Ramoji Excellence Awards : రామోజీ ఎక్స్‌లెన్స్ జాతీయ అవార్డుల వేడుకలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి లు ఒకే వేదికపై కనిపించారు. పలువురు ప్రముఖులు రామోజీ సేవలను గుర్తుచేసుకున్నారు.
హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘రామోజీ ఎక్స్‌లెన్స్’ జాతీయ అవార్డుల కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రామోజీ గ్రూప్ వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి పురస్కరించుకొని నిర్వహించిన ఈ వేడుకలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి ఒకే వేదికపై కనిపించారు. ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకోవడం అక్కడి అతిథులను ఆకర్షించింది. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాజకీయ, న్యాయ, సాంస్కృతిక, సామాజిక రంగాలన్నిటి నుండి ప్రముఖులు హాజరయ్యారు.
25
ప్రజల పక్షాన నిలిచిన రామోజీ: చంద్రబాబు నివాళి
ప్రదానోత్సవ వేడుకలో మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రామోజీరావును “ప్రజల కోసం పోరాడిన అక్షరయోధుడు”గా అభివర్ణించారు. తన సిద్ధాంతాల కోసం ఎలాంటి రాజీ పడని వ్యక్తిగా ఆయనను గుర్తుచేశారు. జర్నలిజం నుండి గ్రామీణాభివృద్ధి, మానవసేవ, మహిళా సాధికారత వంటి విభాగాల్లో అవార్డులు ఇవ్వడం సమాజానికి శక్తినిచ్చే పనిగా అభివర్ణించారు.
అలాగే, “ఈనాడు అనే పత్రిక ద్వారా ప్రజలను సామాజిక బాధ్యతల్లో భాగస్వాములను చేసిన నాయకత్వం రామోజీదే. విపత్తు వచ్చిన ప్రతిసారి స్వంత వనరులతో సేవలందించారు. తెలుగు భాష సంరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటా” అని చంద్రబాబు వెల్లడించారు.
35
రామోజీ ఫిల్మ్‌సిటీ తెలంగాణకు నాలుగో వండర్ : రేవంత్ రెడ్డి ప్రశంసలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన ప్రసంగంలో రామోజీ ఫిల్మ్‌సిటిని రాష్ట్రానికి నాలుగో వండర్‌గా అభివర్ణించారు. ఛార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ తరువాత రామోజీ ఫిల్మ్‌సిటీ తెలంగాణ ఖ్యాతిని మరింత పెంచిందని అన్నారు.
“రోజు ఎన్ని పత్రికలు వచ్చినా, నిజం తెలుసుకోవాలంటే ఈనాడు చదవాల్సిందే. రాత్రి 9 గంటల ఈటీవీ వార్తలు తప్పకుండా చూస్తా” అని పేర్కొన్నారు. రోజుకు 18 గంటలు శ్రమించి, అనేక రంగాల్లో నంబర్‌వన్‌గా రామోజీ నిలిచారని అన్నారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, రామోజీ పేరిట ఏడు అవార్డులు ఇవ్వడం సమాజానికి ప్రేరణ అని అన్నారు. అవార్డు గ్రహీతలు దీన్ని బాధ్యతగా భావించి ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలని సూచించారు. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, “స్వప్రయోజనాల కోసం రామోజీ ఎప్పుడూ తన పత్రికను వాడుకోలేదు. పత్రికారంగంలో దీపస్తంభంగా నిలిచారని” అన్నారు. రామోజీ ఫౌండేషన్ రూపొందించిన నిఘంటువులను ఆయన, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, రామ్మోహన్‌నాయుడు, బండి సంజయ్, మాజీ ఉప రాష్ట్రపతి వేంకయ్యనాయుడు సహా అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.
55
రామోజీ వారసత్వం.. సీఎండీ కిరణ్
రామోజీ గ్రూప్ సీఎండీ కిరణ్ మాట్లాడుతూ, క్రమశిక్షణ, అంకితభావం ఉంటే సాధారణ మనిషి కూడా అసాధారణ విజయాలు సాధించగలడన్న నమ్మకం రామోజీది అన్నారు. ఈ ఏడాది 900 మంది అభ్యర్థుల పరిశీలన అనంతరం ఏడుగురిని ఎంపిక చేశామని, వారిలో నలుగురు మహిళలు ఉండటం ప్రత్యేకత అని చెప్పారు.