Shabbir ali
హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నకొద్దీ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. హ్యాట్రిక్ విజయం కోసం బిఆర్ఎస్... తొలిసారి విజయం కోసం బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో నాయకులను సమన్వయం చేసుకుంటూ, అసమ్మతులను బుజ్జగించుకుంటూ, ప్రత్యర్థి పార్టీల ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ, వ్యూహాలు ప్రతివ్యూహాలు రచిస్తూ పార్టీలు ముందుకు వెళుతున్నాయి. ఈ క్రమంలో కొందరు నాయకులు టికెట్లు దక్కక బాధపడుతుంటే మరికొందరు నాయకులు టికెట్ ఇస్తామన్నా వెనక్కి తగ్గుతున్నారు. ఇలా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ కూడా సీఎం కేసీఆర్ పై ఫోటీకి జంకుతున్నట్లు తెలుస్తోంది.
Shabbir ali
రాజకీయాల్లో హత్యలు వుండవు... అన్నీ ఆత్మహత్యలే అంటుంటారు... సీఎం కేసీఆర్ పోటీచేస్తే తన పరిస్థితి ఇలాగే తయారవుతుందని షబ్బీర్ అలీ బావిస్తున్నారట. అందువల్లే నియోజకవర్గంపై కాంగ్రెస్ పట్టు వున్నా... గతంలో ఇక్కడినుండే ప్రాతినిధ్యం వహించినా... కాంగ్రెస్ లో సీనియర్ నేతగా కొనసాగుతున్నా... ఈసారి కామారెడ్డి నుండి పోటీకి షబ్బీర్ అలీ విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. అందువల్లే కీలకమైన నాయకుల పేర్లు కాంగ్రెస్ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ లోనే వున్నా షబ్బీర్ అలీ పేరు మాత్రం కనిపించలేదు.
Shabbir ali
సీఎం కేసీఆర్ పోటీకి దిగి గెలిస్తే మంచిదే... కానీ ఓడిపోతే తన పొలిటికల్ కెరీర్ ఇంతటితో ఆగిపోయే ప్రమాదముందని షబ్బీర్ అలీ భయపడుతున్నారట. ఇదే విషయాన్ని టిపిసిసితో పాటు కేంద్ర పెద్దల వద్ద కూడా ప్రస్తావించినట్లు సమాచారం. వారినుండి రాజకీయ భవిష్యత్ పై భరోసా లభిస్తే కామారెడ్డి నుండి పోటీ చేయాలని... లేదంటే మరో నియోజకవర్గానికి మారాలని షబ్బీర్ అలీ ప్రయత్నిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Shabbir ali
కామారెడ్డి నుండి కాకుంటే ఎల్లారెడ్డి నుండి పోటీ చేయాలని షబ్బీర్ భావిస్తున్నారట. కానీ ఇప్పటికే ఎల్లారెడ్డి నుండి పోటీకి మదన్ మోహన్ రావు సిద్దమైన నేపథ్యంలో ఆయనను బుజ్జగించే పనిలో షబ్బీర్ అలీ పడ్డారట. అన్నీ కుదిరితే ఈసారి ఎల్లారెడ్డి బరిలో దిగేందుకే షబ్బీర్ ఆసక్తి చూపిస్తున్నారట... ఏదీ కుదరకపోతేనే సీఎం కేసీఆర్ పై పోటీకి సిద్దపడనున్నారట. షబ్బీర్ అలీ ఏం చేస్తారన్నదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.
Shabbir ali
షబ్బీర్ అలీ కేసీఆర్ పై పోటీ చేయాలా వద్దా అన్నది ఇంకా నిర్ణయించుకోకపోవడం వల్లే కాంగ్రెస్ అభ్యర్థులు తొలి జాబితాలో ఆయన పేరు ప్రకటించనట్లుగా సమాచారం. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క,ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్లందరి పేర్లు ఫస్ట్ లిస్ట్ లోనే వుంటే షబ్బీర్ అలీ పేరు లేకపోవడంతోనే కేసీఆర్ పై పోటీకి ఆయన వెనకడుగు వేస్తున్నారనే ప్రచారం జోరందుకుంది. ఒకవేళ ఇదే నిజమైన కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ ఎవరిని పోటీకి దింపుతున్నది ఆసక్తికరంగా మారనుంది.