Telangana Budget 2025 : తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26 ను రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి మొత్తం బడ్జెట్ రూ.3,04,965 కోట్లుగా అంచనా వేయగా ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా పేర్కొన్నారు. వ్యవసాయ, విద్యుత్, రోడ్లు భవనాలు, హోం, పట్టణాభివృద్ధి, పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలకు భారీగా నిధులు కేటాయించారు.
అయితే ఈ బడ్జెట్ లో అత్యధికంగా షెడ్యూల్ కులాల (ఎస్సి) సంక్షేమానికి ఏకంగా రూ.40,234 కోట్లు కేటాయించారు. ఇక షెడ్యూల్ తెగల (ఎస్టి) సంక్షేమానికి మరో రూ.17,169 కోట్లు కేటాయించారు. ఇలా కేవలం ఎస్సి, ఎస్టిల కోసమే ఈ బడ్జెట్ లో సింహభాగం కేటాయించారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపడంతో రేవంత్ సర్కార్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి... ఇప్పుడు బడ్జెట్ లో కూడా వారికి భారీగా నిధులు దక్కడంతో ఆ ప్రశంసలు మరింత పెరిగాయి.
బడ్జెట్ లో తమ వర్గాలకు భారీగా నిధులు దక్కడంపై ఎస్సీ,ఎస్టి ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన చర్యలు, ప్రభుత్వ పథకాలు అద్భుతమని వారు కొనియాడుతున్నారు. తెలంగాణలోని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని... అందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణ, బడ్జెట్ లో నిధులు కేటాయింపు అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పేర్కొంటున్నారు.