ఆగస్టులో వర్షాలు ఎంతలా కురిశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలంగాణలో వరణుడు బీభత్సం సృష్టించాడు. కామారెడ్డి, మెదక్ లో అల్లకల్లోలం జరిగింది. కాగా తాజాగా మళ్లీ ఆ స్థాయి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఆదిలాబాద్, నల్గొండ, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా శుక్రవారం వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్ పరిసరాల్లో వర్షాలు పడతాయని అంచనా. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
DID YOU KNOW ?
బంగాళాఖాతంలో అల్పపీడనం
సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
25
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం
సెప్టెంబర్ 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదలవచ్చని, ఆ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు పెరుగుతాయని తెలిపింది. ఈ నెలంతా భారీ వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉన్నందున కొన్ని ప్రాంతాల్లో వరదల ప్రమాదం ఉందని హెచ్చరించారు.
35
తెలంగాణ జిల్లాల్లో వర్షాల అంచనా
ఆదిలాబాద్, ములుగు, మంచిర్యాల, కొమరం భీమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, సిద్దిపేట, సిరిసిల్ల, జనగాం, భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడవచ్చని అంచనా. సెప్టెంబర్ 9 నుంచి 13 మధ్య వర్షాలు మరింత తీవ్రమవుతాయని వాతావరణ శాఖ నిపుణులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ వారం చివరి నాటికి వర్షాలు క్రమంగా పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, తిరుపతి జిల్లాల్లో కూడా వర్షాలు పడతాయని అంచనా. గురువారం అల్లూరి సీతారామరాజు, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
55
ప్రజలకు సూచనలు
వర్షాల ప్రభావం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే స్థానిక అధికారుల సూచనలు పాటించాలని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో అచ్యుతాపురం, యలమంచిలి ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. రాబోయే మూడు రోజులలో వర్షాలు మరింత పెరుగుతాయని, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ స్పష్టం చేశారు.