నేడు తెలంగాణలో వాతావరణ పరిస్థితి :
తెలంగాణలో గత రెండుమూడు రోజులుగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. భానుడి భగభగలు పెరిగిపోవడంతో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవాళ కూడా ఇదే పరిస్ధితి ఉంటుందని... ఈ ఎండలతో జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎండలు, వడగాలుల తీవ్రత అధికంగా ఉండే జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీచేసారు.
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఎండలు ఎక్కువగా ఉండనున్నాయని ప్రకటించారు. అలాగే సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉంటుందట. ఈ జిల్లాల్లో తెలంగాణలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. అందువల్లే ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. అంటే ఈ ఎండలు ప్రమాదకర స్థాయిలో ఉంటాయని... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించడం అన్నమాట.
ఇక తెలంగాణలోని మరో 21 జిల్లాల్లో కూడా ఎండల తీవ్రత ఎక్కువగానే ఉండనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. అంటే రెడ్ అలర్ట్ జిల్లాల్లో కంటే ఇక్కడ ఎండల తీవ్రత కాస్త తక్కువగా ఉంటుందన్నమాట. ఈ జిల్లాలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది... వడగాలుల తీవ్రత కూడా ఉంటుంది.