AP and Telangana Weather Update: తెలంగాణలో గత 10 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వాతావరణ శాఖ 3 రోజులపాటు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ రహదారులు జలమయంగా మారుతున్నాయి. లోతట్టు ప్రాంతాలవాసులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
బంగాళాఖాతంలో అల్ప పీడనం కొనసాగుతున్నది. ఇది విశాఖపట్నానికి సమీపంలో నెమ్మదిగా కదులుతోంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు ఒడిశా తీరం దాటనుంది. ఒకసారి తీరం దాటిన తర్వాత మళ్లీ సముద్రంలోకి వెళ్ళిన ఈ అల్పపీడనం, ఇప్పుడు మళ్లీ ఒడిశా తీరాన్ని తాకనుంది. తీరం దాటిన వెంటనే బలహీనపడుతుందని గ్యారెంటీ లేదు, కానీ వాయుగుండంగా మారే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు జిల్లాల్లో వాతావరణం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే?
25
అక్కడక్కడా అతి భారీ వర్షాలు
భారత వాతావరణ శాఖ (IMD) తాజా బులిటెన్ ప్రకారం, ఇవాళ (సోమవారం) ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు (Extremely Heavy Rainfall) కురిసే అవకాశాలు ఉన్నాయి. కోస్తాంధ్ర లో 18 నుంచి 20 తేదీల వరకు భారీ వర్షాలు కొనసాగనున్నాయి. రాయలసీమలో 18న, తెలంగాణలో 18, 19న భారీ వర్షాలు కొనసాగుతాయి. ఇక ప్రాంతాల వారీగా, తెలంగాణ, రాయలసీమలో అక్కడక్కడా అతి భారీ వర్షాలు (Very Heavy Rainfall) కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో వచ్చే 5 రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
35
తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక: రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు జారీ
తెలంగాణ వాతావరణ విషయానికి వస్తే... తెలంగాణలో గత 10 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ నేటి నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ములుగు, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, ఖమ్మం, ఆసిఫాబాద్, మంచిర్యాల, సిద్దిపేట, ఆదిలాబాద్, ఇతర జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
అధికారులు ప్రజలకు అప్రమత్తంగా ఉండి, లోతట్టు ప్రాంతాలవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివేలా సూచించారు. ప్రజలు మధ్యాహ్నం నుంచి రాత్రివరకు భారీ వర్షాలకు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణలో గాలి వేగం గంటకు 19 కిలోమీటర్లుగా ఉంది. ఉష్ణోగ్రత 22 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య మారుతూనే ఉంటుంది. తేమ పగటివేళ సుమారు 88 శాతం ఉండగా, రాత్రి వేళ 91 శాతానికి చేరుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమలో అక్కడక్కడా అతిభారీ వర్షం కొనసాగుతుందని, కొన్ని ప్రాంతాల్లో వాన తక్కువగా ఉండే అవకాశముందని IMD తెలిపింది. మధ్యాహ్నం తర్వాత వర్షం తీవ్రత కొంత పెరుగుతుంది.
ఇక ఏపీలో గాలి వేగం గంటకు 16 కిలోమీటర్లుగా ఉంది. ఉష్ణోగ్రత 26 నుండి 28 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. తేమ పగటివేళ 85 శాతం, రాత్రివేళ 85 శాతం. దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో రోజంతా వర్షాలు కొనసాగుతాయి, రాత్రి వేళ వర్షం మరింత పెరుగుతుంది. తెలంగాణతో పోలిస్తే, APలో వర్షపాతం కొంత తక్కువగా ఉంటుంది.
55
హైదరాబాద్‌లో వర్షాల పరిస్థితి:
హైదరాబాద్ లో రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు రోజంతా కొనసాగే అవకాశముంది. హైదరాబాద్‌లో ఆదివారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షంతో నగరంలోని ప్రధాన రహదారులను నీటమునిగాయి. ఫిలింనగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట వంటి ప్రాంతాలు జలమయంగా మారాయి. భారీ వర్షం, ఈదురు గాలులు కారణంగా కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కూడా ఏర్పడింది.
GHMC, SDRF సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినా, అధికారులు ప్రజలు స్వయంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రోడ్లపై వరద నీరు, ట్రాఫిక్ జామ్‌ల కారణంగా వాహనాలు నెమ్మదిగా కదలుతున్నాయి. ప్రజలు అవసరమైతే ప్రయాణాలను వాయిదా వేసి, లోతట్టు ప్రాంతాలవాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.