Aarogyasri : తెలంగాణలో 360కి పైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి నిలిపివేస్తున్నాయి. పెండింగ్ బకాయిలు రూ.1,400 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరోసారి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TANHA) ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులు సెప్టెంబర్ 16 అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే సేవలను నిరవధికంగా నిలిపివేయాలని నిర్ణయించాయి. దీంతో 360కి పైగా చిన్న, మధ్యస్థాయి ఆసుపత్రులపై ప్రభావం చూపనుంది. వీటిలో ఎక్కువశాతం పేద కుటుంబాలకు చికిత్సలు అందించే ఆసుపత్రులే. పెండింగ్ బకాయిలు రూ.1,300 నుంచి రూ.1,400 కోట్లు దాటిన కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆసుపత్రుల నిర్వాహకులు తెలిపారు.
25
ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. సమ్మెకు ప్రధాన కారణాలు ఏంటి?
ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తాలు నెలల తరబడి ఆలస్యమవుతుండటమే ఈ నిర్ణయానికి కారణమైంది. TANHA అధ్యక్షుడు వద్దిరాజు రాకేష్ మాట్లాడుతూ.. గత 20 రోజుల్లో పలు సమావేశాలు జరిగినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు.
• ఆసుపత్రులు చెప్పిన ప్రకారం, రూ.1,400 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి.
• 2025 జనవరిలో 10 రోజుల సమ్మె చేసిన తర్వాత ప్రభుత్వం చెల్లింపులు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ 7-8 నెలలైనా పురోగతి లేదు.
• చికిత్స ప్యాకేజీల రేట్లు సవరించాలన్న డిమాండ్, చెల్లింపులకు "గ్రీన్ ఛానల్" ఏర్పాటు చేయాలని డిమాండ్లు కూడా ఉన్నాయి. ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను అమలు చేయాలని కోరుతూ ఆసుపత్రులు సమ్మె చేస్తున్నాయి.
35
గతంలోనూ ఆరోగ్యశ్రీ సేవలు బంద్..
ఆరోగ్యశ్రీ సేవల బంద్ సమస్య కొత్తది కాదు. గతంలోనూ ఈ విషయంపై సమ్మెలు జరిగాయి.
• 2025 జనవరిలో రూ.1,200 కోట్ల బకాయిలపై సమ్మె జరిగింది.
• ఆగస్టు 2025లో మరోసారి సేవలు నిలిపివేస్తామని ఆసుపత్రులు హెచ్చరించాయి. అయితే చర్చలతో వాయిదా వేశారు.
• 2022లో కూడా రూ.200 కోట్ల బకాయిలతో పాటు ప్యాకేజీ రేట్లలో 30-50% తగ్గింపులు జరగడంపై ఆసుపత్రులు నిరసన తెలిపాయి.
పలు పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు ఇప్పటికే ఆరోగ్యశ్రీ పథకాన్ని వదిలేశాయి.
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత వల్ల పేదలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అత్యవసర చికిత్సల కోసం వారు ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇప్పటికే రద్దీగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు మరింత ఒత్తిడికి గురవుతాయని వైద్యులు పేర్కొంటున్నారు. గత సమ్మెల సమయంలో రోగులు ఆసుపత్రి నుంచి ఆసుపత్రికి తిరుగుతూ ఇబ్బందులు పడ్డారు. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు తలెత్తవచ్చని TANHA ఆందోళన వ్యక్తం చేసింది.
55
ప్రభుత్వం ప్రతిస్పందన కోసం చూస్తున్న TANHA
సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో TANHA ఈ సమ్మె నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ప్రభుత్వం లేదా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి అధికారిక స్పందన రాలేదు. సమస్య త్వరగా పరిష్కారమైతే సేవలు మళ్లీ పునరుద్ధరించవచ్చని ఆసుపత్రుల నిర్వాహకులు తెలిపారు.