Telangana Heavy Rains: తెలంగాణలో రాబోయే కొన్నిగంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి.
తెలంగాణలో కుండపోత వర్షాలు.. అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్
తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ వారం మొత్తం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు గంటల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
ఐఎండీ హెచ్చరికల మధ్య ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సహాయం అవసరమైతే వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు.
25
భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం
మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అనేక చోట్ల వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు మునిగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల రైలు పట్టాలు దెబ్బతిన్నాయి. దీంతో రైళ్లను రద్దు చేయాల్సి వచ్చింది. కార్లు, బైక్‌లు వరదలో కొట్టుకుపోయిన ఘటనలు వైరల్ గా మారాయి.
35
కామారెడ్డి, మెదక్‌లో వర్ష బీభత్సం
కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 31.93 సెం.మీ. వర్షపాతం నమోదైంది. అనేక ప్రాంతాలు పూర్తిగా మునిగిపోయాయి. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలు కూడా వర్షాలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కలెక్టర్లను అప్రమత్తం చేసి, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ నగరానికి ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
రాబోయే మూడు గంటల్లో నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు.
55
మరో ఐదు రోజులు తెలంగాణలో వర్షాలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాలు ప్రకారం.. వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, కామారెడ్డి, మెదక్, మేడ్చల్, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలపై వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.
శుక్రవారం, శనివారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే, భారీ ఈదురుగాలులు వీచే అవకాశముందని కూడా హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తంగా ఉంది. సహాయక బృందాల సూచనలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తోంది.