తెలంగాణలోని ఈ న‌గ‌రానికి మహర్దశ.. ఢిల్లీలో రేవంత్ రెడ్డి కీలక భేటీ, ప్ర‌పంచ ఎయిర్‌లైన్స్ కేంద్రంగా..

Published : Jun 22, 2026, 02:50 PM IST

Telangana: న్యూఢిల్లీలో జరిగిన కీలక సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో రాష్ట్ర అభివృద్ధి, రక్షణ రంగ ప్రాజెక్టులు, విమానయాన మౌలిక వసతులపై విస్తృతంగా చర్చించారు.  

PREV
15
గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు కేంద్ర సహకారంపై కృతజ్ఞతలు

గాంధీ సరోవర్ ప్రాజెక్టు అమలుకు అవసరమైన రక్షణ శాఖ భూముల బదలాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో నీటి వనరుల అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న మద్ధతు భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.

25
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రాష్ట్రం నుంచి పూర్తి సహకారం

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, భారత వైమానిక దళం చేపడుతున్న ఆదిలాబాద్ విమానాశ్రయ విస్తరణ ప్రణాళికలపై కూడా చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగేందుకు అవసరమైన భూ సేకరణ, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా వంటి యుటిలిటీ సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం హామీ ఇచ్చారు. దేశ భద్రతకు సంబంధించిన ప్రాజెక్టు కావడంతో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పనులు త్వరగా పూర్తిచేస్తామని కేంద్ర మంత్రికి వివరించారు. ఆదిలాబాద్ విమానాశ్రయం భవిష్యత్తులో రక్షణ అవసరాలతో పాటు పౌర విమానయానానికి కూడా కీలక కేంద్రంగా మారే అవకాశాలున్నాయని తెలిపారు.

35
ఆదిలాబాద్ ఎలా మారబోతోంది?

ఆదిలాబాద్ విమానాశ్రయం కేవలం ప్రయాణికుల రాకపోకలకే పరిమితం కాకుండా బహుముఖ విమానయాన కేంద్రంగా అభివృద్ధి చెందే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత వైమానిక దళం కార్యకలాపాలతో పాటు సివిల్ ఏవియేషన్ టెర్మినల్, కార్గో హబ్, విమానాల మరమ్మతు కేంద్రాలు (MRO), హ్యాంగర్లు వంటి సదుపాయాలు ఏర్పడితే ఉత్తర తెలంగాణలో భారీ ఆర్థిక చైతన్యం రావచ్చు. ఇలాంటి మౌలిక వసతులు అందుబాటులోకి వస్తే విమానయాన రంగానికి చెందిన సంస్థలు, లాజిస్టిక్స్ కంపెనీలు, నిర్వహణ సేవల సంస్థలు పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంటుంది. దీంతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడమే కాకుండా, ఆదిలాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా కూడా వేగంగా ఎదిగే అవకాశం ఉంది.

45
ప్రపంచ ఎయిర్‌లైన్స్‌కు ప్రత్యామ్నాయ కేంద్రంగా ఎదిగే అవకాశం

మధ్యప్రాచ్యం, పశ్చిమాసియా ప్రాంతాల్లో ఇటీవల నెలకొన్న భౌగోళిక, భద్రతా పరిస్థితులను ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి, భవిష్యత్తులో అంతర్జాతీయ విమానయాన సంస్థలు కొత్త కార్యకలాపాల కేంద్రాలను అన్వేషించే అవకాశం ఉందన్నారు. అందుకే ఆదిలాబాద్‌లో పెద్ద ఎత్తున హ్యాంగర్లు, నిర్వహణ కేంద్రాలు, కార్గో సదుపాయాలు ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర రక్షణ మంత్రిని కోరారు. భౌగోళికంగా అనుకూల ప్రాంతంలో ఉండటం, విస్తరణకు తగిన భూములు అందుబాటులో ఉండటం వంటి అంశాలు ఆదిలాబాద్‌కు అదనపు ప్రయోజనాలుగా మారవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

55
దేవరకద్రలో డీఆర్‌డీవో ప్రాజెక్టుకు వేగం కోరిన సీఎం

సమావేశంలో మరో ముఖ్య అంశంగా మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర సమీపంలో ప్రతిపాదిత డీఆర్‌డీవో, డీఆర్‌డీఎల్ ప్రాజెక్టు ప్రస్తావన వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర అనుమతులు త్వరగా మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రక్షణ పరిశోధన, సాంకేతిక అభివృద్ధి రంగాల్లో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించగలదని పేర్కొన్నారు. ప్రాజెక్టు అమలులో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రికి తెలిపారు.

తెలంగాణకు రక్షణ రంగంలో కొత్త అధ్యాయం

ఈ సమావేశం ద్వారా తెలంగాణలో రక్షణ, విమానయాన రంగాలకు సంబంధించిన కీలక ప్రాజెక్టులు మరింత వేగం పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ విమానాశ్రయ విస్తరణ, దేవరకద్రలో డీఆర్‌డీవో ప్రాజెక్టు, గాంధీ సరోవర్ వంటి కార్యక్రమాలు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడటమే కాకుండా జాతీయ భద్రతా వ్యవస్థలో తెలంగాణ పాత్రను మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories