
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే పలుమార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు... కానీ ఈ అసెంబ్లీ సెషన్ చాలా ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే చాలాకాలం తర్వాత మాజీ ముఖ్యంమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) సభకు హాజరయ్యారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ దగ్గరకువెళ్లి మర్యాదపూర్వకంగా దండం పెట్టి కరచాలనం చేశారు. ఈ రేర్ సీన్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వైరల్ వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లు మాత్రమే కాదు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా కనిపించారు. ఈ నలుగురు నాయకులు ఒకేదగ్గర కనిపించడం చాలా అరుదు... ఇదే మొదటిసారి అనుకుంటా. అయితే కరచాలనం సమయంలో సీఎం, మాజీ సీఎం ఇద్దరూ నవ్వుతూ కనిపించారు... ఈ సమయంలో కేటీఆర్ రియాక్షన్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది.
అసెంబ్లీ సమావేశం ప్రారంభానికి ముందే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలోకి చేరుకున్నారు. అనంతరం సమావేశ మందిరంలోకి ప్రవేశించిన సీఎం రేవంత్ రెడ్డి నేరుగా ప్రతిపక్ష నేతల సీట్లవైపు వెళ్లారు. ఈ క్రమంలో కేసీఆర్ తో సహా ఇతర ఎమ్మెల్యేలంతా లేచి నిల్చున్నారు... అందరికి దండం పెడుతూ ముందుకు కదిలారు రేవంత్. నేరుగా కేసీఆర్ వద్దకు వెళ్లి కరచాలనం చేశారు.
ఈ సమయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా లేచి నిల్చున్నా మాజీ మంత్రి కేటీఆర్ మాత్రం కూర్చునే ఉన్నారు. దీంతో ఆయన పక్కనే ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా లేచే ప్రయత్నంచేసి అలాగే కూర్చుండిపోయారు. హరీష్ రావుతో సహా అందరూ లేచి నిల్చున్నా కేటీఆర్ మాత్రం కూర్చుని ఉండటం ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఎంత కోపం ఉందో ఈ చర్యల ద్వారా కేటీఆర్ చెప్పకనే చెప్పినట్లుంది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల కోసం నిన్న(డిసెంబర్ 28, ఆదివారం) ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇవాళ (డిసెంబర్ 29, సోమవారం) ఉదయమే నందినగర్ నివాసంనుండి అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీ రిజిస్టర్ లో సంతకంపెట్టి సభలోకి వచ్చిన ఆయన జాతీయ గీతం, సంతాప తీర్మానాల అనంతరం వెళ్ళిపోయారు. ఇలా కేసీఆర్ కేవలం 3 నిమిషాలే సభలో ఉన్నట్లు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
ప్రజల కోసం కాదు తన పదవికి కాపాడుకునేందుకే కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యారని కాగ్రెస్ నాయకులు అంటున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా ఎక్కువరోజులు సభకు హాజరుకాకుంటే అనర్హత వేటు పడే అవకాశాలుంటాయి... దీన్నుండి తప్పించుకునేందుకే కేసీఆర్ సభకు వచ్చారని అంటున్నారు. ఇలా వచ్చి అలా అటెండెన్స్ వేసుకున్నారు... పని అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయారని కాంగ్రెస్ నాయకులు మండిపడతున్నారు.
తెలంగాణ రాజకీయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటలయుద్దంతో హీటెక్కాయి. ఇటీవల సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి ఓ బహిరంగ సభలో కేటీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ''ఆస్తి కోసం సొంత చెల్లిని మెడలు పట్టుకొని బయటికి నెట్టావ్. ఆమెకే సమాధానం చెప్పలేనివాడివి నాకు సవాల్ విసురుతావా? లాగులో తొండలు విడిచి కొడతా బిడ్డ. మీ నాయనను అడుగు నా గురించి చెబుతాడు. అమెరికాలో బాత్రూంలు కడిగినట్లు అనుకుంటున్నావా నాతో మట్లాడటం. హౌల పోరడు... గాలికి తిరిగే గాలిగాడితో నాకెందుకు అని వదిలేస్తున్నా" అంటూ రేవంత్ రెడ్డి సిరియస్ కామెంట్స్ చేశారు.
రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ కూడా అదేస్థాయిలో రియాక్ట్ అయ్యారు. ''రోడ్లమీద పెయింటింగ్ లు వేసుకునే రేవంత్ రెడ్డి లంగ పనులు చేసి పైకి వచ్చాడు. డబ్బులు మోస్తూ అడ్డంగా దొరికి జైలుకు వెళ్లాడు. ఆయన కిస్తత్ బాగుండి పేమెంట్ కోటాలో సీఎం అయ్యాడు. వీడెం ముఖ్యమంత్రి... ఇదేం బాష. రెండెళ్ల నుండి చేశావురా అయ్యా అంటే లాగుల తొండలిడుస్తా.. పేగులు మెడల వేసుకుంటా అంటుండు. ఎన్ని బాషల్లో కావాలంటే అన్ని బాషల్లో తిడతా. కనకపు సింహాంసనం మీద శునకాన్ని కూర్చోబెట్టినట్లుంది. ఆయన భార్య గీతమ్మకు చెబుతున్నా...వీడు ఎవడినన్నా కరిచేముందే కట్టేయమని'' అంటూ కేటీఆర్ సీరియస్ అయ్యారు.