
తెలంగాణలో ప్రకృతి అందాలకు కొదవలేదు. అందులోనూ వర్షాకాలం వచ్చిందంటే చాలు దట్టమైన అడవుల మధ్య ఉండే జలపాతాలు సరికొత్త అందాన్ని సంతరించుకుంటాయి. అలాంటి వాటిలో ములుగు జిల్లాలోని బొగత జలపాతం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. దీనిని "తెలంగాణ నయాగరా" అని పిలుస్తారు. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జలపాతంగా పేరుగాంచిన బొగత జలపాతం.. పర్యాటకులకు ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. దట్టమైన అడవులు, ఎత్తైన కొండల మధ్య నుంచి జాలువారే ఈ నీటి ధారలను చూడటానికి రెండు కళ్లూ సరిపోవు. వీకెండ్‌లో ఎంజాయ్ చేయడానికి ఇది బెస్ట్ స్పాట్.
బొగత జలపాతం ములుగు జిల్లా వాజేడు మండలం కోయవీరపురం జి గ్రామంలో ఉంది. కాళేశ్వరం, భద్రాచలం మధ్య ఉన్న దట్టమైన అడవుల్లో ఈ జలపాతం దాగి ఉంది. ఛత్తీస్‌గఢ్ ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే చీకుపల్లి వాగు వల్ల ఈ జలపాతం ఏర్పడింది. చివరకు ఇది గోదావరి నదిలో కలుస్తుంది. సుమారు 30 అడుగుల ఎత్తు నుండి ప్యారలల్ స్ట్రీమ్స్‌గా నీరు కిందకు పడుతుంది.
మిగతా జలపాతాల లాగా ఇది సన్నగా కాకుండా, చాలా వెడల్పుగా పడుతుంది. అందుకే దీనిని మినీ నయాగరా అంటారు. కింద ఏర్పడే పెద్ద నేచురల్ పూల్ స్విమ్మింగ్ చేయడానికి, పిక్నిక్ ప్లాన్ చేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. జులై నుంచి నవంబర్ మధ్య ఈ జలపాతం పూర్తి స్థాయిలో ప్రవహిస్తుంది. ఆ సమయంలో వాటర్ ఫాల్స్ సౌండ్ చాలా దూరం వరకు వినిపిస్తుంది.
ఒకప్పుడు బొగత జలపాతం వెళ్లాలంటే చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది. కానీ నేషనల్ హైవే 202 పై కొత్తగా నిర్మించిన ఏటూరునాగారం బ్రిడ్జ్ వల్ల దూరం చాలా తగ్గింది. హైదరాబాద్ నుండి గతంలో 440 కిలోమీటర్లు ఉండగా, ఇప్పుడు అది 329 కిలోమీటర్లకు తగ్గింది. అలాగే భద్రాచలం నుండి 120 కిలోమీటర్లు, వరంగల్ నుండి 140 కిలోమీటర్లు, ఏటూరునాగారం నుండి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది.
హైదరాబాద్ లేదా వరంగల్ నుండి వచ్చే వారు వరంగల్-ములుగు-ఏటూరునాగారం రూట్ లో రావచ్చు. భద్రాచలం నుండి వచ్చే వారు వెంకటాపురం లేదా చెర్ల మీదుగా ఏటూరునాగారం వైపు రావాల్సి ఉంటుంది. ఏటూరునాగారం దాటిన తర్వాత జగన్నాధపురం దాటాక చీకుపల్లి గ్రామం వైపు రైట్ టర్న్ తీసుకోవాలి.
బొగత జలపాతానికి వెళ్లే దారి చాలా అడ్వెంచరస్‌గా ఉంటుంది. కార్లు, బైకులు పార్కింగ్ ప్లేస్ వరకు వెళ్తాయి. కార్ల కంటే బైకులు కొంచెం ముందుకు వెళ్లగలవు. పార్కింగ్ నుండి జలపాతం వరకు సుమారు 500 మీటర్లు నడవాల్సి ఉంటుంది. ఈ దారి కొండలు, రాళ్లతో కూడి ఉంటుంది. ప్రభుత్వం ఇక్కడ నడవడానికి వీలుగా రాతి మెట్లు, పట్టుకోవడానికి వీలుగా హ్యాండ్ రైలింగ్స్ ఏర్పాటు చేసింది.
