
PM Kisan Samman Nidhi : అన్నదాతలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ సంవత్సరంలో మొదటి విడత ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అమలుకు సిద్దమయ్యింది కేంద్ర ప్రభుత్వం. ఫిబ్రవరి 24, 2025 నుండి మరోవిడత రైతులకు పెట్టబడి సాయం డబ్బులను అందించనున్నట్లు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ పిఎం కిసాన్ నిధులను విడుదల చేయనున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
ఇటీవల బిహార్ మాజీ సీఎం, భారతరత్న కర్పూరి ఠాకూర్ 101 జయంతి వేడుకల్లో కేంద్ర వ్యవసాయ మంత్రి పాల్గొన్నారు. బిహార్ రాజధాని పాట్నాలో జరిగిన ఈ కార్యక్రమంలోనే పీఎం కిసాన్ సమ్మాన్ పథకం గురించి స్పందించారు. బిహార్ నుండే ప్రధాని మోదీ తర్వాతి విడత పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తారంటూ శివరాజ్ సింగ్ కీలక ప్రకటన చేసారు.
కేంద్ర మంత్రి ప్రకటన దేశవ్యాప్తంగా వున్న చిన్న, సన్నకారుల రైతుల్లో ఆనందాన్ని నింపింది. మరోసారి తమ ఖాతాల్లో రూ.2,000 పడనున్నాయని చిరునవ్వుతో చెబుతున్నారు అన్నదాతలు. తెలంగాణ రైతులయితే డబుల్ హ్యాపీగా వున్నారు...ఎందుకంటే ఇప్పటికే వారి ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడగా త్వరలోనే పీఎం కిసాన్ డబ్బులు కూడా పడనున్నాయి.
తెలంగాణ రైతులకు డబుల్ ధమాకా :
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా నిధులను విడుదల ప్రక్రియను ప్రారంభించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయ యోగ్యమైన భూములకు రైతు భరోసా అందిస్తోంది రేవంత్ సర్కార్. మొదటి విడతగా ఎకరాకు రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అంటే ఏడాదికి రెండు విడతల్లో ఎకరాకు రూ.12,000 ఇవ్వనున్నారు.
జనవరి 26 గణతంత్ర దినోత్సవం నుండే రైతులకు పెట్టుబడి సాయం అందించే కార్యక్రమాన్ని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం నుండి ప్రారంభించారు. ఆరోజు ఆదివారం కావడంతో బ్యాంకులకు సెలవు...కాబట్టి తర్వాతిరోజు సోమవారం (జనవరి 27) నుండి రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేయడం ప్రారంభించారు. గతంలో మాదిరిగానే మొదట చిన్న, సన్నకారు రైతులకు రైతు భరోసా నిధులు అందిస్తున్నారు.
ఇలా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుండి పెట్టుబడిసాయం అందుకున్న రైతులు వచ్చేనెల (ఫిబ్రవరి 24) నుండి కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సాయం అందుకోనున్నారు. అర్హులైన ప్రతి రైతు ఖాతాలో పీఎం కిసాన్ పథకం కింద మొదటివిడతగా రూ.2000 అకౌంట్లో పడనున్నాయి. ఇలా ఏడాదికి మూడు విడతల్లో మొత్తం రూ.6,000 అన్నదాలకు అందిస్తుంది నరేంద్ర మోదీ సర్కార్.
కేవలం నెలరోజుల వ్యవధిలోనే రైతు భరోసా, పిఎం కిసాన్ డబ్బులు పడుతుండటం తెలంగాణలో వ్యవసాయం చేసే రైతన్నకు చాలా సాయం కానున్నాయి. బయటినుండి అప్పులు తీసుకువచ్చి వ్యవసాయం చేయకుండా ఈ డబ్బులు వారికి ఉపయోగపడతాయి. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు ప్రభుత్వాలు ఇలా ఆర్థికసాయం చేయడాన్ని ప్రతిఒక్కరు స్వాగతిస్తున్నారు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గొప్పపని చేస్తున్నాయని కొనియాడుతున్నారు.
ఏమిటీ పిఎం కిసాన్ పథకం? ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు? :
చిన్న, సన్నకారు రైతులకు అండగా కేంద్ర ప్రభుత్వం ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని 2019 లో ప్రారంభించింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత నియోజకవర్గం గోరఖ్ పూర్ నుండి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలలోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఆర్థికసాయం చేయడమే ఈ పథకం ఉద్దేశ్యం.
రైతులు వ్యవసాయం కోసం బయటినుండి అప్పులుతెచ్చి చితికిపోకుండా ప్రభుత్వమే పెట్టుబడిసాయం అందిస్తుంది. అర్హులైన రైతులకు ఏడాదికి మూడు విడతల్లో డబ్బులు అందిస్తారు.. ప్రతి విడతలో రెండువేల చొప్పున సంవత్సరానికి రూ.6,000 అందిస్తారు. ఇలా ఈ పథకం ప్రారంభించిన నాటినుండి 18 విడతల డబ్బులు అందించారు. రాబోయే ఫిబ్రవరిలో 19వ విడత పీఎం కిసాన్ నిధులు విడుదలకానున్నాయి.
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పీఎం కిసాన్ ద్వారా తెలంగాణలో 31,08,272 మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో అయితే 41,88,423 మంది రైతులు ఈ పథకం ద్వారా పెట్టుబడి సాయం పొందుతున్నారు. వీరందరి బ్యాంక్ ఖాతాల్లో వచ్చే ఫిబ్రవరిలో మరోసారి రూ.2,000 జమకానున్నాయి.
అయితే ఈ పథకం కమర్షియల్ ల్యాండ్స్ కు వర్తించదు. అలాగే రాజ్యాంగబద్ద పదవుల్లో వున్నవారికి, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు,మేయర్లు వంటి ప్రజా ప్రతినిధులకు కూడా వర్తించదు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైరయి రూ.10 వేల కంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్నవారు కూడా అనర్హులు. ఆదాయపన్ను చెల్లించేవారు, ప్రొఫెసర్లు,డాక్టర్లు, లాయర్లు, సీఏ ఇలా ఉన్నత సాలరీలు కలిగినవారు కూడా పీఎం కిసాన్ పథకం ద్వారా పెట్టుబడి సాయం పొందలేరు.
ఇవి కూడా చదవండి
మీ అకౌంట్లో ఇంకా రైతు భరోసా డబ్బులు పడలేదా? కారణం ఇదేనేమో చెక్ చేసుకోండి?