కురుమూర్తి స్వామి సన్నిధిలో ఉన్న మట్టికుండ ఆచారం మరో ప్రత్యేకత. అప్పంపల్లికి చెందిన కుమ్మరులు మట్టికుండను తయారు చేస్తారు. ఆ కుండను ‘తలియకుండ మండపం’లో నెల్లి వంశీయులు పూజిస్తారు. ఈ సందర్భంలో డప్పు వాయిద్యాలు, బాణసంచా, ఊరేగింపులు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఈ ఆలయంలో 1810–1840 మధ్య ఆంజనేయస్వామి ఆలయం, 1857–78 మధ్య నగారా బంగ్లా, ఉద్దాల మండపం వంటి నిర్మాణాలు రాజా శ్రీరాం భూపాల్ ఆధ్వర్యంలో జరిగాయి. ప్రతి సంవత్సరం హంసవాహనంపై స్వామివారి ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంటుంది.
కురుమూర్తి ఎలా చేరుకోవాలి.?
మహబూబ్‌నగర్ పట్టణం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో కురుమూర్తి ఉంది.
మహబూబ్‌నగర్ – దేవరకద్ర – కౌకుంట్ల మార్గం ద్వారా సులభంగా చేరవచ్చు.
కురుమూర్తి రైల్వే స్టేషను ఆలయం నుంచి కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది.
7వ నెంబర్ జాతీయ రహదారి (NH-7)పై ఉన్న కొత్తకోట నుంచి కొత్తపల్లి, దుప్పల్లి మీదుగా 18 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే ఆలయానికి చేరుకోవచ్చు.