
Telangana Bandh : తెలంగాణలో మార్వాడీ (గుజరాత్, రాజస్థాన్) వ్యాపారులకు వ్యతిరేకంగా ఉద్యమం సాగుతోంది. రాజధాని నగరం హైదరాబాద్ లో చిన్నగా మొదలైన మార్వాడీ వ్యతిరేక ఉద్యమం చిలికిచిలికి గాలివానలా మారుతోంది. 'మార్వాడీ గో బ్యాక్', 'తెలంగాణ బచావో' నినాదాలతో సోషల్ మీడియాలో ఊపందుకున్న ప్రచారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు దారితీసింది. చివరకు మార్వాడీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చే స్థాయికి ఈ వివాదం చేరింది.
మార్వాడీ వ్యాపారులు స్థానిక ప్రజలను దోచుకుంటున్నారని... నాసిరకం వస్తువులను కట్టబెడుతూ లాభాలు అర్జిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. వారి ఆగడాలు మితిమీరిపోయి స్థానికులు వ్యాపారాలు చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని... మార్వాడీలను కట్టడి చేయాల్సిందేననే డిమాండ్ పెరిగిపోయింది. ఈ క్రమంలో 'మార్వాడీ గోబ్యాక్' నినాదాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు ఓయూ జేఏసి సిద్దమయ్యింది. ఇందుకోసమే రేపు అంటే ఆగస్ట్ 22 శుక్రవారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది ఉస్మానియా జాయింట్ యాక్షన్ కమిటీ.
హైదరాబాద్ లో ఓ దళితుడిపై మార్వాడీ వ్యాపారుల దాడి స్థానిక సెంటిమెంట్ ను రగిలించింది. ఎక్కడో ఉత్తరాది రాష్ట్రాలనుండి వలసవచ్చిన మార్వాడీలు తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారని స్థానిక వ్యాపారులు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు… ఈ సమయంలో సికింద్రాబాద్ మోండా మార్కెట్ ఘటన అగ్గిరాజేసింది. ఇదే అదునుగా తెలంగాణ వ్యాపారులు, ప్రజాసంఘాలు మార్వాడీ గోబ్యాక్ ఉద్యమాన్ని ప్రారంభించాయి.
మార్వాడీలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా భాగమయ్యారు. మోండా మార్కెట్లో దళితుడిపై జరిగిన దాడికి నిరసనగా హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద నిరసనలు చేపట్టారు. ఓయూ జేఏసి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలోనే తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. మార్వాడీ వ్యాపారులు తెలంగాణ ప్రజలపై చేస్తున్న దౌర్జన్యం, ఇక్కడి సంపద దోపిడీకి వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ చేపడుతున్నట్లు ఓయూ జేఏసి ఛైర్మన్ కొత్తపల్లి తిరుపతి ప్రకటించారు.
మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి తెలంగాణ ప్రజల మద్దతు లభిస్తోంది. ఇప్పటికే తెలంగాణ మేధావులు, ప్రజా, కార్మిక సంఘాలు మార్వాడీ గోబ్యాక్ నినాదాన్ని బలంగా వినిపిస్తున్నాయి... ఇక వ్యాపారులయితే నేరుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ ఉద్యమానికి విద్యార్థుల బలం కూడా తోడయ్యింది. ఓయూ జేఏసి ఇచ్చిన తెలంగాణ బంద్ ను స్వచ్చందంగా పాటించేందుకు ప్రజలు కూడా ముందుకు వస్తున్నారు.
యాదాద్రి జిల్లా వ్యాపారులు శుక్రవారం తెలంగాణ బంద్ సందర్భంగా షాపులను మూసివేయనున్నట్లు ప్రకటించారు. ఇక నారాయణపేట, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో కూడా బంద్ పాటించనున్నట్లు వ్యాపారసంఘాల ప్రకటించాయి. ఇలా మెళ్లిగా ఒక్కోజిల్లాకు తెలంగాణ బంద్ ప్రభావం పాకుతోంది... దీంతో శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా బంద్ ప్రభావం ఎక్కువగానే ఉండేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి.
మార్వాడీ వ్యాపారులకు వ్యతిరేకంగా చేపట్టిన తెలంగాణ బంద్ ప్రభావం విద్యాసంస్థలకు కూడా కనిపించే అవకాశాలున్నాయి. విద్యార్థి సంఘాలతో కూడిన ఓయూ జేఏసి ఈ బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణలో విద్యాసంస్థలపై బంద్ ప్రభావం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ విద్యార్థిసంఘాలు, వ్యాపారులు ఏకమై బంద్ ను సీరియస్ గా తీసుకుంటే స్కూళ్లు, కాలేజీలు కూడా శుక్రవారం మూతపడే అవకాశాలున్నాయి.
వామపక్ష పార్టీలు, ప్రజాసంఘాల ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో విద్యాసంస్థలను మూయించే అవకాశాలున్నాయి. హైదరాబాద్ లో ఓయూ పరిసరప్రాంతాల్లో బంద్ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు... కాబట్టి క్యాంపస్ లోని విద్యాసంస్థలు మూతపడవచ్చు. మొత్తంగా రేపటి బంద్ తీవ్రతను బట్టి విద్యాసంస్థలు నడుస్తాయా, లేదా అన్నది తేలనుంది.
తెలంగాణలో మరీముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారి డామినేషన్ ఎక్కువగానే ఉంటుంది. కోఠి, బేగంబజార్, సికింద్రాబాద్ వంటి కొన్నిప్రాంతాల్లో అయితే పెద్దపెద్ద షాపుల నుండి ఫుట్ పాత్ వ్యాపారాల వరకు అన్నీ వీరిచేతుల్లోనే… అక్కడి వ్యాపారులంతా వీరే. ఈ ప్రాంతాల్లో గుజరాత్, రాజస్థాన్ పేరుతో కాలనీలు వెలిసాయంటే వీరి డామినేషన్ ఏస్థాయిలో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
మార్వాడీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్థానికులు వ్యాపారాలు చేసుకునే అవకాశమే ఉండదు.. అన్ని వ్యాపారాలు వీరి గుత్తాధిపత్యంలో ఉంటాయి. ఇలా గుజరాత్, రాజస్థాన్ కు చెందిన వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి స్థానిక వ్యాపారులను తొక్కేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదే ఇప్పుడు మార్వాడీ గోబ్యాక్ ఉద్యమానికి దారితీసింది.