Local Body Elections: రేవంత్ రెడ్డికి ఓటమి భయం? స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల రగడ ఏంటి?

Published : Jul 29, 2025, 08:55 PM IST

Local Body elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల అంశంతో కొలిక్కి రావడం లేదు. అయితే ఇది నిజంగా రిజర్వేషన్ల కారణమా? లేక కాంగ్రెస్ ఓటమి భయమా అన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తోంది.

PREV
17
స్థానిక సంస్థల ఎన్నికలు: బీసీ రిజర్వేషన్లు రాజకీయ ఆయుధమా?

తెలంగాణ కేబినెట్ తాజాగా తీసుకున్న నిర్ణయంతో స్థానిక సంస్థల అంశం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రిజర్వేషన్ల అంశం కొలిక్కి వచ్చిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం వాయిదా పడింది. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల అవసరాన్ని ప్రధాన కారణంగా చూపుతోంది.

అయితే, ప్రతిపక్ష పార్టీలు ఓటమి భయంతో సీఎం రేవంత్ సర్కారు స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేస్తోందని విమర్శలు చేస్తున్నాయి. ఇదే, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది ఎన్నికల ఓటమి భయంతో తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. దీంతో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. అసలు ఈ కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

27
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు క్యాబినేట్ నిర్ణయం

తాజాగా (జూలై 28 సోమవారం) జరిగిన తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లను 42% కు పెంచుతూ బిల్లును గవర్నర్‌కు పంపిన విషయంపై చర్చించారు. దీనికి ఇంకా ఆమోదం రాలేదు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. 

కులగణన నివేదిక ఆధారంగా బీసీ జనాభా 56.33%గా ఉందని ప్రభుత్వం గుర్తించింది. కానీ, సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ల పరిమితిని విధించడంతో, చట్టపరమైన స్పష్టత లేకుండా ముందుకు పోవాలనుకోవడం సమస్యలు తీసుకువస్తుందని ప్రభుత్వం పేర్కొంటోంది.

37
స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు?

తెలంగాణ పంచాయతీల పదవీకాలం 2024 జనవరి 31న ముగిసినా, ఇప్పటివరకు ఎన్నికలు జరగకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. దీనికి ప్రభుత్వం పలు కారణాలు పేర్కొంటోంది. వాటిలో 42% బీసీ రిజర్వేషన్ల కోసం కొత్త బిల్లు ప్రస్తుతం గవర్నర్ ఆమోదం కోసం వెయిటింగ్ లో ఉంది. 

అలాగే, రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు ఆదేశాలపై సమన్వయంతో సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఏ చర్యా తీసుకోలేమన్న ఆత్మరక్షణ భావన కూడా కనిపిస్తోంది. పారదర్శక కులగణన డేటాను కూడా ప్రస్తావించింది. అయితే ఈ కారణాలన్నీ తాత్కాలిక అడ్డంకులా, లేక రాజకీయ లబ్ధి కోసం కావాలనే ఏర్పరచుకున్న అడ్డంకులా? అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

47
నిజంగానే బీసీ రిజర్వేషన్లే కారణమా? రాజకీయ, సామాజిక కారణాలు ఏమిటి?

ప్రభుత్వం చెబుతున్నట్టుగా బీసీ రిజర్వేషన్లు ప్రధానమైన కారణం కావచ్చు. కానీ, ఇది చట్టపరమైన కారణం మాత్రమే కాదు. రాజకీయ వ్యూహాలు, సామాజిక సమతుల్యతలు కూడా ఉన్నాయి. వాటిలో రాజకీయ కారణాలు గమనిస్తే.. కాంగ్రెస్ పార్టీకి గ్రామీణ స్థాయిలో బలాన్ని పెంచుకునే సమయం అవసరం ఉంది. కొన్ని స్థానాల్లో బలమైన పట్టు లేదు. సమయాన్ని ఉపయోగించుకోవాలని చూస్తోంది.

బీసీ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునేందుకు 42% రిజర్వేషన్లు ఒక ముఖ్యమైన హామీ. ప్రతిపక్షాలకు ఎక్కువ అవకాశాలు ఇవ్వకుండా చేసే వ్యూహం కూడా ఉంది. బీఆర్‌ఎస్, బీజేపీ లాంటి పార్టీలను బీసీ రిజర్వేషన్లతో మౌనంగా ఉంచే ప్రయత్నం కూడా ఉంది. సంక్షేమ పథకాలు ఫలితాల రూపంలో ప్రజల వద్దకు చేరాకే ఎన్నికలు నిర్వహించాలని వ్యూహం కూడా ఉంది. దీనివల్ల కాంగ్రెస్ కు మరింతగా ప్రజల్లో సానుకూలత రావచ్చు.

