నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2030-31 వరకు పొడిగించింది. ఈ మేరకు రూ.3.15 లక్షల కోట్ల నిధుల కేటాయింపుకు మోదీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
PM Kisan Scheme : దేశంలోని కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల పాలిట వరంగా మారిన 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM-KISAN) పథకాన్ని మరో 5 ఏళ్లు, అంటే 2030-31 వరకు పొడిగిస్తూ కీలక ప్రకటన చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్నదాతలందరికీ భారీ ఆర్థిక సాయం కొనసాగనుంది.
నిన్న (జూలై 31, శుక్రవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశమై ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. ఈ మెగా స్కీమ్ కోసం కేంద్రం ఏకంగా రూ.3.15 లక్షల కోట్లు కేటాయించింది. ఈ వివరాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. దీంతో పాటు 'ప్రధాన మంత్రి సూర్య సరోవర్ యోజన' (PM-SSY) వంటి కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ భారీగా నిధులు కేటాయించింది.
25
24 విడత పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయి?
పీఎం కిసాన్ లబ్ధిదారులైన రైతులు ఇప్పుడు 24వ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో కేంద్రం ఈ పథకాన్ని 5 ఏళ్లు పొడిగించడం రైతులకు పెద్ద ఊరటనిచ్చింది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం 24వ విడత డబ్బులు అక్టోబర్ నెలలో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని అంచనా.
కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు 23 విడతల్లో రూ.4.47 లక్షల కోట్లను నేరుగా నగదు బదిలీ (DBT) ద్వారా రైతుల ఖాతాల్లోకి పంపారు. చివరిగా వచ్చిన 23వ విడతలో దేశవ్యాప్తంగా 9.49 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందారు. 24వ విడతలో మరింత ఎక్కువమంది రైతులు లబ్ధి పొందే అవకాశాలున్నాయి.
35
పిఎం కిసాన్ తో మహిళా సాధికారత
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారిలో మహిళా రైతుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ పథకంలో లబ్ధి పొందుతున్న ప్రతి నలుగురిలో ఒకరు మహిళా రైతు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సాధికారతకు (women empowerment) ఈ పథకం ఎంతగానో దోహదపడుతోంది.
కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని 2030-31 వరకు పొడిగించి రూ.3.15 లక్షల కోట్ల నిధిని కేటాయించడంతో, రాబోయే ఐదేళ్లపాటు రైతులకు సరైన సమయంలో పెట్టుబడి సాయం అందుతుంది. కేంద్రం తీసుకున్న ఈ దీర్ఘకాలిక నిర్ణయం, కష్టాల్లో ఉన్న రైతులకు పెద్ద భరోసా ఇస్తోంది.
పీఎం-కిసాన్ పథకం కింద, అర్హులైన ప్రతి రైతుకు ఏటా రూ.6,000 అందుతుంది. ఈ మొత్తాన్ని ప్రతీ 4 నెలలకు ఒకసారి రూ.2,000 చొప్పున 3 విడతల్లో నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ డబ్బులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా e-KYC పూర్తి చేయాలి. అలాగే, బ్యాంకు ఖాతాకు ఆధార్ నంబర్‌ను లింక్ చేయడం, భూమి వివరాలను సరిచూసుకోవడం కూడా తప్పనిసరి. అన్ని వివరాలు సక్రమంగా ఉంటేనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా పెట్టుబడి సాయం అందుతుంది.
55
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
పీఎం కిసాన్ పథకం ద్వారా రాబోయే ఐదేళ్లు రైతులకు ఆర్థికసాయం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులను కేటాయించింది. దీంతో పాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది మోదీ సర్కార్,
పీఎం సూర్య సరోవర్ యోజన కోసం రూ.5,070 కోట్లు కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
ఖేలో ఇండియా, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్కీమ్ కోసం రూ.36,441 కోట్లు కేటాయించాలని మోదీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
సముద్ర మంథన్ కార్యక్రమానికి ఏకంగా రూ.84,084 కోట్లు కేటాయించింది కేంద్ర మంత్రివర్గం.
క్వీన్ ట్యూబ్ టన్నెల్స్ నిర్మాణం కోసం రూ.9,779 కోట్లు కేటాయించింది. ఇది దేశ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే ప్రాజెక్ట్.
ఇలా వివిధ పథకాలు, డెవలప్మెంట్ కార్యక్రమాల కోసంమొత్తం రూ.4,50,988 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.