Huzurabad Bypoll: సిలిండర్ కు దండంపెట్టి... గుండెలు పగిలేలా కసికసిగా ఓట్లు గుద్దండి: మంత్రి హరీష్ పిలుపు

First Published Oct 11, 2021, 1:51 PM IST

హుజురాబాద్ ప్రజలు టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటెయ్యాలో వంద కారణాలు చెబుతా... బిజెపి కనీసం ఒక్కటంటే ఒక్క కారణం చెప్పగలదా అని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. 

కరీంనగర్: ఇప్పటికి ఆరుసార్లు ఈటల రాజేందర్ ను ఎమ్మెల్యేను చేసారు... ఈ ఒక్కసారి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలిపించాలని హుజురాబాద్ ఓటర్లను కోరారు ఆర్థిక మంత్రి హరీష్ రావు. బీజేపీకి ఓటు వేయడమంటే ...ధరలు పెంచే పార్టీకి ఓటు వేయడమేనని అన్నారు. ఓటేసెటప్పుడు ఒక్కసారి ఇంట్లోని సిలిండర్ కు దండం పెట్టుకుని దాని ధరను గుర్తుచేసుకోవాలని... తమపై భారం పెంచుతారా అని కసి కసిగా బీజేపి గుండెలు పగిలేలా కారు గుర్తుపై ఓట్లు గుద్దండి అని హరీష్ సూచించారు.  

ఇళ్లందకుంట మండలం రాచపల్లిలో హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ప్రచారంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు. టీఆర్ఎస్ నాయకులకు డప్పుచప్పుళ్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో స్వాగతం పలికారు గ్రామస్తులు. మంత్రి హరీష్ కు నాగలిని బహూకరించి భారీ పూలమాలతో సత్కరించారు. 

ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ... తాము బీజేపీ జూటా మాటలు చెబుతూ ధరలు పెంచారని చెబుతున్నామని... అలాగే తమ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది గురించి చెబుతున్నామని అన్నారు. కానీ బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ మాత్రం సీఎం కేసీఆర్ కు ఘోరీ కడతా అంటూ అన్యాయమైనా మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.  
 

''రాజేందర్ గెలిస్తే ఒక్కరు గడ్డకు వస్తారు. కానీ గెల్లు శ్రీనివాస్ గెలిస్తే మీ ఊరంతా గడ్డకు వస్తుంది. ఏం చేస్తారో చెప్పకుండా ఈటల మమ్మల్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నాడు. మమ్మల్ని తిడితే హుజురాబాద్ కు  ఏమైనా లాభమా?'' అని ప్రశ్నించారు. 

''ఏ పార్టీ ఏం చేసింది... ఏ పార్టీకి ఓటు వేస్తే లాభం జరుగుతుందో ఆలోచించండి. టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలంటే నేను వంద కారణాలు చెబుతా. ఆసరా పెన్షన్ రూ.200 నుంచి రూ.2000 పెంచి ఓ అమ్మకు పెద్ద కొడుకులా సీఎం కేసీఆర్ మారారు. కాబట్టి ఓటు వేయాలని చెబుతా. పేదింటి ఆడపిల్లకు కులం మతం లేకుండా లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చారు... అందుకు ఓటు వేయాలని చెబుతా. పేదింటి ఆడపిల్ల గర్బవతి అయితే కాన్పు ఉచితంగా చేసి, 12 వేలు  ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇంచి ఆటో కిరాయి లేకుండ తల్లిని, పిల్లని కేసీఆర్ సర్కార్ చేస్తోంది. టీఆర్ఎస్ పార్టీ చేస్తోంది'' అని పేర్కొన్నారు. 

''అంగన్ వాడీల ద్వారా గుడ్లు, పాలు, పిల్లకు పౌష్టిక ఆహారం ఇస్తున్నాం. బడికి వెళ్లాలంటే గురుకులాలు పెట్టి మంచి విద్య ఇస్తున్నాం. రైతులకు టీఆర్ఎస్ వచ్చాక కరెంటు మోటర్లు కాల్తున్నాయా? ట్రాన్స్ఫార్మర్లు పేలుతున్నాయా? కాళేశ్వరం నీరు పోయిన వేసవిలో కాలువల నిండా పారిందా లేదా? కాళేశ్వరం ప్రాజెక్టుతో నీళ్లు తెచ్చిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ'' అన్నారు హరీష్. 
 

