Telangana : తెలంగాణ మహిళల ఆదాయాన్ని పెంచే అద్భుతమైన బిజినెస్ ఐడియా. తెలంగాణ ప్రభుత్వ సహకారం ఉంటుంది కాబట్టి ఆదాయానికి దోకా లేదు. ఇంతకూ ఆ బిజినెస్ ఏంటో తెలుసా?
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత దిశగా అనేక ప్రయత్నాలు చేస్తోంది... ఇందులో భాగంగానే మహాలక్ష్మి పథకాన్ని అమలుచేస్తున్న విషయం తెలిసిందే. మహిళలకు ఆర్టిసి బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ పథకంలో భాగమే... దీంతో సామాన్య, మధ్యతరగతి మహిళలకు ప్రయాణ ఖర్చులు ఆదా అవుతున్నాయి. అయితే మహిళలకు కేవలం డబ్బులు ఆదా చేయడమే కాదు ఆదాయ మార్గాలను కూడా చూపించే ప్రయత్నం చేస్తోంది రేవంత్ సర్కార్. దీనికి కూడా ఆర్టిసిని వాడుకుంటోంది ప్రభుత్వం.
మహిళా సంఘాలను ఆర్టిసితో అనుసంధానం చేసి ఆదాయం కల్పిస్తోంది రేవంత్ సర్కార్. దీంతో అటు ఆర్టిసి, ఇటు మహిళా సంఘాలకు లాభం చేకూరుతోంది. ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలుచేసి ఆర్టిసికి అద్దెకు ఇచ్చాయి కొన్ని మహిళాసంఘాలు.. ఈ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇప్పుడు మరిన్ని మహిళా సంఘాలకు అవకాశం కల్పిస్తోంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి తాజాగా కీలక ప్రకటన చేసింది.
24
మరో 448 అద్దె బస్సులు
మహిళా స్వయం సంఘాలు ఆర్టిసి ద్వారా ఆదాయాన్ని పొందే అవకాశాన్ని కల్పించింది ప్రభుత్వం... ఇప్పటికే 152 బస్సులను ఆర్టిసి అద్దెకు ఇచ్చాయి మహిళా స్వయం సహాయక సంఘాలు. ఇది సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుండటంతో మరిన్ని బస్సులను కొనుగోలు చేసి ఆర్టిసికి అప్పగించాలని మహిళా సంఘాలు భావిస్తున్నాయి... ఇందుకోసం తగిన చర్యలు చేపట్టింది ప్రభుత్వం. మరో 448 బస్సులను కొనుగోలు చేసి ఆర్టిసికి అద్దెకు ఇచ్చేందుకు సిద్దమయ్యారు.
మహిళా సంఘాలు బస్సుల కొనుగోలుకు నిధులను సమకూరుస్తోంది పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్). తాజాగా సెర్ఫ్ సీఈవో దివ్యా దేవరాజన్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి లేఖ రాశారు. మండల మహిళా సమాఖ్యలు 448 బస్సుల కొనుగోలు పూర్తిచేసి, వాటిని ఆర్టీసీకీ అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆమె తెలియజేశారు. అవసరమైన అనుమతులు మంజూరైన వెంటనే ఆ బస్సులను ఆర్టీసీ అప్పగించనున్నట్లు పేర్కొన్నారు.
34
ఏమిటీ పథకం... ఎంత ఆదాయం వస్తుంది?
తెలంగాణ ప్రభుత్వం ఆర్టిసికి బస్సులు అద్దెకు ఇచ్చే పథకాన్ని ఇటీవలే ప్రారంభించింది. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ పథకం కింద మహిళా స్వయంసహాయక సంఘాలు బస్సులను కొనుగోలుచేసి ఆర్టిసికి అద్దెకు ఇవ్వవచ్చు. ఒక్కో బస్సుకు నెలనెలా ఆర్టిసి రూ.69,468 అద్దె చెల్లిస్తుంది. డ్రైవర్, కండక్టర్లు జీతభత్యాలు, బస్సు మెయింటెనెన్స్ కూడా ఆర్టిసి చూసుకుంటుంది. మహిళా సంఘాలు బస్సులను కొనుగోలు చేసేందుకు సెర్ఫ్ నిధులు సమకూరుస్తుంది.
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘాల, ఆర్టిసికే కాదు ప్రయాణికులకూ లాభమే. ఆర్టిసి భారీగా నిధులు కేటాయించి బస్సులు కొనుగోలు చేయాల్సిన అవసరం తప్పింది... అద్దె బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించగలుగుతోంది. బస్సులను ఆర్టిసికి అద్దెకివ్వడం ద్వారా మహిళా సంఘాలు లాభపడుతున్నాయి. బస్సుల సంఖ్య పెరగడంతో ప్రజలకు ప్రయాణం మరింత ఈజీ అయ్యింది. మరీముఖ్యంగా మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణాలు చేసే మహిళలకు డబ్బులకు డబ్బులు, సమయానికి సమయం ఆదా అవుతోంది.