
తెలంగాణలో రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు భారీ బూస్ట్ లభించింది. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత ఈజీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.
నేషనల్ హైవే-63 లోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల సెక్షన్‌తో పాటు, నేషనల్ హైవే-563 లోని జగిత్యాల-కరీంనగర్ సెక్షన్‌ను 4 లేన్లుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.7,597.16 కోట్లు కావడం విశేషం.
ఈ మెగా రోడ్డు ప్రాజెక్టుల మొత్తం పొడవు 190.76 కిలోమీటర్లు. పనులను వేగంగా పూర్తి చేయడం కోసం మొత్తం మూడు ప్యాకేజీలుగా దీనిని విభజించారు. మొదటిది ఆర్మూర్-జగిత్యాల సెక్షన్ (63.6 కి.మీ), రెండోది జగిత్యాల-మంచిర్యాల సెక్షన్ (68.295 కి.మీ). ఈ రెండూ ఎన్‌హెచ్-63 కిందకు వస్తాయి.
వీటిని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో డెవలప్ చేస్తారు. ఇక మూడో ప్యాకేజీ కింద ఎన్‌హెచ్-563 లోని జగిత్యాల-కరీంనగర్ మధ్య ఉన్న 58.866 కిలోమీటర్ల రోడ్డును బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOT-Toll) పద్ధతిలో నిర్మించనున్నారు.
ప్రస్తుతం ఈ రూట్లలో ప్రయాణించాలంటే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జనాభా ఎక్కువగా ఉండటం, ఇరుకైన రోడ్ల వల్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల కారిడార్ పరిధిలోని అంకసాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల లాంటి ఏరియాల్లో ప్రయాణం నరకంగా మారింది.
అలాగే జగిత్యాల-కరీంనగర్ సెక్షన్‌లోని పొతారం, గంగాధర, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ 4 లేన్ హైవేల వల్ల ఈ నగరాలు, గ్రామాల చుట్టూ బైపాస్ రోడ్లు వస్తాయి. అంతేకాదు, ఇందులో ఓపెన్ టోలింగ్ సిస్టమ్ ఉంటుంది. దీనివల్ల గంటకు 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో వెహికల్స్ దూసుకెళ్లొచ్చు. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు ఇక తీరిపోనున్నాయి.
ఈ అప్‌గ్రేడెడ్ రోడ్లు కేవలం ప్రయాణానికే కాదు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద అసెట్ కానున్నాయి. ఇవి ఐదు ఎకనామిక్ నోడ్స్, ఏడు సోషల్ నోడ్స్, పది లాజిస్టిక్స్ నోడ్స్‌ను కలుపుతాయి. సిద్దిపేట, వరంగల్ అర్బన్‌లోని స్పెషల్ ఎకనామిక్ జోన్లు, నిజామాబాద్, సిద్దిపేటలోని మెగా ఫుడ్ పార్కులు, రాజన్న సిరిసిల్లలోని ఫిషింగ్ అండ్ సీఫుడ్ క్లస్టర్‌లకు ఈ రోడ్ల ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది.
వీటితో పాటు వేములవాడ, కొండగట్టు, నగునూరు కోట, ధర్మపురి, కాళేశ్వరం, లోయర్ మానేరు డ్యామ్, ఖిల్లా కోట లాంటి ఫేమస్ టూరిజం, ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లడం ఈజీ అవుతుంది. నిజామాబాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంచిర్యాల, పొద్దూరు, గంగాధర, కరీంనగర్ రైల్వే స్టేషన్లకు కూడా కనెక్టివిటీ మెరుగుపడటంతో మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ సూపర్ సక్సెస్ అవుతుంది.
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే టైమ్ చాలా సేవ్ అవుతుంది. ఆఫీషియల్ లెక్కల ప్రకారం, ఆర్మూర్ నుంచి మంచిర్యాల వెళ్లే వారికి దాదాపు గంటన్నర టైమ్ కలిసి వస్తుంది. అలాగే జగిత్యాల నుంచి కరీంనగర్ జర్నీ టైమ్ 45 నిమిషాల వరకు తగ్గుతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, కాలుష్యం తగ్గుతుంది. వెహికల్ మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.
ఈ ప్రాజెక్టులో గ్రీన్‌ఫీల్డ్ డెవలప్‌మెంట్ కూడా భారీగానే ఉంది. ఆర్మూర్-జగిత్యాలలో 45.65 కి.మీ, జగిత్యాల-మంచిర్యాలలో 66.10 కి.మీ, జగిత్యాల-కరీంనగర్‌లో 34.96 కి.మీ మేర కొత్తగా రోడ్లు వేస్తారు. ఈ నిర్మాణ పనుల వల్ల సుమారు 34.43 లక్షల డైరెక్ట్ మ్యాన్ డేస్, 42.7 లక్షల ఇన్‌డైరెక్ట్ మ్యాన్ డేస్ ఉపాధి లభిస్తుంది.
ఈ రూట్లలో ప్రయాణించే వాహనాల సంఖ్య ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే షాక్ అవుతారు. 2024-25 నాటి యాన్యువల్ యావరేజ్ డైలీ ట్రాఫిక్ రికార్డుల ప్రకారం.. ఆర్మూర్-జగిత్యాల సెక్షన్‌లో రోజుకు 14,949 పిసియు (ప్యాసింజర్ కార్ యూనిట్స్), జగిత్యాల-మంచిర్యాల సెక్షన్‌లో 12,084 పిసియు, అలాగే జగిత్యాల-కరీంనగర్ రూట్‌లో ఏకంగా 20,446 పిసియు ట్రాఫిక్ నమోదైంది. ట్రాఫిక్ ఈ రేంజ్‌లో ఉంది కాబట్టే, ఈ రోడ్లను వెంటనే 4 లేన్లుగా మార్చడం అత్యంత అవసరంగా మారింది.