మార్చి నెల చివరికి వచ్చేసింది. మార్చిలోనే ఎండలు ఈ రేంజ్‌లో ఉంటే ఏప్రిల్‌లో ఎలా ఉంటాయో ఊహించుకోవడానికే భయపడే పరిస్థితి ఉంది. అయితే ఏప్రిల్ నెల మొదలవుతున్న తరుణంలో వాతావారణ శాఖ ప్రజలకు ఒక కూల్ న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 1,2,3 తేదీల్లో వాతావరణం చల్లబడడమే కాకుండా పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మధ్య చత్తీస్గడ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం బలహీనపడింది. దక్షిణ ఛత్తీస్గడ్ నుంచి అంతర్గత మహారాష్ట్ర, అంతర్గత కర్ణాటక మీదుగా అంతర్గత తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. ఈ కారణంగా వచ్చే మూడు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణలో వాతావరణంలో స్పష్టమైన మార్పు కనిపించే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఇక ఈరోజు (సోమవారం) గరిష్టంగా ఆదిలాబాద్‌లో 41.8 కనిష్టంగా నల్లగొండ లో 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం తెలంగాణలో ఆదిలాబాద్, భద్రాచలం, మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్, ఖమ్మం, రామగుండం, హనుమకొండ, నల్లగొండలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఎలా ఉండనుందంటే..
తెలంగాణలో ఓవైపు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉంటే ఏపీలో మాత్రం దీనికి భిన్నంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. సోమవారం ఏపీ వ్యాప్తంగా 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వీలైనంత వరకు మధ్యాహ్నం బయటకు వెళ్లకుండా ఉండాలని చెబుతున్నారు. ఆదివారం ప్రకాశం(D) అమ్మని గుడిపాడు, వైఎస్సార్(D) సిద్ధవటంలో గరిష్టంగా 41.9°C ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు.