నాణ్యమైన విద్యను అందించాలనే నిజాంల సంకల్పం నుంచి ఈ కాలేజ్ ఆవిర్భవించింది. ఆరో నిజాం మహబూబ్ అలా ఖాన్ బహదూర్ నగరంలో తొలి పాఠశాలను 1865లో స్థాపించారు. తర్వాత దాన్ని ప్రస్తుత మూడంతస్తుల కాలేజీకి మార్చారు. తర్వాత అదే సిటీ కాలేజ్‌గా ఘనతను చాటుకుంటూ వస్తున్నది. 1921లో 30 విద్యార్థులతో ప్రారంభమైన ఈ కాలేజీ నేడు 4,500 మంది పీజీ, యూజీ విద్యార్థులకు, మరో 2000 మంది ఇంటర్ కాలేజీ విద్యార్థులకు విద్యను అందిస్తున్నది. తక్కువ వనరులతోనే కాలాన్ని నెట్టుకుంటూ వస్తున్నది. ఈ కాలేజ్‌ను మరో వందేళ్లు కొనసాగించాలని కాలేజీ అల్యూమ్నీ, బోధకులు, నగరవాసులూ భావిస్తున్నారు.
స్థాపించినప్పటి నుంచి దీర్ఘకాలం నగరంలో నెంబర్ వన్ కాలేజీగా ఇది నిలిచింది. ఇప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్‌గా ఉన్నదని కాలేజీ అల్యూమ్నీ చెబుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ రిజిస్ట్రార్ సీ విద్యాధర్ భట్, భారత తొలి పట్టణ ప్రణాళికాకర్త ఎం ఫయాజుద్దీన్, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం మర్రి చెన్నా రెడ్డి, కేంద్ర మాజీ మంత్రులు పీ శివ శంకర్, శివరాజ్ పాటిల్, అర్జునఅవార్డీ ఫుట్ బాల్ క్రీడాకారుడు యూసుఫ్ ఖాన్, క్రికెటర్ అర్షద్ అయూబ్, ఇంటర్నేషనల్ సైక్లిస్ట్ సయ్యద్ సలీం అలీ సహా మరెందరో ఈ కాలేజీలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించారు.