Telangana Richest Village: ఇంటికో కారు, ఊరంతా బంగ్లాలే.. తెలంగాణలో ధనిక గ్రామం ఇదే

Published : Nov 29, 2026, 02:40 PM IST

Telangana Richest Village: సాధారణంగా గ్రామం అంటే పెంకుటిల్లులు కనిపిస్తాయి. కానీ తెలంగాణలోని ఓ గ్రామాన్ని చూస్తే ఈ అభిప్రాయం మారిపోతుంది. ఊరంతా ఆధునిక భవనాలు, కార్లు, వ్యాపారాలు, ఆర్థికంగా బలపడిన కుటుంబాలు కనిపిస్తాయి. ఇంతకా గ్రామం ఏంటంటే..?

PREV
15
వ్యవసాయమే ప్రధాన బలం.. రైతుల ఆలోచనల్లోనే మార్పు

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలానికి సమీపంలో, జాతీయ రహదారి 63 పక్కన ఉన్న అంకాపూర్ గ్రామం జిల్లా కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామానికి వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు. అయితే ఇక్కడి రైతులు సంప్రదాయ పద్ధతుల్లోనే పంటలు పండిస్తూ కాలం గడపలేదు. వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా మార్చుకుంటేనే అధిక ఆదాయం సాధ్యమని గుర్తించారు. ఒకప్పుడు ఇతర గ్రామాల మాదిరిగానే అంకాపూర్ రైతులు కూడా విత్తనాల కోసం కంపెనీలపై ఆధారపడేవారు. నకిలీ విత్తనాలు, పెట్టుబడి ఖర్చులు, పంట నష్టాలు వారిని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు రైతులు తమ సాగు విధానాలపై దృష్టి పెట్టారు. ఏ పంటకు మార్కెట్‌లో డిమాండ్ ఉంది? ఏ విత్తనం ఎక్కువ దిగుబడిని ఇస్తుంది? ఏ పద్ధతిలో ఖర్చులు తగ్గించుకోవచ్చు? అనే అంశాలను పరిశీలించడం మొదలుపెట్టారు. ఈ ఆలోచనే అంకాపూర్ అభివృద్ధికి తొలి అడుగుగా మారింది.

25
విత్తనాల ఉత్పత్తితో కోట్ల ఆదాయం.. రైతుల చేతుల్లోనే వ్యాపారం

అంకాపూర్ రైతులు సాధించిన అతిపెద్ద విజయాల్లో నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి ఒకటి. ఎర్రజొన్న, మొక్కజొన్న, సోయాబీన్, పసుపు వంటి పంటల సాగుకు ప్రాధాన్యం ఇచ్చారు. స్థానిక పరిస్థితులకు అనువైన వంగడాలను ఎంపిక చేసుకుని నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. వీటికి క్రమంగా ఇతర ప్రాంతాల్లోనూ డిమాండ్ పెరిగింది. దీంతో రైతులు కేవలం పంటలు పండించి మార్కెట్‌లో అమ్మేవారిగానే కాకుండా విత్తన ఉత్పత్తిదారులుగా ఎదిగారు. గ్రామంలో విత్తన శుద్ధి, నిల్వ, విక్రయాలకు సంబంధించిన కార్యకలాపాలు విస్తరించాయి. 2016 నాటికే గ్రామంలో సుమారు 32 విత్తన శుద్ధి కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు రైతులకు అదనపు ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి విత్తనాలు కొనుగోలు చేయడంపై ఆధారపడకుండా నాణ్యమైన విత్తనాలను తామే తయారు చేసుకునే స్థాయికి చేరడం అంకాపూర్ ప్రత్యేకత. దీనినే విత్తన స్వావలంబనగా చెప్పుకోవచ్చు.

