హైదరాబాద్ : ప్రజాయుద్దనౌక గద్దర్ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన అంతిమయాత్ర సోమవారం ఉదయం 12 గంటలకు మొదలుకానుంది. ఎల్బీ స్టేడియం నుండి అంతిమయాత్ర మొదలవుతుంది. గద్దర్ పార్థీవదేహం కళాకారులతో భారీ ర్యాలీగా వెళ్లనుంది. గద్దర్ అంతిమయాత్రలో భారీగా కళాకారులు, ఉద్యమకారులు, పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొననున్నారు.
ఎల్బీస్టేడియంనుండి బషీర్బాగ్ చౌరస్తా, జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా గన్ పార్క్ వైపు అంతిమయాత్ర సాగనుంది.మొదట గన్పార్కులోని అమరవీరుల స్థూపం వద్దకు గద్దర్ పార్థీవదేహాన్ని తీసుకువెడతారు. కాసేపు అమరవీరుల స్థూపం వద్ద గద్దర్ పార్థీవ దేహాన్ని ఉంచి పాటలతో కళాకారులు నివాళులు అర్పించనున్నారు.
ఆ తరువాత అమరవీరుల స్థూపం నుండి భూదేవినగర్ లోని గద్దర్ నివాసానికి పార్థివదేహాన్ని తీసుకు వెళ్లనున్నారు. అక్కడ భూదేవినగర్ లోని మహాభారతి విద్యాలయం అవరణలో గద్దర్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా, జనసేన పార్టీ నేత, నటుడు పవన్ కల్యాణ్ గద్ధర్ పార్థివ దేహాన్ని సందర్శించారు. ఆయనను ప్రజా యోధుడు గద్దర్ అంటూ చెప్పుకొచ్చారు. కుటుంబాన్ని ఓదార్చారు. ఆయన మాట్లాడుతూ... ప్రజా గాయకుడు గద్దర్ మరణించారంటే నమ్మశక్యం కావడం లేదు. అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆయన్ని పరామర్శించేందుకు కొద్ది రోజుల క్రితమే వెళ్ళాను. తమ్ముడా.. అంటూ ఆప్యాయంగా పలకరించి, ప్రస్తుత తెలుగు రాష్ట్రాల్లో నెలకొని ఉన్న పరిస్థితుల గురించీ, జాతీయ అంతర్జాతీయ విషయాలు ఎన్నింటినో మాట్లాడారు.
Gaddar
‘మా భూమి’ చిత్రంలో ఆయన గానం చేసిన ‘బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి...’ అనే చైతన్య గీతం అజరామరం. నా చిన్నతనంలో విన్న ఆ గీతమే నాకు గద్దర్ అనే పేరును పరిచయం చేసింది. తాడిత పీడిత అణగారిన వర్గాలను చైతన్యం చేయడమే లక్ష్యంగా పోరుసల్పిన శ్రీ గద్దర్ గారు తుది శ్వాస వరకూ అదే బాటలో పయనించారు. గద్దర్ అనగానే గజ్జె కట్టి గళమెత్తి... కెరటంలా దుమికే ఆ రూపమే గుర్తుకు వస్తుంది. గానం చేసేటప్పుడు ఆయన ఆంగికం, ఆహార్యాన్ని నేటి తరం పోరాట గాయకులు అనుసరిస్తున్నారు.
Gaddar telengana
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రాచుర్యంలో ఉన్న ఒగ్గు కథ, ఎల్లమ్మ కథ, బుర్ర కథల రూపంలో సామాజిక సమస్యలపై చైతన్యపరచిన విధానం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. ‘నీ పాదమ్మీద పుట్టు మచ్చనై చెల్లెమ్మ... తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ...’ అనే పద ప్రయోగం ఊహకు అందనిది.. అనిర్వచనీయమైనది.
gaddar
విప్లవ గీతాలను ఎంత సునాయాసంగా రాయగలరో... భావుకత నిండిన గీతాలను అంతే అలవోకగా రాయగలరనిపించింది. పేద కుటుంబం నుంచి వచ్చిన గద్దర్ పీడిత వర్గాల కోసం ఆయనపడిన తపన, చేసిన పోరాటమే ఆయన్ని చిరస్మరణీయుణ్ణి చేశాయి.
Gaddar
తెలంగాణ ఉద్యమ కాలంలో తన కలం, తన గళంతో ఆయన నిర్వర్తించిన పాత్ర విస్మరించలేనిది. గద్దర్ మరణం ఆయన కుటుంబానికే కాదు... తెలుగు రాష్ట్రాలకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. గద్దర్ కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆయన్ని చివరిసారిగా కలిసినప్పుడు ‘నీ అవసరం నేటి యువతకు ఉంది’ అంటూ నాకు చెప్పిన మాటలు ఎన్నటికీ మరువలేనివి... అన్నారు.