హైదరాబాద్ లో మాంసం అమ్మారో అంతే సంగతి :
గాంధీజీ వర్ధంతి సందర్భంగా జనవరి 30న హైదరాబాద్ నగరంలో ఎలాంటి మాంసం విక్రయాలు చేపట్టరాదని జిహెచ్ఎంసి ప్రకటించింది. గ్రేటర్ పరిధిలోని అన్ని మాంసం దుకాణాలను రేపంతా మూసివేసి వుంచాలని... ఎక్కడా కోళ్ళు, మేకలు, గొర్రెలతో పాటు ఇతర జంతువులను కోయరాదని హెచ్చరించారు. ఈ మేరకు జిహెచ్ఎంసి కమీషనర్ ఆదేశాలు జారీ చేసారు.
తమ ఆదేశాలను అతిక్రమించి జంతువులను వధిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిహెచ్ఎంసి హెచ్చరించింది. మాంసం దుకాణాలను తెరిచివుంచి విక్రయాలు చేపడితే చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. జిహెచ్ఎంసి సిబ్బంది, పోలీసులు సమన్వయంతో గురువారం నగరంలో మాంసం విక్రయాలు జరక్కుండా చూసుకుంటారని నగర కమీషనర్ పేర్కొన్నారు.
శివారు ప్రాంతాల్లో రహస్యంగా జంతువులను వధించినా చర్యలుంటాయని హెచ్చరించారు. కేవలం నగరంలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా మాంసం విక్రయాలు జరక్కుండా పోలీసులు, అధికారులు నిఘా వుంచుతారు... ఎవరైనా విక్రయిస్తూ పట్టుబడితే చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఈ ఒక్కరోజు చికెన్, మటన్ షాపులవారు మాంసం అమ్మకాలు అస్సలు చేపట్టకూడదు.