
Telangana Rains : తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి... గత రెండుమూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా జోరువానలు పడుతున్నాయి. కొన్నిజిల్లాల్లో ఏకదాటిగా కురుస్తున్న జడివాన భయానక పరిస్థితులను సృష్టిస్తోంది... వరదనీటితో నదులు, వాగులువంకలు ప్రమాదకరంగా ప్రవహిస్తూ జనావాసాలను ముంచెత్తుతున్నాయి... చెరువులు నిండుకుండల్లా మారి ఉప్పొంగడంతో ప్రాణనష్టం, ఆస్తినష్టం జరుగుతోంది. జలాశయాలకు కూడా అంతకంతకు వరద ప్రవాహం పెరుగుతుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు... దీంతో ప్రవాహ ఉద్ధృతి పెరిగి ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
నిన్నంతా (బుధవారం) కుండపోత వర్షాలు కురిసి కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలను అతలాకుతలం చేశాయి. అయితే ఈ కుండపోత నిన్నటితోనే ఆగిపోలేదు.. ఇవాళ(గురువారం) కూడా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నదులు, వాగుల్లోకి మరింత వరదనీరు చేరుతోంది... దీంతో ఆయా జిల్లాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలా ఇవాళ ఉదయం నుండి మధ్యాాహ్నం వరకు కొన్నిప్రాంతాల్లో రికార్డు వర్షపాతం నమోదవడం ఆందోళన రేకెత్తిస్తోంది. వర్షతీవ్రత ఎక్కువగా ఉన్నప్రాంతాల ప్రజలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు.
తెలంగాణలో వర్షభీభత్సం ఏస్థాయిలో ఉందో గత మూడునాలుగు గంటల్లో నమోదైన వర్షపాతమే తెలియజేస్తుంది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం ఇవాళ ఇప్పటివరకు అత్యధికంగా 100 మి.మీ పైగా వర్షపాతం నమోదైన ప్రాంతాలివే...
రామారెడ్డి - కామారెడ్డి జిల్లా - 149.8 మిల్లీమీటర్లు
సిర్కొండ - నిజామాబాద్ జిల్లా - 149.5 మి.మీ
భీంగల్ - నిజామాబాద్ - 100 మి.మీ
ఇక ధర్పల్లిలో 90, నిర్మల్ జిల్లా పెంబిలో 84.8, పెద్దపల్లి జిల్లా రామగిరిలో 84.5, జగిత్యాల జిల్లా కథల్పూర్ 78.5, సిరిసిల్ల జిల్లా రుద్రంగి 78.3, నస్రుల్లాబాద్ 77.5, కరీంనగర్ 70 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయినట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ వేదికన ప్రకటించారు.
గత మంగళవారం నుండి కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి (బుధవారం) నుండి నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు వర్షాలు వ్యాపించాయి. ఇలా ఇవాళ ఉదయం వరకు కొన్నిచోట్ల 400 మిల్లిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలా అత్యధిక వర్షపాతం నమోదైన టాప్ 10 ప్రాంతాలగురించి తెలుసుకుందాం.
1. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్గొండ గ్రామం - 440.5 మిల్లిమీటర్లు
2. నిర్మల్ జిల్లాలోని అక్కపూర్ గ్రామం - 325.3 మి.మీ
3. మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ మండలం సర్దన గ్రామం - 316 మి.మీ
4. కామారెడ్డి జిల్లా కేంద్రం - 308 మి.మీ
5. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలకేంద్రం -289 మి.మీ
6. నిర్మల్ జిల్లా లక్ష్మన్ చంద మండలం వడ్యాల్ - 281.3 మి.మీ
7. కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలకేంద్రం - 279 మి.మీ
8. మెదక్ హవేలి ఘనపూర్ మండలం నాగపూర్ - 278.8 మి.మీ
9. కామారెడ్డి మండలం పాత రాజంపేట - 249.8 మి.మీ
10. నిర్మల్ మండలంలోని విశ్వనాథ్ పేట - 241.3 మి.మీ
ప్రస్తుతం కుండపోత వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మరికకొద్దిసేపట్లో వర్షాలు తగ్గుముఖం పడతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ఎక్స్ వేదికన వెల్లడించారు. గురువారం ఉదయం నుండి కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి... అయితే మధ్యాహ్నం 3PM గంటల తర్వాత ఈ జిల్లాల్లో వర్షాలు తగ్గే అవకాశాలున్నాయని వెల్లడించారు. జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో కూడా భారీ వర్షాలు తగ్గి తేలికపాటి జల్లులు కొనసాగుతాయని తెలిపారు.
సిరిసిల్లలో మధ్యాహ్నం 2PM తర్వాత... మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో 3 to 3.30PM తర్వాత వర్షాలు తగ్గే అవకాశాలున్నాయని వెల్లడించారు. కరీంనగర్, భూపాలపల్లి, పెద్దపల్లి, హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు తగ్గాయి.. అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో కూడా ముసురు కొనసాగుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించాల్సి ఉంది... కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఇది వాయిదా పడింది. పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించాలని సీఎం భావించారు... కానీ ఆ జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో హెలికాప్టర్ వెళ్లేందుకు అనుకూల వాతావరణం లేదు. అందుకే తన పర్యటనను వాయిదా వేసుకున్న సీఎం ఆయా జిల్లాల్లో పరిస్థితులను హైదరాబాద్ నుండే సమీక్షించారు. వర్షతీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల అధికారులే కాదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే వాతావరణం చక్కబడితే సీఎం ఎరియల్ సర్వే కొనసాగనుంది.
ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల్లో అన్నిరకాల సహాయసహకారాలు అందించేందుకు ఏర్పాటు చేసిందన్నారు సీఎం రేవంత్. పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బందితో పాటు ఎన్డిఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎస్ బలగాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయని వెల్లడించారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సీఎం రేవంత్ ధైర్యం చెప్పారు.