35
దేశీ కోళ్ల పెంపకంతో మరో ఆదాయ మార్గం

వ్యవసాయంతోనే ఆగిపోకుండా అంకాపూర్ రైతులు పశుపోషణ, దేశీ కోళ్ల పెంపకంపైనా దృష్టి పెట్టారు. ముఖ్యంగా నాటు కోళ్ల పెంపకాన్ని ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అంకాపూర్ దేశీ చికెన్‌కు తెలంగాణలో ప్రత్యేక గుర్తింపు రావడం వెనుక గ్రామస్థుల సమిష్టి కృషి ఉంది. గ్రామంలో పెంచే దేశీ కోళ్లకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. దీంతో కోళ్ల పెంపకం కుటుంబాలకు అదనపు ఆదాయాన్ని అందించే వ్యాపారంగా మారింది. స్థానికంగానే కాకుండా హైదరాబాద్ వంటి నగరాల నుంచి కూడా అంకాపూర్ చికెన్‌కు వినియోగదారులు వస్తుంటారు. పార్సిల్ విక్రయాల ద్వారా ఇతర ప్రాంతాలకూ సరఫరా చేస్తున్నారు. ఇలా ఒకవైపు పంటల సాగు, మరోవైపు విత్తనాల వ్యాపారం, ఇంకోవైపు దేశీ కోళ్ల పెంపకం.. ఈ మూడు రంగాలు గ్రామ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులుగా నిలిచాయి. ఒకే పంట లేదా ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడకుండా వివిధ రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడం అంకాపూర్ రైతుల విజయానికి మరో కారణం.

45
రాజకీయాలకు అతీతంగా గ్రామ ఐక్యత.. అభివృద్ధికి సమిష్టి నిర్ణయాలు

అంకాపూర్ అభివృద్ధిలో గ్రామస్థుల ఐక్యతకు ఎంతో ప్రాధాన్యం ఉంది. సుమారు 35 ఏళ్ల క్రితమే గ్రామాభివృద్ధి కమిటీతో పాటు వివిధ కమిటీలను ఏర్పాటు చేసుకుని స్థానిక సమస్యలు, వ్యవసాయ విధానాలు, గ్రామ ప్రగతిపై చర్చించడం ప్రారంభించారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే గ్రామ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనకు పెద్దపీట వేశారు. రాజకీయ విభేదాలను పక్కనపెట్టి గ్రామ అభివృద్ధి కోసం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవడం అక్కడి ప్రత్యేకతగా నిలిచింది. రైతులకు ఉపయోగపడే పంటల ఎంపిక, విత్తనాల నాణ్యత, మార్కెట్ అవకాశాలు, ఉపాధి వంటి అంశాలపై సమిష్టిగా ఆలోచించారు. ఈ అభివృద్ధిలో మహిళా రైతుల పాత్ర కూడా కీలకం. పొలాల్లో పనిచేయడం నుంచి పంటల నిర్వహణ, ఇతర వ్యవసాయ కార్యకలాపాల వరకు మహిళలు చురుగ్గా పాల్గొంటున్నారు. గ్రామంలోని వ్యవసాయ పనులకు ఇతర ప్రాంతాల నుంచి కూడా కూలీలు వస్తుండటంతో అంకాపూర్ చుట్టుపక్కల గ్రామాలకు ఉపాధి కేంద్రంగా మారింది.

55
గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి.. నగరాలను తలపించే జీవనశైలి

వ్యవసాయం, విత్తనాల వ్యాపారం, కోళ్ల పెంపకం ద్వారా వచ్చిన ఆదాయం గ్రామస్థుల జీవన ప్రమాణాలను మార్చింది. ఒకప్పుడు సాధారణ గ్రామంగా ఉన్న అంకాపూర్‌లో ఇప్పుడు ఆధునిక భవనాలు, విశాలమైన ఇళ్లు, ఖరీదైన వాహనాలు కనిపిస్తాయి. వ్యవసాయంలో సంపాదించిన ఆదాయాన్ని కుటుంబాల అభివృద్ధికి, విద్యకు, వ్యాపారాలకు వినియోగిస్తున్నారు. గ్రామానికి చెందిన పలువురు యువత అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వంటి దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు. వ్యవసాయంతో పాటు విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాల ద్వారా కూడా గ్రామానికి ఆదాయం చేరుతోంది. అంకాపూర్ వ్యవసాయ విధానాలు, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిపై ఇక్రిశాట్, ఐసీఏఆర్ వంటి సంస్థలు కూడా ఆసక్తి చూపినట్లు సమాచారం.

Read more Photos on
click me!

Recommended Stories