Telangana Weather : తెలంగాణలో రాబోయే నాలుగురోజులు ఎండలు మండిపోనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాల్లో అయితే ఏకంగా 40 డిగ్రీలకు చేరువలో టెంపరేచర్స్ నమోదుకానున్నాయని హెచ్చరించింది.
Heat Wave Alert : మార్చ్ వచ్చేసింది... ఇక అసలుసిసలైన వేసవికాలం ప్రారంభమవుతోంది. ఇప్పటికే చలి పూర్తిగా తగ్గి ఎండలు మొదలయ్యాయి... ఇకపై మరింత ముదిరి తారాస్థాయికి చేరతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. తెలంగాణలో ఇవాళ(సోమవారం) నుండి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి... రాబోయే నాలుగురోజులు ఇవి మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.
25
ఇవాళ్టి నుండే ఎండలు షురూ...
మార్చ్ 2 నుండి ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిర్మల్ జిల్లాల్లో 36 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే మూన్నాలుగు రోజులు అంటే మార్చ్ 6 వరకు ఇదే పరిస్థితి ఉంటుందని ప్రకటించింది. కాబట్టి ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
35
ఈ జిల్లాల్లో ఎండలే ఎండలు
ఇక మార్చి 4 (బుధవారం) నుండి భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ములుగు, వనపర్తి జిల్లాల్లో... మార్చ్ 5 నుండి కామారెడ్డి, మెదక్, నారాయణపేట, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఎండలు ముదురుతాయని... అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మార్చి 6 వరకు ఈ జిల్లాల్లో 36 నుండి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇదిలా ఉంటే మార్చిలో ఎండలు కేవలం శాంపిల్స్ మాత్రమేనని... ఏప్రిల్, మేలో అత్యధిక ఉష్ణోగ్రతలతో భానుడి భగభగలు తారాస్థాయికి చేరతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. సాధారణంగా ప్రతి వేసవిలో ఈ రెండునెలలు ఎండలు అధికంగా ఉంటాయి.. కానీ ఈసారి మాత్రం మరింత ఎక్కువగా ఉంటాయని ప్రకటించింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి భారీగా ఎండల తీవ్రత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
55
హైదరాబాద్ లో హయ్యెస్ట్ టెంపరేచర్స్
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా ఉష్ణోగ్రతలు పెరిగి నగరవాసులను వేడిగాలులు, ఉక్కపోత సతమతం చేస్తాయని వెదర్ మ్యాన్ తెలిపారు. మంగళవారం అత్యధికంగా 36 నుండి 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుందని హెచ్చరించారు. ఈస్ట్ తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా 40 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. కాబట్టి ఈ ఎండలనుండి ఉపశమనం కోసం ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.