Konda Surekha: పదవి పోయిందని ఇంట్లో కూర్చోం.. కొండా సురేఖ కీల‌క వ్యాఖ్య‌లు

Published : Sep 13, 2026, 03:48 PM IST

Konda Surekha: మంత్రి పదవి నుంచి తొలగించడంపై తనకు బాధ లేదని, అయితే ఎలాంటి కారణం లేకుండా పదవి నుంచి తప్పించడం మాత్రం ఆవేదన కలిగించిందని ఎమ్మెల్యే కొండా సురేఖ అన్నారు. బర్తరఫ్‌ తర్వాత తొలిసారి మాట్లాడిన ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

PREV
13
అవకాశవాద రాజకీయాలపై సురేఖ విమర్శలు

ప్రస్తుతం రాజకీయాల్లో అవకాశవాద ధోరణి పెరిగిపోయిందని కొండా సురేఖ వ్యాఖ్యానించారు. తాను ఎంపీపీ స్థాయి నుంచి మంత్రి వరకు ఎదిగానని గుర్తుచేసుకున్నారు. ఒక సిద్ధాంతం, నమ్మకంతో రాజకీయాల్లో కొనసాగిన తమ కుటుంబానికి పదవుల కంటే ప్రజలతో ఉన్న అనుబంధమే ముఖ్యమని చెప్పారు. గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కోసం మంత్రి పదవిని సైతం వదులుకున్న విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌లో టికెట్‌ దక్కని సమయంలో కేసీఆర్‌ తనను పిలిచి వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుంచి అవకాశం ఇచ్చారని తెలిపారు. ఆ ఎన్నికల్లో తాము విజయం సాధించామని చెప్పారు. ప్రజల కోసం పనిచేయడమే తమ రాజకీయ ప్రాధాన్యం అని, పదవి ఉన్నా లేకపోయినా ప్రజల్లోనే ఉంటామని సురేఖ స్పష్టం చేశారు.

23
రేవంత్‌రెడ్డిని ప్రశంసించిన కొండా సురేఖ

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటం, తనకు మంత్రిగా అవకాశం రావడం వెనుక పార్టీపై ఉన్న నమ్మకమే కారణమని సురేఖ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని ఆమె ప్రశంసించారు. కాంగ్రెస్‌కు మాస్‌ లీడర్‌గా రేవంత్‌రెడ్డి అవసరం అని తాను తొలినాళ్లలోనే చెప్పినట్లు తెలిపారు. మంత్రి పదవి ఇప్పుడు లేకపోయినా తన ప్రజా జీవితం ఆగదని స్పష్టం చేశారు. ఇంటికే పరిమితమై విశ్రాంతి తీసుకునే ఆలోచన లేదని, ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై పనిచేస్తామని చెప్పారు. రాబోయే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అన్ని స్థానాల్లో విజయం సాధించేలా కార్యకర్తలంతా కష్టపడాలని పిలుపునిచ్చారు.

33
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు: కొండా మురళి

ఇక కొండా మురళి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీతో తమ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్టీని వీడే ఆలోచన తమకు లేదన్నారు. కొండా సురేఖను గెలిపించడంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పాత్ర ఉందని చెప్పారు. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ రాజకీయ లక్ష్యమని తెలిపారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయని, పోతుంటాయని.. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే తమ కుటుంబ విధానమని మురళి పేర్కొన్నారు. కృతజ్ఞత అనేది తమ కుటుంబంలో భాగమని చెప్పారు. సురేఖను క్షమాపణ చెప్పాలని సూచించిన సందర్భంలోనూ ఆమె తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు. పదవి కోసం విలువలను మార్చుకోబోమని స్పష్టం చేస్తూ, జీవితంలో ఎన్ని రోజులు ఉన్నామన్నదాని కంటే ఎలా జీవించామన్నదే ముఖ్యమని కొండా మురళి వ్యాఖ్యానించారు.

Read more Photos on
click me!

Recommended Stories