చంపేశా, ఏం చేద్దాం : హైదరాబాద్ సీరియల్ కిల్లర్...

First Published | Jun 23, 2023, 11:05 AM IST

హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ కేసులో విస్తుపోయే విషయాలు వెల్లడించారు పోలీసులు. ‘చంపేశాను.. అయిపోయింది..ఏ చేద్దాం’ అంటూ సమాధానం ఇచ్చాడని తెలిపారు. 

హైదరాబాద్ : హైదరాబాదులో సీరియల్ కిల్లర్ తీవ్రభయాందోళనలు సృష్టించాడు. మద్యం, గంజాయికి అలవాటు పడి…డబ్బులు అవసరం పడితే చాలు హత్యలకు పాల్పడుతున్నాడు. ఇతను పాత నిందితుడు కూడా. గంజాయి, మద్యం కొనడానికి డబ్బులు అవసరమైతే..  రోడ్ల వెంట అలసిపోయి నిద్రించే వారి తలలపై బండరాయితో మోది హతమార్చి వారి దగ్గర ఉన్న డబ్బులతో పరారవుతాడు. 

14 రోజుల వ్యవధిలో మూడు హత్యలు చేశాడు ఈ సైకో కిల్లర్. పగలంతా భిక్షాటన చేసుకునో… పని చేసుకునో.. అలసిపోయి రోడ్ల వెంట నిద్రించే వారిని టార్గెట్ గా చేసుకుంటాడు. తాను కూడా వారి లాంటి వాడినే అని నమ్మించేందుకు వారితో పాటే అక్కడ నిద్రించి వారు గాఢ నిద్రలోకి జారుకున్న తర్వాత.. హత్య చేసి డబ్బులతో పారిపోతాడు. ఇతడిని మైలార్ దేవులపల్లి పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సైకో కిల్లర్ మీద మొత్తం ఎనిమిది హత్యలు, ఒక అత్యాచారం, ఐదు దోపిడీ కేసులు ఉన్నాయని దర్యాప్తులో గుర్తించామని డిసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రవీణ్ అనే ఈ సైకో కిల్లర్ ను అరెస్టు చేసిన తర్వాత ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్,  మైలార్ దేవ్ పల్లి ఇన్స్పెక్టర్ మధు, డీఐ రాజేందర్ గౌడ్ లతో కలిసి గురువారం వెల్లడించారు.


బ్యాగరి ప్రవీణ్ (34)  చిన్నతనంలోనే దొంగతనాలకు అలవాటు పడ్డ ఇతను రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీ నివాసి. రాజేంద్రనగర్ కి చెందిన షేక్ ఫయాజ్, దర్గా నరేష్ లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు.  అలా, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో 2011లో దోపిడీకి పథకం వేశాడు. తమ పథకంలో భాగంగా ఇంటిని దోచుకోవడానికి అర్థరాత్రి ఈ ముగ్గురు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో ఇంటి యజమాని మూత్ర విసర్జన కోసం ఇంటి బయటకి వచ్చాడు. అతడిని రాయితో కొట్టి కిరాతకంగా హతమార్చారు.  

ఆ తర్వాత ఇంట్లోకి వెళ్లి అతని భార్య మీద అత్యాచారం చేశారు.  అనంతరం ఆమెను కూడా గొంతు నలిమి చంపేశారు. ఈ హడావుడికి నిద్రపోతున్న వారి పదేళ్ల  కొడుకు నిద్రలేచాడు. అతడిని కూడా చంపేశారు. ఇంట్లోని డబ్బులు, నగలు దోచుకున్నారు. అయితే,  అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో.. మూడు హత్యలు చేసిన తర్వాత ప్రవీణ్ స్నానం చేసి.. స్థానికంగా ఉన్న గుడిలో పూజలు చేసినట్లుగా  పోలీసులు గుర్తించారు.

