
Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో గత వారమంతా అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఇవాళే (సెప్టెంబర్ 29, సోమవారం) చాలాప్రాంతాల్లో వర్షాలు తగ్గాయి.. చాలారోజుల తర్వాత మేఘాల చాటునుండి సూర్యుడు బయటకు వచ్చాడు. దీంతో వాతావరణ కాస్త వేడెక్కింది.. ఇదిచూసి ఇక వర్షాలు తగ్గుముఖం పట్టినట్లేనని భావిస్తున్నారా..? అయితే మీరు పొరపడినట్లే. వర్షాలు ఇలా తగ్గినట్లే తగ్గి మళ్లీ జోరందుకోనున్నాయి... ఈ మేరకు మరో రెండ్రోజుల్లో తిరిగి వర్షాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
బంగాళాఖాతంలో ఇప్పటికే ఏర్పడిన అల్పపీడనాలు, వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురిశాయి... ఇక ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులకు లెక్కేలేదు. ఇలా గత రెండు నెలలుగా (ఆగస్ట్, సెప్టెంబర్) వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఇవి చాలవన్నట్లు మరో రెండ్రోజుల్లో (అక్టోబర్ 1, బుధవారం) బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరోసారి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షబీభత్సం తప్పేలా లేదు... కాబట్టి ప్రజలు అలర్ట్ కావాల్సిందే.
గతవారం కురిసిన భారీ వర్షాలతోనే ఇరు రాష్ట్రాల్లోనూ వరద పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ లో అయితే జంట జలాశయాలు నిండుకుండల్లా మారడంతో గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేశారు... దీంతో మూసీనదిలో నీటిప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఇలా మూసీ ఉగ్రరూపం దాల్చడంతో హైదరాబాద్ నగరం అతలాకుతలం అయ్యింది... ఈ నదీ పరివాహక ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. ఇలా ఒక్క మూసీనే కాదు గోదావరి, కృష్ణా నదులు కూడా ఉప్పొంగాయి... అలాగే వాగులు వంకలు, కాలువలు ప్రమాదకరంగా మారి ప్రాణనష్టం కూడా సృష్టించాయి. ఇక ఆస్తులు, పంట నష్టానికి లెక్కేలేదు.
ఈ వర్షాలు, వరదల నుండి ఇవాళే కాస్త ఉపశమనం లభించింది.. వానలు లేకపోవడంతో వరద పరిస్థితి అదుపులోకి వస్తోంది. ఇలాంటి సమయంలో మళ్లీ అల్పపీడనం, భారీ వర్షాలు అంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు ప్రజలను కంగారు పెట్టిస్తున్నారు. ఆగస్ట్, సెప్టెంబర్ మాదిరిగానే అక్టోబర్ కూడా భారీ నుండి అతిభారీ వర్షాలతో ముగుస్తుందా అన్న భయం పట్టుకుంది. ఈ నెలంతా ఏమోగానీ ఆరంభం మాత్రం భారీ నుండి అతిభారీ వర్షాలు తప్పేలా లేవు.
నేడు (సెప్టెంబర్ 29, సోమవారం) తెలంగాణలోని వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్,నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. అలాగే అన్ని జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. ఈ వర్షాలు, ఈదురుగాలులతో ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది కాబట్టి చెట్లకింద, తాత్కాలిక నిర్మాణాల్లో ఉండకూడదని ప్రజలకు సూచించింది.
ఆంధ్ర ప్రదేశ్ లో కూడా ఇవాళ (సోమవారం) అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, ఈదురుగాలులు ఉండే అవకాశాలున్నాయని తెలిపింది. ముఖ్యంగా నంద్యాల జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలుంటాయని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతోందని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.43 లక్షల క్యూసెక్కులుగా ఉందని.. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని తెలిపారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో 10.32 లక్షల క్యూసెక్కులు ఉంది.. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఎలాంటి విపత్కర పరిస్ధితులనైనా ఎదుర్కొనేందుకు 2 NDRF, 3 SDRF బృందాలు కృష్ణా, బాపట్ల, కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కర్నూలు జిల్లాల్లో సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పూర్తి స్థాయిలో వరద తగ్గేవరకు కృష్ణా, గోదావరి నదీపరీవాహక లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని విపత్తు నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ సూచించారు.