Ice Cream : నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామ పంచాయతీలు ఐస్‌క్రీం అమ్మకాలను నిషేధిస్తూ ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. నిబంధనలు ఉల్లంఘించి గ్రామంలోకి ఐస్‌క్రీం బండ్లు వస్తే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించాయి. ఈ గ్రామాలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాయి?
Ice Cream ఆ గ్రామాల్లో ఐస్‌క్రీం బండ్లకు నో ఎంట్రీ
నిజామాబాద్ జిల్లాలోని పలు గ్రామాలు ఇప్పుడు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాయి. సాధారణంగా వేసవి కాలం వస్తే ఐస్‌క్రీం బండ్ల సందడి కనిపిస్తుంది. కానీ, ఈ జిల్లాలోని అనేక గ్రామ పంచాయతీలు మాత్రం తమ వీధుల్లోకి ఐస్‌క్రీం తోపుడు బండ్లు రాకుండా నిషేధాన్ని విధిస్తున్నాయి. కేవలం నోటి మాటతోనే కాకుండా, గ్రామ సభల్లో అధికారికంగా తీర్మానాలు చేస్తూ, నిబంధనలను కఠినం చేశాయి. ఈ నిర్ణయం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
24
ఐస్‌క్రీం బండ్ల పై నిషేధం.. పెరుగుతున్న గ్రామాలు
ప్రారంభంలో కొన్ని గ్రామాలకే పరిమితమైన ఈ ఉద్యమం ఇప్పుడు జిల్లాలోని పలు మండలాలకు పాకింది. డిచ్‌పల్లి మండలం సుద్దపల్లి, మాక్లూర్ మండలం మందాపూర్, డొంకేశ్వర్ మండలం గాదేపల్లి, అన్నారం, నూత్‌పల్లి, తొండాకూర్ గ్రామాలు ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. అలాగే నందిపేట్, ఆర్మూర్, ముప్కాల్, వేల్పూర్ మండలాల్లోని పలు గ్రామ పంచాయతీలు కూడా ఏకగ్రీవ తీర్మానాలు చేశాయి. ఊరిలోకి వచ్చే దారుల వద్ద ఐస్‌క్రీం బండ్లు రావొద్దు అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
34
ఐస్‌క్రీం బండ్లకు నో ఎంట్రీ.. అసలు కారణం ఇదే
ఈ కఠిన నిర్ణయాల వెనుక ప్రధాన కారణం పిల్లల ఆరోగ్య పరిరక్షణే. తోపుడు బండ్లపై విక్రయించే ఐస్‌క్రీంలలో నాణ్యత ఉండదని, రంగులు, హానికరమైన రసాయనాలను కలుపుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిని తినడం వల్ల చిన్న పిల్లలకు వెంటనే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు రావడమే కాకుండా, దీర్ఘకాలంలో కేన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో గ్రామాభివృద్ధి కమిటీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
నిషేధాజ్ఞలను ధిక్కరించి ఎవరైనా గ్రామంలో ఐస్‌క్రీం విక్రయాలు జరిపితే, వారికి రూ. 5,000 జరిమానా విధించనున్నట్లు పంచాయతీలు ప్రకటించాయి. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఈ నిబంధనలు కఠినంగా అమల్లోకి వచ్చాయి. "గ్రామస్తుల సహకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, పిల్లల భవిష్యత్తు కోసం ఇలాంటి కఠిన నిర్ణయాలు తప్పవని" ఐస్‌క్రీం బండ్ల ఎంట్రీని నిషేధించిన గ్రామాలు పేర్కొంటున్నాయి.