రాజేంద్రనగర్ లోని పిల్లర్ నెంబర్ 127 దగ్గర రోడ్డు పక్కన నిద్రిస్తున్న ఓ బిక్షగాడిని, ఫుట్పాత్ పై ఉండే బద్వేల్ వాసి పి ప్రకాష్ ని… అదే సంవత్సరం.. అంటే మూడు హత్యలు జరిగిన నెల వ్యవధిలోనే బండరాయితో తలపై కొట్టి చంపాడు ప్రవీణ్. ఆ తర్వాత వారి దగ్గర ఉన్న నగదు దోచుకుని పరారయ్యాడు.  తర్వాత మరికొన్ని దొంగతనాలు దోపిడీలు కూడా చేశాడు. ఈ కేసుల్లో గాలింపు ముమ్మరం చేసిన పోలీసులు ప్రవీణ్ని పట్టుకోగా 2014 జూన్ లో అన్ని కేసులకి కలిపి నిందితుడికి యావజీవ కారాగార శిక్ష పడింది.

నిరుడు నవంబర్లో ప్రవీణ్ బెయిల్ మీద బయటికి వచ్చాడు. మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గృహకల్ప దగ్గర ఉంటున్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఏమో కానీ బయటికి వచ్చిన తర్వాత మళ్లీ డబ్బులు అవసరం పడ్డాయి. ఇంకేముంది తన పాత బాటనే మళ్లీ కొనసాగించాడు.  మద్యం, గంజాయి కోసం హత్యలు మొదలు పెట్టాడు.

ఈ క్రమంలోనే ఈనెల ఏడవ తేదీన  మైలార్ దేవ్ పల్లి పరిధిలోని నేతాజీ నగర్ లోని రైల్వే ట్రాక్ పక్కన పడుకున్న ఓ యాచకుడిని బండరాయితో తలపై కొట్టి చంపేశాడు. ఆ తరువాత ఈనెల 21వ తేదీ  అర్ధరాత్రి పూట దుప్పట్లు అమ్ముకునే వ్యక్తి  మైలార్ దేవ్ పల్లి స్వప్న థియేటర్ దగ్గర నిద్రిస్తుండగా అతని బండరాయితో కొట్టి చంపి, డబ్బులు తీసుకెళ్లాడు. అక్కడి నుంచి దుర్గా నగర్ క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ టెంపరరీ షెడ్డు వేసుకుని ఉన్న వ్యక్తిని బండరాయితో కొట్టి చంపాడు. అతని దగ్గర ఉన్న డబ్బులను కూడా లాక్కున్నాడు.

అయితే వీటి మీద దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడు 500 రూపాయలు అవసరమైనప్పుడల్లా హత్య చేస్తున్నట్లుగా గుర్తించారు. ఈనెల 21న ఒకే రోజు రెండు హత్యలు జరగడంతో అలర్ట్ అయిన తాము నిందితుడి కోసం గాలించామని.. ఈ క్రమంలోనే నిందితుడు పాత నేరస్థుడని గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. మద్యం,  గంజాయి తాగిన తర్వాత ప్రవీణ్  రోడ్లపై తిరుగుతూ ఫుట్ పాత్ లు, దారి పక్కన పడుకున్న వారిని లక్ష్యంగా చేసుకుంటూ.. వారి పక్కనే కాసేపు పడుకున్నట్లుగా నటిస్తూ ఆ తర్వాత చంపేస్తున్నాడు. వాళ్ల దగ్గర ఉన్న డబ్బులతో పరారవుతున్నాడని గుర్తించాం అన్నారు. 

rape

ఈ రెండు హత్యలను చేదించే క్రమంలో హత్య జరిగిన ప్రాంతంలో దాదాపు 100 సిసి కెమెరాల ఫుటేజ్ లను జల్లెడ పట్టినట్టుగా పోలీసులు వెల్లడించారు. అరెస్టు చేసిన తర్వాత నిందితుడిని ఎందుకు చంపావ్ అంటూ అడిగితే అతడి ప్రవర్తన తమను విస్తు పోయేలా చేసిందని పోలీసులు అంటున్నారు. ‘చంపేశాను..  అయిపోయింది.. ఏం చేద్దాం ఇప్పుడు’ అంటూ బదులిచ్చాడని వారు తెలిపారు. నిద్రపోయిన వారిని ఎందుకు చంపుతున్నావు అని అడిగితే.. ‘వాళ్లు నిద్రలేస్తే నన్ను చంపేస్తారేమో అని.. భయంతో ముందే వారిని చంపేస్తున్నానంటూ బదులిచ్చాడు’ అని చెప్పారు. 

Latest Videos

click me!