RTC: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నడిచే ఆర్టీసీ బస్సులను గమనిస్తే వాటి నంబర్ ప్లేట్లలో తప్పకుండా ఒక ప్రత్యేక అక్షరం కనిపిస్తుంది. అదే “Z”. అన్ని ఆర్టీసీ వాహనాలపై ఇలాగే ఉంటుంది. ఇంతకీ బస్సులపై Z ఉండడానికి కారణం ఏంటో తెలుసా.?
ప్రతి వాహనానికి రవాణాశాఖ ప్రత్యేక నంబర్ కేటాయిస్తుంది. రాష్ట్ర కోడ్ తర్వాత అక్షరాలు, సంఖ్యల కలయికతో ఈ నంబర్లు రూపొందుతాయి. కొన్నిసార్లు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వాహనాలకు ప్రత్యేక గుర్తులు కూడా ఉంటాయి. అలాగే ప్రజా రవాణా సంస్థలకు చెందిన బస్సులను సులభంగా గుర్తించేందుకు కొన్ని ప్రత్యేక అక్షరాలను ఉపయోగిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులకు “Z” అక్షరం అలాంటి ప్రత్యేక గుర్తుగా ఉపయోగిస్తున్నారు.
25
నిజాం కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం
ఆర్టీసీ బస్సులపై “Z” అక్షరం ఉపయోగించడం నిజాం కాలంలో ప్రారంభమైంది. హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన నిజాం ప్రభుత్వ కాలంలో రోడ్డు, రైలు రవాణా అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఒక రవాణా సంస్థ ఏర్పాటు చేశారు. 1930లలోనే నగర బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆ కాలంలో నడిపిన బస్సులను నిజాం పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి జహ్రా బేగం పేరుతో నమోదు చేయించినట్లు చెబుతారు. ఆమె పేరులోని మొదటి అక్షరాన్ని గుర్తుగా ఉపయోగించడం అప్పట్లో ప్రారంభమైంది. అదే తరువాత “Z” అక్షరంగా బస్సుల నంబర్ ప్లేట్లలో కొనసాగింది.
35
రాష్ట్ర విభజన తర్వాత కూడా మారని గుర్తు
హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనం అయిన తర్వాత కూడా ఈ సంప్రదాయం నిలిచిపోయలేదు. తరువాత ఏర్పడిన రాష్ట్ర రవాణా సంస్థలు కూడా అదే గుర్తును కొనసాగించాయి. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ఆర్టీసీ బస్సులపై “Z” అక్షరం కొనసాగింది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కూడా ఆర్టీసీ బస్సుల నంబర్ ప్లేట్లలో ఇదే గుర్తు కొనసాగుతోంది. ప్రభుత్వానికి చెందిన బస్సులపైనే ఈ అక్షరం ఉంటుంది. ప్రైవేట్ బస్సులు లేదా అద్దె వాహనాలపై ఇలా ఉండదు.
“Z” అక్షరం కేవలం ఒక అక్షరం మాత్రమే కాదు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజా రవాణా వ్యవస్థకు ఇది ఒక గుర్తుగా నిలిచింది. దశాబ్దాలుగా లక్షలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన ఆర్టీసీ సేవలకు ఇది ఒక గుర్తింపు చిహ్నంలా మారింది. పాతకాలం నుంచి కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఇప్పటికీ అలాగే కొనసాగుతుండటం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
55
ఇప్పటికీ కొనసాగుతున్న ప్రత్యేక గుర్తింపు
కాలం మారింది రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి అయినా ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో నడిచే ప్రతి ఆర్టీసీ బస్సు నంబర్ ప్లేట్‌లో “Z” అక్షరం తప్పకుండా కనిపిస్తుంది. బస్సును ఒకసారి చూసినా అది ఆర్టీసీ బస్సేనని ఈ అక్షరం ద్వారా సులభంగా గుర్తించవచ్చు. చూడడానికి సాధారణంగా కనిపించినా దీని వెనకాల ఇంత చరిత్ర ఉందన్నమాట.