Published : Jul 31, 2025, 12:07 PM ISTUpdated : Jul 31, 2025, 12:08 PM IST
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఆసక్తిగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం దేశ అత్యున్నత న్యాయం స్థానం దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను మూడు నెలల్లో పరిష్కరించాలని అసెంబ్లీ స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.
25
అసలు వివాదం ఏంటి.?
2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీఆర్ఎస్ నేతలు వీరిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను కోరినా, స్పందన లేకపోవడంతో చివరకు న్యాయస్థానాలను ఆశ్రయించారు.
35
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు
2024 ఏప్రిల్‌లో హైకోర్టులో మొదలైన ఈ న్యాయపోరాటం దాదాపు ఏడాది పాటు కొనసాగింది. మొదట హైకోర్టు సింగిల్ బెంచ్ స్పీకర్‌ను షెడ్యూల్ ఖరారు చేయమని ఆదేశించగా, ఆ తీర్పును డివిజన్ బెంచ్ రద్దు చేసింది. అనంతరం బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, 2025 ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన వాదనల అనంతరం జూలై 31న తుది తీర్పు వెలువడింది.
“ఆపరేషన్ సక్సెస్… పేషెంట్ డెడ్” విధానం సరికాదు: ధర్మాసనం వ్యాఖ్య
తీర్పు వెలువరిస్తూ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత పిటిషన్లు సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉండటం వలన ఫిరాయింపుదారులకు లాభం చేకూరుతుందని, ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేసింది. “ఆపరేషన్ సక్సెస్… పేషెంట్ డెడ్” అనే పరిస్థితి ఇక జరగకూడదని కోర్టు వ్యాఖ్యానించింది. ఆలస్యం జరిగితే పార్టీలు అన్యాయానికి గురవుతాయని, ఈ వ్యవహారంపై పార్లమెంట్ సమగ్ర చట్టం తీసుకురావాలని సూచించింది.
55
తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ ఏ విధంగా స్పందిస్తారనే అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. పది మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏంటన్న చర్చ నడుస్తోంది. ఒకవేళ ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే అసెంబ్లీలో బలాబలాల విషయంలో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీంతో కొంత మంది ఎమ్మెల్యేలు అటు ఇటు అయినా ప్రభుత్వంపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడినా కాంగ్రెస్ కు సంఖ్యా పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని మరికొందరు అంటున్నారు.