సామాజిక కారణాలు గమనిస్తే.. బీసీలకు ప్రాతినిధ్యం కల్పించడమనేది సామాజిక న్యాయంగా భావిస్తున్నారు. ఇది అధికార కాంగ్రెస్ ప్లస్ పాయింట్ గా మారుతుంది. ముస్లింలకు రిజర్వేషన్ల అంశం ద్వారా మైనారిటీ మద్దతును నిలబెట్టుకోవాలని ప్రయత్నాన్ని కూడా చూడవచ్చు.

57
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రేవంత్ సర్కారుకు హైకోర్టు ఆదేశాలేంటి?

స్థానిక ఎన్నికల విషయంలో ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సెప్టెంబర్ 30, 2025 నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశించింది. వార్డుల విభజన 30 రోజుల్లో పూర్తిచేయాలి. రిజర్వేషన్ల ప్రక్రియ ఒక నెలలోగా పూర్తి చేయాలి. పంచాయతీల పదవీకాలం ముగిసిన 18 నెలలైనా ఎన్నికలు జరగకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అందుకే విచారణ సందర్భంగా సెప్టెంబర్ 30ని డెడ్ లైన్ గా విధించి సమయం ఇచ్చింది.

67
బీసీ రిజర్వేషన్లను బీజేపీ, బీఆర్ఎస్ సహా ఇతర పార్టీలు ఏమంటున్నాయి?

బీజేపీ ముస్లింలకు బీసీ కోటాలో రిజర్వేషన్లు మత ఆధారితంగా ఉండడం రాజ్యాంగ విరుద్ధమనే ఆరోపణలు చేస్తోంది. అసలైన బీసీలకు అన్యాయం జరుగుతోందని, పారదర్శకత లేదని విమర్శలు చేస్తోంది. ఇది కేవలం ఓటు బ్యాంకు రాజకీయమని, చివరకు చట్టపరమైన సవాళ్లకు దారితీస్తుందని హెచ్చరిస్తోంది. బహిరంగంగానే తీవ్ర వ్యతిరేకతను తెలుపుతోంది.

బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ చర్యపై విమర్శలు చేస్తోంది. సూత్రప్రాయంగా వ్యతిరేకించడం లేదు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంపై వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఎంఐఎం ముస్లింలకు రిజర్వేషన్ల పెంపును సమర్థిస్తోంది.

77
తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ ధర్నా ప్లాన్ ఎందుకు చేస్తోంది?

గవర్నర్ ఆమోదంలో ఆలస్యంలో కేంద్రంలోని బీజేపీ హస్తం ఉందని ఆరోపణలను కాంగ్రెస్ చేస్తోంది. బీజేపీపై ఒత్తిడి పెంచే వ్యూహం తో పాటు బీసీ వ్యతిరేక పార్టీగా ప్రజల్లో బీజేపీని చూపించాలన్న ప్రయత్నం కూడా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. అలాగే, జాతీయ దృష్టిని ఆకర్షించి బీసీ సమస్యలను ఢిల్లీకి తీసుకెళ్లి కాంగ్రెస్ గళాన్ని ప్రజల్లో వినిపించాలనే లక్ష్యంగా కూడా కనిపిస్తోంది. రాబోయే ఎన్నికలకు ముందు బీసీ ఓటు బ్యాంకులో ప్రభావం చూపించాలన్న సంకేతాలుగా కూడా భావించవచ్చు. అయితే, ప్రతిపక్ష పార్టీలు కావాలనే బీసీ రిజర్వేషన్లను అడ్డుకునే చర్యలకు దిగుతున్నాయని తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ అవుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ లపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతోంది. 

మొత్తంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కేవలం ఓటింగ్ ప్రక్రియ మాత్రమే కాదు ఇది రాజకీయ ప్రయోగశాలగా కూడా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు అనే సామాజిక న్యాయ అంశం, ప్రభుత్వం-గవర్నర్ మధ్య చాకచక్యాలు, ప్రతిపక్షాల వ్యూహాలు అన్నీ కలిసి దీనిని ఓ కీలక ప్రజాస్వామ్య పరీక్షగా మార్చేశాయి. సెప్టెంబర్ 30 గడువులో ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా మరోసారి రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతారా అనేది చూడాలి !

Read more Photos on
click me!

Recommended Stories