చిన్న పిల్లలు, వృద్ధులు కూడా నెమ్మదిగా నడిచి వెళ్లవచ్చు. ఈ అడవి బాటలో నడవడం ట్రెక్కర్స్ కు మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. జలపాతం దగ్గర ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా ఉంది. దీనిపై నిలబడి ఫొటోలు తీసుకుంటే వ్యూ అదిరిపోతుంది. పర్యాటకుల కోసం ప్రభుత్వం ఇక్కడ చిల్డ్రన్ పార్క్, వాచ్ టవర్, వాకింగ్ పాత్స్ డెవలప్ చేసింది. వాచ్ టవర్ పైకి ఎక్కి చూస్తే జలపాతం వ్యూ అద్భుతంగా కనిపిస్తుంది.
బొగత జలపాతం సందర్శించడానికి ప్రతిరోజూ ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు అనుమతి ఇస్తారు. సాయంత్రం 4:30 గంటలకే లాస్ట్ ఎంట్రీ క్లోజ్ అవుతుంది. ఎంట్రీ టికెట్ ధర పెద్దలకు రూ. 50 ఉంటుంది. పిల్లలకు రూ. 30 గా నిర్ణయించారు. పార్కింగ్ ఫీజు వాహనాన్ని బట్టి రూ. 20 నుండి రూ. 50 వరకు ఉంటుంది. ప్రొఫెషనల్ కెమెరాలు తీసుకెళ్తే విడిగా ఫీజు కట్టాలి.
జలపాతం బేస్ దగ్గర ఉన్న పూల్ లో స్విమ్మింగ్ చేయడానికి సేఫ్ గానే ఉంటుంది కానీ, భారీ వర్షాలు పడినప్పుడు మాత్రం నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూల్ లోకి దిగకపోవడమే మంచిది. అలాగే జలపాతం పై భాగంలో ఉన్న రాళ్లు చాలా జారుడుగా ఉంటాయి, అక్కడికి వెళ్లడం ప్రమాదకరం. ఇక్కడ మొబైల్ నెట్‌వర్క్ సరిగ్గా ఉండదు కాబట్టి మీ చేతిలో క్యాష్ ఉంచుకోవడం చాలా ముఖ్యం.
బొగత జలపాతం దగ్గర పెద్ద రెస్టారెంట్లు లేవు. కేవలం టీ, బిస్కెట్లు, కూల్ డ్రింక్స్ దొరికే చిన్న స్టాళ్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి పర్యాటకులు సొంతంగా లంచ్, వాటర్ బాటిళ్లు తీసుకెళ్లడం మంచిది. స్టే చేయాలనుకునే వారి కోసం తెలంగాణ టూరిజం వారి హరిత రిసార్ట్ అందుబాటులో ఉంది. ఇక్కడ రూమ్ రెంట్ రోజుకు రూ. 1500 నుండి రూ. 2500 వరకు ఉంటుంది. ఇందులో సాంప్రదాయ తెలంగాణ భోజనం దొరుకుతుంది. ఏటూరునాగారంలో ఫారెస్ట్ గెస్ట్ హౌస్‌లు, భద్రాచలంలో హోటళ్లు ఉన్నాయి.
ఒకవేళ వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకుంటే.. ఉదయం 9 గంటలకే బొగతకు చేరుకుని, 11:30 వరకు జలపాతం చూసి, స్విమ్మింగ్ చేయవచ్చు. ఆ తర్వాత లంచ్ ముగించుకుని, దగ్గరలో ఉన్న లక్నవరం చెరువు (60 కిమీ) లేదా రామప్ప దేవాలయం (90 కిమీ), కాళేశ్వరం గుడి (40 కిమీ), ముత్యంధార జలపాతం (15 కిమీ) కూడా విజిట్ చేయవచ్చు. వీకెండ్స్ లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీలైతే వీక్ డేస్ లో ప్లాన్ చేసుకుంటే ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు.