Sri Rama Navami 2025
Rama Navami : శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని యావత్ భారతదేశం వేడుకలకు సిద్దమవుతోంది. ఆ సీతారాములు నడయాడిన అయోధ్యలోని భవ్య రామమందిరం నుండి మారుమూల గ్రామం లోని దేవాలయాల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాల్లో అట్టహాసంగా రామనవమి వేడుకలు జరగనున్నాయి. దక్షిణాది అయోధ్యగా పిలుచుకునే భద్రాచలం రామాలయంలో అత్యంత వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది.
ఈసారి శ్రీరామనవమి ఆదివారం (ఏప్రిల్ 6న) వస్తోంది. సాధారణంగా రామనవమి రోజున భద్రాచలంలో జరిగే సీతారాములు కళ్యాణాన్ని కనులారా చూసేందుకు భారీగా భక్తులు తరలివస్తారు. కేవలం తెలంగాణ నుండే కాదు ఆంధ్ర ప్రదేశ్ నుండి కూడా భక్తులు వస్తుంటారు. అలాంటింది ఈసారి శ్రీరామ నవమి ఆదివారం వస్తోంది... కాబట్టి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ రద్దీ కారణంగానో లేదంటే మరేదైనా కారణంగానో మీరు భద్రాచలం వెళ్లలేకపోతున్నారా? సీతారాముల పెళ్లిలో ఉపయోగించే పవిత్ర తలంబ్రాలను పొందలేకపోతున్నామని బాధపడుతున్నారా? అయితే మీరు భద్రాచలం వెళ్లకపోయినా సీతారాముల కల్యాణ తలంబ్రాలను పొందవచ్చు. ఎలా పొందాలో తెలుసుకుందాం.
Sri Rama Navami 2025
భద్రాచలం నుండి మీ ఇంటికే ముత్యాల తలంబ్రాలు ... ఇందుకోసం మీరేం చేయాలంటే...
భద్రాచలంలో రేపు(ఆదివారం) శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతాయి. రాములోరి ఆలయానికి ఎదురుగా ఉన్న మిథిలా స్టేడియంలో ఇప్పటికే కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించేందుకు వచ్చే భక్తులకు ముత్యాల తలంబ్రాలు అందిస్తారు. అయితే ఇప్పుడు తలంబ్రాలను భద్రాచలం వెళ్ళినవారికే కాదు వెళ్లలేకపోయినవారు కూడా పొందవచ్చు. ఇందుకోసం దేవాదాయ శాఖ, టిఎస్ ఆర్టిసి, తపాలా విభాగాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసాయి.
దేవాదాయ శాఖ ద్వారా సీతారాముల తలంబ్రాల పంపిణీ :
తెలంగాణ దేవాదాయ శాఖ భద్రాచల సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను భక్తులను అందించే ఏర్పాట్లు చేసింది. భద్రాచలం టెంపుల్ ఇన్ఫర్మేషన్ యాప్ ద్వారా తలంబ్రాలను పొందవచ్చు. ఈ యాప్ ను ఓపెన్ చేసి మీ వివరాలను నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. కొంత నగదు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇలా మీ పోన్ నుండే భద్రాచలం తలంబ్రాలను పొందవచ్చు.
ఇక భద్రాచలం దేవస్థానం వెబ్ సైట్ ద్వారా కూడా తలంబ్రాలను పొందవచ్చు. ఇందులో కూడా వివరాలను పొందుపర్చి, నగదు చెల్లింపులు పూర్తిచేస్తే చాలు. మీరు పేర్కొన్న అడ్రస్ కు తలంబ్రాలను పంపిస్తారు.
bhadrachalam kalyanam
తెలంగాణ ఆర్టిసి ద్వారా భద్రాచలం తలంబ్రాలు పొందడం ఎలా?
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ఆర్టిసి కూడా రామభక్తుల సేవకు సిద్దమయ్యింది. భద్రాచలం ఆలయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ సీతారాముల ముత్యాల తలంబ్రాల పంపిణీకి సిద్దమయ్యింది. ఇందుకోసం మీరు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ లో ఆర్టిసి అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది.
ఆఫ్ లైన్ లో అయితే మీరు నేరుగా దగ్గర్లోని ఆర్టిసి బస్టాండ్ కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ టిజిఆర్టిసి లాజిస్టిక్ కేంద్రంలో రూ.151 చెల్లించి మీ పేరు, ఇతర వివరాలు అందించాలి. తద్వారా రేపు సీతారాముల కల్యాణంలో ఉపయోగించే తలంబ్రాలను నిర్ణీత గడువులోపు మీరు పేర్కొనే అడ్రస్ కు పంపిస్తారు.
మీరు ఆర్టిసి బస్టాండ్ కు వెళ్లకుండానే ఆఫ్ లైన్ లో భద్రాచలం తలంబ్రాల కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు ఆర్టిసి కాల్ సెంటర్ 040 23450033 లేదా 040 69440000 లేదా 040 69440099 కు ఫోన్ చేయాల్సి ఉంటుంది. తద్వారా మీవద్దకే ఆర్టిసి మార్కెటింగ్ సిబ్బంది వచ్చి వివరాలను సేకరిస్తారు... నగదు కూడా వారికే చెల్లించి తలంబ్రాల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు.
ఇక ఆన్ లైన్ లో అయితే టిజిఎస్ ఆర్టిసి వెబ్ సైట్ http://tgsrtclogistics.co.in ఓపెన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి.యూపిఐ లేదా డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు చెల్లించి బుకింగ్ ప్రక్రియను పూర్తిచేయాలి. ఇలా కూడా సీతారాముల కల్యాణ తలంబ్రాలను ఇంటివద్దే ఉండి పొందవచ్చు.
Seetharama Kalyanam
తపాలా శాఖ ద్వారా సీతారాముల కల్యాణ్ తలంబ్రాలు :
ఇండియన్ పోస్టల్ శాఖ కూడా భద్రాచలం సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు అందిస్తున్నాయి. పోస్ట్ లో ఈ తలంబ్రాలను పొందేందుకు ముందుగా దగ్గర్లోని పోస్టాఫీసుకు వెళ్ళాల్సి ఉంటుంది. మీ వివరాలను నమోదు చేసుకుని నగదు చెల్లించాలి. ఇలా మీరు పేర్కొనే అడ్రస్ కు స్పీడ్ పోస్ట్ లో తలంబ్రాలు వస్తాయి.
అయితే రేపు(ఆదివారం, ఏప్రిల్ 6) సీతారాముల కల్యాణం లోపే తలంబ్రాల కోసం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ బుకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. తలంబ్రాల పంపిణీని ప్రారంభిస్తారు.