''రైతులకు అప్పు దొరక్క బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి. కాని ఇప్పుడు ఎకరానికి ప్రతి ఏడాదికి పది వేలు బ్యాంకుల్లో పడుతున్నాయా లేదా. గతంలో రైతులు శిస్తులు కట్టేవారు... నీటి తీరువా చెల్లించేవారు... కానీ అవి రద్దు చేసి కేసీఆర్ వారికే తిరిగి రైతు బంధు కింద డబ్బులు ఇస్తున్నది వాస్తవం కాదా. రైతు చనిపోతే భీమా కింద ఐదు లక్షలు ఇచ్చి ఎంతమంది కుటుంబాలను నిలబెట్టిన పార్టీ కారు గుర్తు పార్టీ'' అని తెలిపారు. 

''బీజేపీ వాళ్లు ఏం చేశారు. పెట్రోల్ ధర రూ.107, డిజీల్ రూ.100 రూపాయలు దాటింది. దీంతో రైతుకు దుక్కి దున్నడానికి, వరి కోత మిషన్ కు  ఖర్చు పెరిగింది. పంట పంటకు రూ.3 వేలు గుంజే బీజేపీ పార్టీ గెలవాలా... ఎకరానికి ఏడాదికి పది వేలు ఇచ్చే పార్టీ గెలవాలా. మనం ఇంట్లో కూర్చుంటే పెట్టుబడి సాయం బ్యాంకుల్లో వేసే కేసీఆర్ మంచివాళ్లా... ఢిల్లీలో కూర్చుని పెట్రోల్, డీజిల్ పెంచి మూడు వేలు తీసుకునే వారు మంచివాళ్లా... ఆలోచించాలి'' అని హరీష్ అన్నారు. 

''తన కోసం, తన రక్షణ కోసమే ఈటల బీజేపీలో చేరారు. గ్యాస్ సిలిండర్ ధర వేయి రూపాయలు చేశారు... ఈటల చేరిన పార్టీ ప్రభుత్వమే కదా ఢిల్లీలో ఉంది. 'రాచపల్లికి వచ్చి నేను బీజేపీలో చేరాను. నన్ను గెలిపించండి. వేయి నుంచి 500 రూపాయలకు సిలిండర్ ధర తగ్గిస్తానని ఎందుకు చెప్పడం లేదు' ధరలు పెంచడం చాలదన్నట్లు సబ్సిడీని కూడా 250 నుంచి 40 రూపాయలకు తగ్గించారు. సిలిండర్ ధర 1500 చేయమని ఓటు వేయాలా'' అని హరీష్ నిలదీసారు. 
 

''అమ్మకాల బీజేపీకి ఓటు వేద్దామా...నమ్మకాలు నిలబెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేద్దామా.. రైతు రుణ మాఫీ చేస్తామని చెప్పాం. ఇప్పటికే 25 వేల లోపు రుణాలు మాఫీ చేశాం. ఇప్పుడు 50 వేల లోపు రుణాలు మాఫీ చేస్తున్నాం. వచ్చే ఉగాది తర్వాత లక్ష రూపాయల లోపు రుణ మాఫీని వడ్డీతో మాఫీ చేస్తాం'' అని ఆర్థిక మంత్రి స్పష్టం చేసారు. 

''ఐదేళ్ల కింద ఈటల రాజేందర్ కు ఈ నియోజకవర్గ పేదలకు కట్టివ్వమని 4 వేల ఇళ్లు ఇచ్చారు. మేం అంతటా ఇళ్లు కట్టాం... సిద్దిపేటలో రూపాయి ఖర్చు లేకుండా కట్టించాను.కానీ ఈ ఐదేళ్లలో ఒక్క ఇళ్లు కూడా రాజేందర్ కట్టలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్ గా ఉన్నారు... ఆయన ఐదు వేల ఇల్లు కట్టారు. అబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఇళ్లు కట్టారు. కానీ ఒక్క ఇళ్లు కూడా కట్టని మంత్రి ఈటల మాత్రమే.మంత్రిగా ఒక్క ఇళ్లు కట్టలేదు... ఇప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా రేపు కట్టించగలుగుతాడా.. ఆలోచించండి'' అన్నారు. 

''తమ్ముడు గెల్లును గెలిపించండి. రెండున్నరేళ్లలో ఐదు వేల ఇళ్లు కట్టిస్తా. స్వంత జాగా ఉన్న వాళ్లకు ఇళ్లు కట్టిస్తాం. రేపు మళ్లీ మేం మీ దగ్గరకు ఓట్లకు రావాలి. మేం తోడుగా ఉంటాం గెల్లు శ్రీనుకు. నేను కట్టించి చూపించా మా ఊర్లో.. గెల్లును గెలిపించండి. మీ గ్రామంలో కూడా ఇళ్లు కట్టించే బాద్యత తీసుకుంటా'' అని హరీష్ హమీ ఇచ్చారు 
 
 

click me!