టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ : తండ్రిలా పోలీసు కావాలనుకున్నాడు.. పేపర్ లీక్, డబుల్ బబ్లింగ్, బ్లాక్ మెయిలింగ్ తో...

First Published | Apr 13, 2023, 9:53 AM IST

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం పేపర్ లీక్ ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ తండ్రిలా పోలీస్ కావాలనే పేపర్ లీక్ కు పాల్పడినట్లు తేలింది. దీనికోసం పేపర్ లీక్ తో పాటు డబుల్ బబ్లింగ్ కు కూడా పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. 

హైదరాబాద్ : గ్రూప్ వన్ ప్రశ్నాపత్రం లీకేజీ వెనక ఉన్న ప్రధాన నిందితుడు ప్రవీణ్ కుమార్ లీలలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. ప్రవీణ్ కుమార్ తండ్రి పోలీస్ అధికారి కావడంతో.. తండ్రికి అందరూ ఇచ్చే  గౌరవాన్ని చూసి.. తానూ తండ్రి లాగేపోలీస్ అవ్వాలని కలలు కన్నాడు. కానీ, దీనికోసం కష్టపడాల్సింది పోయి.. అడ్డదారులు తొక్కాడు. చివరికి కటకటాల పాలయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలు ఈ మేరకు..

ప్రవీణ్ కుమార్ తండ్రి అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న సమయంలో.. విధినిర్వహణలో ఉండగానే మరణించాడు. దీంతో కారుణ్య నియామకం కింద ప్రవీణ్ కుమార్ కు గవర్నమెంట్ ముద్రణ సంస్థలో ఉద్యోగం లభించింది. అక్కడ ఉద్యోగం చేస్తూ క్రమంగా ఎదుగుతూ ప్రవీణ్ టీఎస్పీఎస్సీలో వచ్చి..  ఏఎస్ఓ వరకు  ఎదిగాడు. అక్కడ కమిషన్ కార్యదర్శి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసేవాడు. ఈ  క్రమంలో నమ్మకస్తుడిగా పేరుపొందాడు. తన తోటి ఉద్యోగులతో మాట్లాడుతూ పదేపదే తాను పోలీస్ అధికారిని అవుతానని చెబుతుండేవాడు. 

Latest Videos


టిఎస్పిఎస్సి కమిషన్లో నెట్వర్క్ అడ్మిన్ గా రాజశేఖర్ రెడ్డి అనే కాంట్రాక్టు ఉద్యోగి పనిచేసేవాడు. అతడికి రెండు నెలల జీతం ఆగిపోయింది. దీన్ని ప్రవీణ్ దగ్గర మొర పెట్టుకోగా అతని జీతం వచ్చేలా చేస్తానని అభయమిచ్చాడు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ రాజశేఖర్ రెడ్డికి జీతం వచ్చింది. అయితే, అది తానే పైరవీ చేసి ఇప్పించానని ప్రవీణ్ నమ్మించాడు. ఈ క్రమంలోనే గ్రూప్ వన్ నోటిఫికేషన్ రానుందన్న సమాచారం వచ్చింది. దీంతో ప్రవీణ్ అప్రమత్తమయ్యాడు. గ్రూప్ వన్ పరీక్ష రాసి జైలర్ పోస్టు లేదా డి.ఎస్.పి అవ్వాలని అనుకున్నాడు.  

దీనికోసం అడ్డదారులు తొక్కాడు. రాజశేఖర్ రెడ్డితో కలిసి నిరుడు అక్టోబర్ ఫస్ట్ వీక్ లో.. పెన్ డ్రైవ్ లో ప్రశ్నాపత్రాలను కాపీ చేశారు. ఆ తర్వాత గ్రూప్ వన్ పరీక్ష రాశాడు ప్రవీణ్. అయితే, పేపర్ లీకైన విషయం తెలిస్తే తన ఉద్యోగం పోతుందని భయపడ్డాడు. దీనికోసం డబుల్ బబ్లింగ్ చేశాడు. అలాగే, వేరే ప్రశ్నా పత్రాలు కూడా తన చేతికి రావడంతో వాటి నుంచి డబ్బు సంపాదించాలని ప్లాన్ వేశాడు.

డబుల్ బబ్లింగ్ తో..
డబుల్ బబ్లింగ్ తో గ్రూప్ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ లో సుమారు 8000 మంది అనర్హతకు గురైనట్లు అంచనా. ఈ 8వేల మందిలో కొంతమంది కోర్టును ఆశ్రయించి, అవకాశం దక్కించుకోవాలని ఆలోచిస్తున్నారు. ఈ మేరకు న్యాయవాదులను కూడా సంప్రదించారు. లాయర్లు అభ్యర్థుల అభ్యర్థన మేరకు.. తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ప్రవీణ్ వారిని పరిచయం చేసుకొని.. వారి ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు. ఏకంగా వీరందరి ఫోన్ నెంబర్లతో వాట్స్అప్ గ్రూపును  ఏర్పాటు చేశాడు. 

మరోవైపు, వివిధ అవసరాల మేరకు కమిషన్ కార్యాలయానికి వచ్చే యువతులను గమనించేవాడు. వారి బలహీనతలను ఆధారంగా చేసుకుని.. వారికి సహాయం చేస్తానంటూ నమ్మించేవాడు. తనను నమ్మిన తర్వాత వారి ఫోన్ నెంబర్లు తీసుకునేవాడు. ఇంకొంతమందితో ఇంకాస్త ముందుకు వెళ్లి  ఏకాంతంగా మెలిగేవాడు. ఆ సమయంలో వారి నగ్న వీడియోలు, ఫోటోలను సేకరించి, బ్లాక్ మెయిల్ చేసేవాడు. ఈ మేరకు సిట్ అధికారులు ప్రవీణ్ ఫోన్లో లభించిన ఆధారాలతో నిర్ధారించారు.

అంతేకాదు ప్రవీణ్ కి రెండు బ్యాంక్ అకౌంట్ లో ఉన్నట్లుగా తెలుసుకున్నారు. ప్రవీణ్ దగ్గర ఉన్న మిగతా ప్రశ్న పత్రాలను కూడా అమ్మి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ మేరకు రాజశేఖర్ రెడ్డి,  ప్రవీణ్ లను మరోసారి కస్టడీలోకి తీసుకొని విచారించాలనుకుంటున్నారు.

click me!