపు వానలు.. మరోవైపు ఎండలు
ఏపీలో వర్షాలతో పాటు ఎండలు కూడా మండిపోతున్నాయి. గురువారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని... ఓవైపు వర్షాలు, మరోవైపు ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా 40 నుండి 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించారు.