టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు : పాస్ వర్డ్ మిస్టరీ.. ! ఆ ఇద్దరికీ ఎలా తెలిసింది?.. డైరీలో ఏముంది??

First Published | Apr 15, 2023, 9:16 AM IST

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో నిందితులిద్దరికీ ఆ పేపర్లున్న సిస్టమ్ పాస్ వర్డ్ ఎలా తెలిసిందనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. వారు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని తేలింది. 

హైదరాబాద్ : తెలంగాణలో టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకర లక్ష్మి పాస్వర్డ్, యూజర్ ఐడి ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్ కుమార్ రాజశేఖర్ రెడ్డికి ఎలా తెలిసాయి అనేది మిస్టరీగా మారింది. టిఎస్పిఎస్సి ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం గత నెల 11వ తేదీన వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ఇప్పటివరకు ఈ కేసులో 18 మంది నిందితులను గుర్తించారు. వీరిలో 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

రాజశేఖర్ రెడ్డి బావ ప్రశాంత్ గ్రూప్ వన్ ప్రిలిమినరీలో 100కు పైగా మార్కులు సాధించాడు. ప్రస్తుతం ప్రశాంత్ న్యూజిలాండ్ లో ఉన్నాడు.  ఇది గుర్తించిన సిట్ పోలీసులు అతనికి వాట్సప్ ద్వారా నోటీసులు జారీ చేశారు. దీనికి ప్రశాంత్ స్పందిస్తూ గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నాపత్రం తనకు అందలేదని వాట్సాప్ ద్వారానే సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. పోలీసుల దర్యాప్తులోనూ, సిట్ కస్టడీలోను నిందితులిద్దరూ యూజర్ ఐడి, పాస్వర్డ్ లను ప్రశ్నాపత్రాల కోసం కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ డైరీలో రాసినవే  తీసుకున్నట్లుగా ఒకేలాగా చెప్పుకొచ్చారు.


వీరు చెప్పిన సమాచారం ప్రకారం కాన్ఫిడెన్షియల్ విభాగం సూపరింటెండెంట్ శంకర లక్ష్మి డైరీని సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కానీ, అందులో ఎక్కడా కూడా యూజర్ ఐడి, పాస్వర్డ్  రాసినట్లుగా ఆధారాలు లభించలేదు. శంకర లక్ష్మి కూడా ఈడీ అధికారుల విచారణలో, సిట్ పోలీసులకు ఇదే విషయాన్ని చెప్పారు.  మరోవైపు ప్రశ్నపత్రాల కొనుగోలు వ్యవహారంలో వీరితో పాటు మరికొందరు కూడా ఉన్నట్లు సిట్ గుర్తించింది. ఆ అనుమానితుల జాబితాను రూపొందించినట్లు తెలుస్తోంది.

ఈ అనుమానితుల్లో ఇద్దరూ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, గ్రూప్ వన్ పరీక్ష రాసినట్లుగా నిర్ధారణ అయింది. అయితే ఈ ఇద్దరికీ ఈ లీకేజీ తో సంబంధాలు ఉన్నాయా, లేదా అనేదానిమీద స్పష్టత రావాలి. పరీక్షకు హాజరైన జగిత్యాల జిల్లా మల్యాల మండలం అభ్యర్థుల నుంచి కూడా వాంగ్మూలాన్ని సేకరించారు. గ్రూప్ వన్ లో వందకు పైగా మార్కులు సాధించిన వారికి సిట్ అధికారులు మరో పరీక్ష పెట్టారు. అభ్యర్థుల ప్రతిభను అంచనా వేయడానికి ప్రయత్నించారు. గ్రూప్ వన్ పరీక్ష స్థాయి ప్రశ్నలను వారికి వేసి సమాధానాలు రాబట్టారు. అభ్యర్థులు చెప్పిన సమాధానాలను బట్టి వారిలో ఎవరికి కూడా లీకేజీతో సంబంధాలు లేవని తెలుసుకున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన సాయి లౌకిక్, సుష్మిత దంపతులను కొద్ది రోజుల క్రితం డిఏవో ప్రశ్నపత్రం కొనుగోలు కేసులో అరెస్టు చేశారు. వీరిద్దరిని శుక్రవారం సిట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మొదట వీరిద్దరు చంచల్గూడా జైలులో ఉన్నారు. వారి నుంచి మరింత సమాచారం రాబట్టాలని న్యాయస్థానంలో వారి కస్టడీని కోరుతూ పిటిషన్ వేశారు. గురువారం ఈ పిటిషన్ మీద విచారణ జరిపిన న్యాయస్థానం వారిని మూడు రోజుల కస్టడీకి అనుమతినిచ్చింది. డీఏవో పరీక్షకు హాజరైన అభ్యర్థుల లిస్ట్ ను కూడా తయారు చేస్తున్నారు. లీకేజీ నిందితులతో వీరిలో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి అనే దిశగా ఆరా తీస్తున్నారు.

Latest Videos

click me!