తెలంగాణ గ్రూప్ 1, 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. వారికి స్టైఫండ్.. వివరాలు ఇవే..

First Published | Apr 6, 2022, 4:36 PM IST

ఉద్యోగాల భర్తీకి సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో నిరుద్యోగులు ప్రిపరేషన్‌ను మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న బీసీ అభ్యర్థులకు మంత్రి గంగుల కమలాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. 

తెలంగాణలో 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టుగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. దీంతో నిరుద్యోగులు ప్రిపరేషన్‌ను మొదలుపెట్టారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న బీసీ అభ్యర్థులకు మంత్రి గంగుల కమలాకర్ గుడ్ న్యూస్ చెప్పారు. 

ప్ర‌భుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర‌వుతున్న బీసీ అభ్య‌ర్థుల‌కు బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత కోచింగ్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆ శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్ప‌ష్టం చేశారు. ఉచిత కోచింగ్ పొందాల‌నుకునే అభ్య‌ర్థుల కోసం రిజిస్ట్రేష‌న్ల ప్ర‌క్రియ‌ను మంత్రి బుధ‌వారం ప్రారంభించారు. 
 

Latest Videos


వార్షిక ఆదాయం రూ. 5 ల‌క్ష‌ల లోపు ఉన్న అభ్య‌ర్థులు.. ఈరోజు నుంచి ఏప్రిల్ 16 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 16వ తేదీనే కోచింగ్ కోసం ఎంపిక పరీక్ష నిర్వహించనున్నట్టుగా తెలిపారు. పరీక్షలో ఎలాంటి టాంపరింగ్ కు ఆస్కారం లేకుండా పటిష్ట టెక్నాలజీతో నిర్వహించనున్నట్టుగా చెప్పారు. తర్వాత పరీక్షల వచ్చిన మార్కుల ఆధారంగా కోచింగ్‌కు ఎంపికైన వారి జాబితా ప్రకటిస్తామని తెలిపారు. ఏప్రిల్ 21 నుంచి ఉచిత శిక్షణ తరగతులను ప్రారంభిస్తామని చెప్పారు.

దాదాపు 1,25,000 మందికి పైగా లబ్దీపొందేలా 50 కోట్లతో కోచింగ్ ప్రక్రియ రూపకల్పన చేసినట్టుగా మంత్రి గంగుల వెల్లడించారు. 25వేల మందికి నేరుగా మిగతా లక్షమందికి హైబ్రిడ్ మోడ్‌లో శిక్షణ అందివ్వనున్నట్టుగా చెప్పారు. పేద, వెనుకబడిన వర్గాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 16 స్టడీ సర్కిళ్లు, 103 స్టడీ సెంటర్ల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్టుగా చెప్పారు. ప్రజాప్రతినిధులు, ఎన్జీవోలు ముందుకొచ్చి మౌళిక వసతులు సమకూరిస్తే స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 

గ్రూప్-1, గ్రూప్-2 కోచింగ్‌కు ఎంపిక‌య్యే 10 వేల మంది అభ్య‌ర్థుల‌కు స్టైఫండ్ ఇవ్వనున్నట్టుగా మంత్రి గంగుల ప్ర‌క‌టించారు. గ్రూప్-1 అభ్య‌ర్థుల‌కు ఆరు నెల‌ల పాటు రూ. 5 వేల చొప్పున‌, గ్రూప్-2 అభ్య‌ర్థుల‌కు 3 నెల‌ల పాటు నెల‌కు రూ. 2 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తామ‌న్నారు.

ఇక, ఇటీవల ఆర్థిక శాఖ తొలి విడతగా 30,453 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అందులో 503 గ్రూప్‌-1 పోస్టుల కూడా ఉన్నాయి. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెలలోనే వెలువడే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు గ్రూప్ 2 పోస్టుల భర్తీకి ఇంకా అనుమతి రాలేదు.

click me!